మహిళ దారుణ హత్య

మహిళ దారుణ హత్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మహిళ దారుణ హత్య

Update: 2023-07-01 03:02 GMT

కరీంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ఓ మహిళా వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. భగత్‌నగర్‌లోని క్రిస్టల్‌ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో ఆమెను అంతమొందించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే మహిళ ప్రాణాలు తీసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గుండా శ్రీపాల్‌రెడ్డితో సరిత కు 2001లో ప్రేమ వివాహం జరిగింది. గోదావరిఖనిలో కాపురుమున్నారు. సరిత గోదావరిఖనిలోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం భర్త శ్రీపాల్‌రెడ్డికి ఇష్టం లేదు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది నుంచి సరిత భర్తకు దూరంగా ఉంటోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడూ కరీంనగర్‌కు వెళ్లే సరితకు భగత్‌నగర్‌లోని క్రిస్టల్‌ అపార్ట్‌మెంట్‌ 203 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న వెంకటేశ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సరిత రూ.20 లక్షలకుపైగా నగదు వెంకటేశ్‌కు ఇచ్చింది. సరిత తమ్ముడు ఆకుల సతీశ్‌ కూడా కరీంనగర్‌లోని రాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సరిత తన పిల్లలను తీసుకుని కొన్ని రోజులుగా తమ్ముడి ఇంట్లోనే ఉంటోంది. జూన్‌ 28న కొడుకులను గోదావరిఖని పంపి, అదేరోజు సాయంత్రం వెంకటేశ్‌తో కలసి వరంగల్‌కు వెళుతున్నట్లు తమ్ముడికి చెప్పింది. ఈ మర్నాడు సరిత తమ్ముడు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. సరిత ఫోన్‌ నుంచి ఆమె తమ్ముడికి వెంకటేశ్‌ వాట్సాప్‌ కాల్‌ చేసి.. సరిత తన ఫ్లాట్‌లో ఉందని.. ఆమెను తీసుకెళ్లాలని సమాచారం అందించి పరారయ్యాడు. సరిత సోదరి స్వాతి, తమ్ముడు సతీశ్‌ హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తాళం పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో తలపై తీవ్రగాయాలతో పడి ఉంది. ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.

సతీశ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రవికుమార్ ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబది కింద దాదాపు రూ. 25 లక్షలు వెంకటేశ్‌కు సరిత ఇచ్చిందని, ఆ డబ్బు అడగడంతో ఇంత దారుణానికి ఒడిగట్టాడని సతీష్ పోలీసులకు తెలిపాడు. పోలీసులు అపార్ట్‌మెంట్‌ సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడు వెంకటేశ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News