ఆమె కూడా మనతో ఉంటుంది.. భార్యకు ప్రపోజల్ పెట్టిన భర్త.. ఆ తర్వాత ?

ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో.. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం స్వప్న - శ్రీనివాస్ లకు తరుణ్ (కొడుకు), ఒక కుమార్తె పుట్టారు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకు

Update: 2022-02-01 07:06 GMT

వివాహేతర సంబంధం అతని ప్రాణాలు తీసింది. అదేదో గుట్టుగా సాగించలేదు. ఆమె కూడా మనతో ఉంటుందని భార్యకు ప్రపోజల్ పెట్టగా.. భరించలేని భార్య సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. ఈ ఉదంతం నిర్మల్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుచానూరుకు చెందిన కంచికట్ల శ్రీనివాస్(42) అనాధ. ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లి ఆటో డ్రైవర్ గా స్థిరపడ్డాడు. ఆటోడ్రైవర్ గా చేస్తున్న సమయంలో.. ఉప్పల్ లో ఓ బట్టల దుకాణంలో పనిచేసే స్వప్న అనే మహిళతో శ్రీనివాస్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపేట కు చెందిన స్వప్నకు అప్పటికే పెళ్లై.. భర్త నుంచి విడాకులు తీసుకుంది. కొడుకు రాజ్ కుమార్ తో కలిసి జీవనం సాగిస్తుంది.

ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో.. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం స్వప్న - శ్రీనివాస్ లకు తరుణ్ (కొడుకు), ఒక కుమార్తె పుట్టారు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకు శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో బాగా లాభాలు రావడంతో.. ఉప్పల్, వేంపేట్ లలో ఇళ్లు నిర్మించి అమ్మేవాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ కు మరొక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం గురించి భార్య స్వప్నకు చెప్పి, ఆమె కూడా మనతోనే కలిసి ఉంటుందని, ఇంటికి తీసుకువస్తానని నచ్చజెప్పాడు. స్వప్న ససేమిరా అందుకు అంగీకరించలేదు. నిత్యం ఈ విషయమై భార్యను వేధిస్తుండేవాడు. భర్త పోరును భరించలేక.. అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది స్వప్న.
తన ఆలోచనను కొడుకులు, అక్క కొడుకు అయిన పోశెట్టిలకు వివరించింది స్వప్న. తమ చేతికి మట్టి అంటకుండా.. సుపారీ ఇచ్చి శ్రీనివాస్ ను చంపిద్దామని పోశెట్టి సలహా ఇచ్చాడు. అందరూ ఓకే అనుకున్న తర్వాత.. పోశెట్టి తన తమ్ముడు చిక్కా, అలియాస్ ప్రవీణ్ కుమార్ ని వేంపేట పిలిపించాడు. వీరంతా కలిసి మెదక్, జగిత్యాల జిల్లాలకు చెందిన బాణాల అనిల్, కంచర్ల మహవీర్, మ్యాతరి మధు, కొలనురి సునీల్, పొన్నం శ్రీకాంత్, పూసల రాజేందర్ తో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్లాన్ ప్రకారం జనవరి 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సుపారీ గ్యాంగ్.. ఇంట్లో నిద్రపోతున్న శ్రీనివాస్ పై రోకలి బండతో దాడి చేశారు. అతని తలపై కొట్టి హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని పరారయ్యారు. అనంతరం పోశెట్టి, రాజ్ కుమార్, చిక్కా లు శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకు‌వెళ్లి నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలం కనకాపూర్ సమీపంలోని వాగులో పడేశారు.
హత్య జరిగిన రెండ్రోజుల తర్వాత పోలీసులకు అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు చేయగా.. అసలు విషయాలన్నీ వెలుగులోకొచ్చాయి. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను గుర్తించగా.. 10 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 73 గ్రాముల బంగారు ఆభరణాలు, హత్యకు వినియోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ లక్ష్మణ్ చాంద తెలిపారు.


Tags:    

Similar News