భర్త-ప్రియుడితో కలిసి మందేసిన వివాహిత

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను భార్య అంతమొందించిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది

Update: 2023-07-21 06:46 GMT

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను భార్య అంతమొందించిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఆ హత్య ఎవరికీ తెలియకుండా ఉండడానికి చాలా ప్లాన్స్ వేసింది కానీ.. పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది.

సంగారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామంలో నివాసముంటున్న కొత్త గొల్ల తుక్కప్ప (55) అనే వ్యక్తికి పది సంవత్సరాల క్రితం ఈశ్వరమ్మ (40) అనే మహిళతో రెండవ వివాహం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) అనే వ్యక్తికి ఈశ్వరమ్మ దగ్గరైంది. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈశ్వరమ్మ ప్రియుడి వ్యవహారం భర్త తుక్కప్పకు తెలిసింది. దీంతో భర్త వాళ్ళిద్దరినీ మందలించాడు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో తుక్కప్పకు ఈశ్వరమ్మకు మధ్య ఎన్నో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈశ్వరమ్మ తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భర్తనే అంతం చేసేందుకు ప్లాన్ వేసింది. గత కొద్ది రోజులగా తుక్కప్ప పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే అదునుగా భావించిన ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి వైద్యం పేరుతో తుక్కప్పను హైదరాబాదుకు వచ్చారు. వీరందరూ కలిసి జూన్ 21న కౌకూర్ దర్గాకు వచ్చి రాత్రి అక్కడే బస చేశారు. జూన్ 22వ తేదీన ఒక బాబాను కలిశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఘట్కేసర్ చేరుకున్నారు. తుక్కప్పను ఘట్కేసర్ బస్ స్టాప్ లో కూర్చోబెట్టి వైద్యుడు ఉన్నాడో లేదో తెలుసుకొని వస్తామని చెప్పి ఈశ్వరమ్మ శ్రీనివాస్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఘట్కేసర్ సమీపంలో ఉన్న ఓ మెడికల్ దుకాణంలో క్రిమిసంహారక మందులు తీసుకొని అనంతరం ఘట్కేసర్ బస్ స్టాప్ లో ఉన్న వైన్ షాప్ లో ఒక బీర్ బాటిల్, రెండు ఓసి క్వార్టర్ డిస్పోజల్ ప్లాస్టిక్ గ్లాసులు కొనుగోలు చేశారు. వైద్యుడు లేడని.. మందు తాగుదామని యమ్నంపేట ఎక్స్ రోడ్డు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం సేవించారు. తుక్కప్ప చేత పురుగుల మందు కలిపిన మద్యం తాగించారు. మద్యం తాగిన అనంతరం తుక్కప్ప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కుప్పకూలిపోయాడు. ఈశ్వరమ్మ, శ్రీనివాస్ అతను మృతి చెందినట్లుగా భావించి అక్కడి నుండి వెళ్లిపోయారు.
జూన్ 22వ తేదీ ఘట్కేసర్ లోని యమ్నంపేట ఎక్స్ రోడ్డు సమీపంలోని అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని గమనించి వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. జూన్ 24వ తేదీన తుక్కప్ప హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. బొప్పారపు బాబు అనే వ్యక్తి మరి కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి ఇటీవల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మృతుడి రెండో భార్య ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు శ్రీనివాస్ ఇద్దరు కలిసి తుక్కప్పను హత్య చేసినట్లుగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈశ్వరమ్మను, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News