ఓ తండ్రి అంతిమ తీర్పు.. కువైట్ నుంచి చంపేసి
తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తినించినందుకు ఒకరిని హత్యచేసి కువైట్ వెళ్లిపోయాడు.
తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తినించినందుకు ఒకరిని హత్యచేసి కువైట్ వెళ్లిపోయాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. పోలీసుల తీరుతోనే తాను హత్యచేసినట్లు వీడియో సందేశం విడుదల చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో తాను హత్య చేశానని ఆ యువకుడు తెలిపారు. హత్యచేసి తాను కువైట్ కు వెళ్లిపోయానని చెప్పాడు. సొంత తాత మనవరాలితో అసభ్యంగా ప్రవర్తించిన కారణంతోనే తాను ఈ హత్య చేసినట్లు ఆ యువకుడు తెలిపాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో గత శనివారం తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు హత్యకు గురయ్యాడు.
అనుమానాస్పద మృతిగా...
పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తానే కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని నిందితుడే సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం సంచలనంగా మారింది. ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. తమ కుమార్తె పన్నెండేళ్ల కుమార్తెను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. ఇటీవల చెల్లెలి మామ మనవరాలి వరస అయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
చంపేసి తిరిగి కువైట్ కు...
ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదని తెలిపాడు. ఆందోళనతో తల్లి కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు దివ్యాంగుడిని పిలిపించి మందలించి వదిలేశారు. వారితో కుమ్మక్కై డబ్బులు తీసుకుని వదిలేశాడని యువకుడు ఆరోపించాడు. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం తో కువైట్ నుంచి వచ్చి, శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దివ్యాంగుడి తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు.ఆడపిల్ల తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు. చట్ట ప్రకారం న్యాయం జరగకనే హత్య చేశానని వెల్లడించారు.