వీడియో కోసం 300 కిలోమీటర్ల వేగంతో బైక్ డ్రైవింగ్.. యూట్యూబర్ దుర్మరణం
ప్రొఫెషనల్ బైకర్, యూట్యూబర్ అగస్త్య చౌహాన్ ‘జడ్‌ఎక్స్ 10ఆర్ నింజా సూపర్ బైక్’పై ప్రయాణిస్తూ తన యూట్యూబ్..
సోషల్ మీడియా ఫేమస్ అవడం కోసం ఏమైనా చేసేందుకు రెడీపోతారు కొందరు. అలా ఓ యూట్యూబర్ వీడియో కోసం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపి దుర్మరణం చెందాడు. ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వే పై ఈ ప్రమాదం జరిగింది. ప్రొఫెషనల్ బైకర్, యూట్యూబర్ అగస్త్య చౌహాన్ ‘జడ్‌ఎక్స్ 10ఆర్ నింజా సూపర్ బైక్’పై ప్రయాణిస్తూ తన యూట్యూబ్ చానల్ కోసం 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో అతను దుర్మరణం చెందాడు. బైక్ పై నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. అధికవేగంతో డివైడర్ ను ఢీ కొట్టడంతో అతను ధరించిన హెల్మెట్ ముక్కలై తలకు తీవ్రగాయాలై మరణించాడు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన అగస్త్య ఢిల్లీలో జరిగే మోటార్ బైక్ రేసింగ్ పోటీ కోసం ఆగ్రా నుంచి బైక్‌పై బయలుదేరాడు. ‘ప్రొ రైడర్ 1000’ పేరుతో అగస్త్య ఓ యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్నాడు. దానికి 1.2 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రమాదం జరగడానికి 16 గంటల ముందు యూట్యూబ్ లో అగస్త్య ఓ వీడియో అప్ లోడ్ చేసి.. ఢిల్లీకి రావాలని స్నేహితులను కోరాడు. ప్రతి వీడియో ముందు అగస్త్య బైక్‌ను వేగంగా డ్రైవ్ చేయొద్దని డిస్ క్లైమర్ వేసేవాడు. కానీ అందరికీ అతివేగం ప్రాణాంతకమని చెప్పిన అతనే.. ఇప్పుడు అదే వేగానికి తన ప్రాణాన్ని బలిచ్చాడు. అగస్త్య మరణంపట్ల అతని ఫాలోవర్లు సంతాపం తెలిపారు.