కళా పక్కనే అచ్చెన్న కూడా ?

ఆయన కంటే ఈయన నయం, భారీ కాయం పార్టీకి కడు ఉపయోగం అనుకుని ఏరి కోరి చంద్రబాబు అచ్చెన్నాయుడు నెత్తిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కిరీటం పెట్టారు. [more]

Update: 2021-03-27 00:30 GMT

ఆయన కంటే ఈయన నయం, భారీ కాయం పార్టీకి కడు ఉపయోగం అనుకుని ఏరి కోరి చంద్రబాబు అచ్చెన్నాయుడు నెత్తిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కిరీటం పెట్టారు. తీరా స్థానిక ఎన్నికలు జరిగితే సొంత జిల్లాలో మొత్తానికి మొత్తం వైసీపీకి అప్పగించేసి తాను కూడా మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావుకు ఏమీ తక్కువ తినలేదని అచ్చెన్న నిరూపించుకున్నారు. కళా వెంకటరావు ప్రెసిడెంట్ గా ఉన్న వేళ తాను ఓడినా శ్రీకాకుళంలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్లు దక్కాయి. అచ్చెన్న ఏలుబడిలో టోటల్ గా గుండు సున్నాగా మిగిలింది.

ఆవేశమే తప్ప……

అచ్చెన్నాయుడిది దూకుడు స్వభావం అని చంద్రబాబు చేరదీశారు. కానీ ఆయన ఆవేశంలో ఆలోచనలు కానీ వ్యూహాలు కానీ ఎత్తుగడలు కానీ పెద్దగా ఉండవని సొంత పార్టీలోనే అంటారు. ఇక అచ్చెన్నాయుడుకు ఇగో ఎక్కువ అని కూడా చెబుతారు. కళా మాదిరిగా అందరినీ కలుపుకుని పోరు అన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతోనే ఆరు నెలల తన పదవీ కాలంలో శ్రీకాకుళంతో పాటు మొత్తం ఉత్తరాంధ్రా జిల్లాల్లోనే సైకిల్ పార్టీ కిల్ అయ్యేలా చేశారని అంటున్నారు.

పనిచేయని కార్డు ….

ఇక బీసీ కార్డు అని చంద్రబాబు గొప్పగా గప్పాలు కొట్టారు కానీ అది అసలు ఎక్కడా పనిచేయలేదని పంచాయతీ మునిసిపల్ ఎన్నికల ఫలితాల బట్టీ తేలిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో మూడు మునిసిపాలిటీలు, విజయనగరంలో మరో మూడుతో పాటు ఏకంగా కార్పొరేషన్, విశాఖలో కార్పొరేషన్ తో పాటు రెండు మునిసిపాలిటీలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. దీంతో ఉత్తరాంధ్రా బీసీలు ఎటు వైపు ఉన్నారో కూడా అర్ధమైపోయింది అంటున్నారు. వైసీపీ ఒడుపుగా బీసీలను తన వైపునకు తిప్పుకోవడంతో టీడీపీకి మూడు జిల్లాల్లోనూ మాడు పగిలే తీర్పు వచ్చిందని అంటున్నారు.

కష్టమేనా…?

ఒక విధంగా ఇపుడు కళా వెంకటరావు హ్యాపీ అని చెప్పాలేమో. ఒక ఓటమితోనే సరిపెట్టుకున్నారు. అదే అచ్చెన్న అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో అంతకంటే దారుణమైన ఫలితాలు ఉత్తరాంధ్రా జిల్లాల్లో పార్టీకి అందించారు. ఇదే తీరున కనుక పార్టీ పడకవేస్తే రేపటి రోజున అచ్చెన్నాయుడు ప్రెసిడెంట్ గిరీ వల్ల ఒరిగేది కూడా ఏమీ లేదు అని అధినాయకత్వానికి స్పష్టంగా అర్ధమవుతోంది. మరో వైపు వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ వల్ల టీడీపీ పునాదులు మొత్తం కదులుతున్నాయి. ఈ పరిణామాలను బట్టి చూస్తే 2024 ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్ర సైకిల్ పార్టీకి హ్యాండ్ ఇస్తుందా అన్న డౌట్లు ఇప్పటి నుంచే వచ్చేస్తున్నాయి.

Tags:    

Similar News