అచ్చెన్నకు ఆ త్రిమూర్తుల దీవెనలు…?

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు పలు మార్లు అరెస్ట్ అవుతున్నారు. అయిన ప్రతీ సారి ఆయన గొంతు ఇంకా పెరుగుతోంది. మరో వైపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి [more]

Update: 2021-02-14 06:30 GMT

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు పలు మార్లు అరెస్ట్ అవుతున్నారు. అయిన ప్రతీ సారి ఆయన గొంతు ఇంకా పెరుగుతోంది. మరో వైపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి ఇప్పటికి రెండు సార్లు గెలిచారు. మళ్ళీ మళ్లీ గెలుస్తాను అని చాలెంజ్ చేస్తున్నారు. అంతే కాదు హోం మంత్రినే అవుతాను అని కూడా చెబుతున్నారు. మరి అచ్చెన్నాయుడు ధైర్యం ఏంటి, ఆయనకు ఉన్న ధీమా ఏంటి అంటే వైసీపీలోని త్రిమూర్తులే అని శ్రీకాకుళం జిల్లాలో గట్టిగా వినిపిస్తున్న మాట. అచ్చెన్నాయుడు తన గెలుపు కోసం పలవరించనక్కరలేదు. పక్క పార్టీ వారే తాపీగా హ్యాపీగా ఆ పని చేసి పెడతారు.

నిమ్మాడ వెళ్ళని విజయసాయి ….

తాను నిమ్మాడకు వెళ్ళి మరీ అక్కడ వైసీపీ సర్పంచ్ అభ్యర్ధి అప్పన్నను ఓదారుస్తాను అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కానీ జరిగింది వేరు. ఆయన శ్రీకాకుళం దాటి వెళ్లలేకపోయారు. దానికి కారణం టీడీపీ నిరసనలు కాదు, సొంత పార్టీ వారి మధ్య నెలకొన్న వర్గ పోరు. ఈ వర్గ పోరు కారణంగానే ఆయన నిమ్మాడకు ఆమడ దూరంగా ఉండిపోయారు. మరి ఎవరి మధ్య పోరు అంటే శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కాళింగ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పెరాడ తిలక్, టెక్కలి వైసీపీ ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ ల మధ్యనే.ఈ ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం లేదు. దాంతో విజయసాయి నిమ్మాడ వెళ్తే ఎక్కడ దువ్వాడ‌కు పేరు వస్తుందో అని మిగిలిన వారు అడ్డుకున్నారట.

అప్పుడలా….

ఇక 2019 ఎన్నికల వేళ టెక్కలి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన పేరాడ తిలక్ ని యాంటీగా కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్ కలసి రాజకీయం చేస్తే ఆ పోరులో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు గెలిచారు. ఇక ఇపుడు టెక్కలి ఇంచార్జి పదవి దువ్వాడకు దక్కింది. దాంతో కిల్లి, తిలక్ ఒక్కటై ఆయనకు ఎదురు నిలుస్తున్నారని పార్టీలోనే వినిపిస్తున్న మాట. ఇక పంచాయతీ ఎన్నికల వేళ కూడా వీరి మధ్య సఖ్యత లేకుండా పోయిందని అంటున్నారు. ఈ ముగ్గురూ కలస్తే వైసీపీకి అజేయమైన బలమే. కానీ అసలు కలవరు, దాంతో టీడీపీ గెలుపునకు రాచబాట వేస్తున్నారు అంటున్నారు.

మంత్రులు సైలెంట్….

ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన క్రిష్ణ దాస్ కానీ మరో మంత్రి సీదరి అప్పలరాజు కానీ టెక్కలి వివాదంలో అసలు తలదూర్చడంలేదు. తమకు సంబంధం లేదన్నట్లుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఏకంగా అచ్చెన్నాయుడిని టార్గెట్ చేయడం తో ఆయనకు మద్దతు ఇస్తే ఎక్కడ పెద్ద నాయకుడు అయిపోతారో అన్న ఆందోళన మిగిలిన నేతలలో కనిపిస్తోంది అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇలా గ్రూపులుగా విడిపోయిన నేతల తీరు చూసి విజయసాయిరెడ్డి అయినా, మరొకరు అయినా ఏమీ చేయలేసి స్థితి. మరి ఇలా వైసీపీలో ఫైటింగ్ టాప్ లెవెల్ లో సాగితే అచ్చెన్నాయుడు ఎన్ని సార్లు అరెస్ట్ అయినా మీసం మెలి వేస్తాడనే ఫ్యాన్ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News