అచ్చెన్న క‌ష్టం ఎవ‌రి ఖాతాలోకి..?

చింద‌ర వంద‌ర గంద‌ర‌గోళంగా ఉన్న ఏపీ టీడీపీలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంటోంది. ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా.. సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న కింజ‌రాపు కుటుంబానికి [more]

Update: 2020-09-29 14:30 GMT

చింద‌ర వంద‌ర గంద‌ర‌గోళంగా ఉన్న ఏపీ టీడీపీలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంటోంది. ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా.. సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న కింజ‌రాపు కుటుంబానికి అవ‌కాశం వ‌చ్చింది. ఈ ప‌ద‌వి ద‌క్కించుకునే అన్ని అర్హత‌లు ఈ కుటుంబానికి ఉన్నాయి. అంతేకాదు… జ‌గ‌న్ సునామీని కూడా త‌ట్టుకుని నిల‌బ‌డ్డ కుటుంబానికి ఈ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం అవ‌స‌ర‌మే. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. చంద్రబాబు ఇలా కీల‌క‌మైన బాధ్యత‌ల‌ను అచ్చెన్నాయుడికి అప్పగించారు స‌రే.. కానీ, ప్ర‌స్తుతం టీడీపీ ఉన్న ప‌రిస్థితిలో ఈ పార్టీని గాడిలో పెట్ట‌డం అంత తేలిక‌గా అయ్యే ప‌నేనా? అనేది ఓ ప్ర‌శ్న‌.

చిన బాబు హవా నేపథ్యంలో……

దీనికితోడు.. పోనీ.. ఎంతో క‌ష్టించి.. పార్టీ కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్టప‌డి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. పార్టీని అధికారంలోకి తెచ్చేస్థాయికి చేర్చితే.. సీఎం అయ్యేదెవ‌రు ? ఎవ‌రి క‌ష్టం.. ఎవ‌రి ఖాతాలోకి వెళ్తుంది ? పోనీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ మ‌రోసారి ఓట‌మిపాలైతే.. ఆ అప‌వాదు.. ఎవ‌రికి చెందుతుంది ? ఇప్పుడు ఈ ప్రశ్నలే టీడీపీలో తెర‌మీదికి వ‌చ్చాయి. అచ్చెన్నాయుడికి రాష్ట్రప‌గ్గాలు అప్పగించ‌డం పై ఎవ‌రూ వ్యతిరేకించ‌డం లేదు. కానీ, ప్రస్తుతం అంతా చిన్నబాబు హ‌వా సాగుతున్న నేప‌థ్యంలో దానిని పూర్తిగా తుడిచి పెట్టే ప్రయ‌త్నం చేస్తేనే త‌ప్ప.. అచ్చెన్నాయుడు త‌న‌దైన ముద్ర వేయ‌లేరు.

అనేక చిక్కులు…..

పైగా ఎక్కడిక‌క్కడ అసంతృప్తులు పెరిగిపోయిన నేప‌థ్యంలో.. నాయ‌కుల‌ను బుజ్జగించ‌డ‌మూ.. అంత సులువు కాదు. అయితే.. వీటిని ఛేదించాలంటే.. వ్యూహాలు కావాలి. స‌రే.. అచ్చెన్నకు వ్యూహం ఉందా ? లేక నోరుందా ? అనే విష‌యాన్ని ప‌క్కన పెడితే.. ఆయ‌న‌ను చూసి బీసీ వ‌ర్గం చేరువ అయ్యే అవ‌కాశం ఉంది. కానీ, ఎన్నిక‌ల వేళ.. మ‌ళ్లీ ఆయ‌న అనుకున్న విధంగా టికెట్ల పంప‌కాలు ఉంటాయా ? అనేది సందేహ‌మే. చిన్నబాబు లోకేష్‌పై వ్యతిరేక‌త‌ను ఆయ‌న చెరిపేసే ప్రయ‌త్నం చేస్తే.. చంద్రబాబుసైతం కోపం రాదా ? అనేది ప్రశ్న. ఏదేమైనా. రాష్ట్ర ప‌గ్గాలు చేప‌డుతున్న అచ్చెన్నాయుడు ముందు.. అనేక చిక్కులు ఉన్నాయి.

అంత సామర్థ్యం ఉందా?

బీసీ వ‌ర్గాల‌ను చేర‌దీయడం, యువ‌త‌ను త‌న వైపు తిప్పుకోవ‌డం, పార్టీలో అసంతృప్తుల‌ను త‌గ్గించ‌డం… కేవ‌లం ఓ వ‌ర్గానికే ప‌రిమిత‌మైంద‌న్న పార్టీని అన్ని వ‌ర్గాల‌కు చేరువ చేయ‌డం, అదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వ్యూహానికి త‌గిన విధంగా టికెట్లను పంపిణీ చేయ‌డం.. ఇవ‌న్నీ సాగితే.. అప్పుడు అచ్చెన్నాయుడు స‌క్సెస్ అవుతారు. కానీ, ఇవ‌న్నీ సాధ్యమేనా? చిన్నబాబు లోకేష్ క‌నుస‌న్నల్లో జ‌రుగుతున్న టీడీపీ రాజ‌కీయాలు.. అచ్చెన్నకు సానుకూలం అవ‌డం ఖాయ‌మేనా ? అన్న ప్రశ్నల‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Tags:    

Similar News