ఎక్కడ కెలకాలో అక్కడ కెలుకుతున్నారుగా?

అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు వారసుడిగా వచ్చి తనను తాను రుజువు చేసుకున్న నేత. చంద్రబాబుకు ఎర్రన్నాయుడు కంటే కూడా బాగా దగ్గరైన నాయకుడు. కుడి భుజంగా బాబుకు [more]

Update: 2020-12-04 06:30 GMT

అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు వారసుడిగా వచ్చి తనను తాను రుజువు చేసుకున్న నేత. చంద్రబాబుకు ఎర్రన్నాయుడు కంటే కూడా బాగా దగ్గరైన నాయకుడు. కుడి భుజంగా బాబుకు వ్యవహరించడమే కాకుండా వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎర్రన్న్నాయుడు రాజకీయ చాణక్యం మీద బాబుకు అనుమానం ఉండి ఆయన్ని ఢిల్లీకి ఒక దశలో పరిమితం చేశారు. కానీ అచ్చెన్న విషయంలో అలా కాదు, ఆయన లేకపోతే తాను లేను అన్నట్లుగా పక్కనే పెట్టుకుని మరీ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు.

పద్మవ్యూహమే మరి….?

అచ్చెన్నాయుడు కేరాఫ్ నిమ్మాడగా ఇపుడు చెప్పుకోవాలి. 2020 మొదలైంది అచ్చెన్న్నకు చేదు తీపి ఫలితాలు కలిపి అందించింది. అచ్చెన్నాయుడును ఈ ఎస్ ఐ స్కాం లో అరెస్ట్ చేసి దాదాపు మూడు నెలల పాటు రిమాండ్ ఖైదీగా వైసీపీ సర్కార్ ఉంచింది. అదే సమయంలో అచ్చెన్నను బీసీ నేతగా బాబు ప్రమోట్ చేసి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. ఇంత జరిగినా కూడా ఆయన తన సొంత వూరు నిమ్మాడ దాటి కదిలి ముందుకు రాలేకపోతున్నారు. దానికి వైసీపీ సర్కార్ బిగించిన అతి పెద్ద రాజకీయ వ్యూహమే కారణం అంటున్నారు.

టార్గెట్ చేశారా…?

అచ్చెన్నాయుడు ఇప్పటికి రెండు సార్లు టెక్కలి నుంచి గెలిచారు. ఆయన అక్కడ పట్టు బాగా సంపాదించారు. నిజానికి ఈసారి ఎన్నికల్లో అచ్చెన్నకు మెజారిటీ కూడా దారుణంగా తగ్గింది. కానీ ఆయనకు సంతబొమ్మాళి మండలం అతి పెద్ద కాపు కాస్తూ వచ్చింది. అక్కడ ఉన్నవారంతా టీడీపీ మద్దతుదారులే కావడంతో అచ్చెన్నాయుడు వర్గీయులు రిగ్గింగ్ చేసి మరీ గెలుస్తున్నారని వైసీపీ భావిస్తోంది. దాంతో ఆపరేషన్ టీడీపీని టెక్కలిలో స్టార్ట్ చేశారు. టీడీపీ సానుభూతిపరులను చూసి మరీ టార్గెట్ చేస్తున్నారు. అచ్చెన్నకు పట్టున్న సంతబొమ్మాళి సహా కీలక మండలాల్లో టీడీపీ నాయకులు మెల్లగా వైసీపీ గూటికి చేరిపోతున్నారు. వారిని నయానా భయానా తమ దగ్గరకు చేర్చుకుంటోంది వైసీపీ.

కదిలితే కధ అంతే…

ఈ ఏడాది ఎక్కువగా అచ్చెన్నాయుడు టెక్కలి బాగోగులు చూసుకోలేదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే ఇంతవరకూ ఆయన రాష్ట్ర నాయకుడిగా విజయవాడలో తిరుగుతూ విశాఖలో గడుపుతూ చుట్టపు చూపుగానే టెక్కలి వైపుకు వచ్చేవారు అని అంటారు. దాంతో అచ్చెన్న సీటు టెక్కలిని ఈసారి ఎలాగైనా కొట్టాలని వైసీపీ వేసిన ఎత్తులు మెల్లగా ఫలిస్తున్నాయి. గతంతో పోలిస్తే చాలా వరకూ అచ్చెన్న బలాన్ని తగ్గించేశారు. దీంతో అచ్చెన్నాయుడుకు ఉన్న బలం పోకుండా కాపు కాసుకోవాల్సివస్తోంది. దాంతో ఆయన నిమ్మాడలోనే కాపురం ఉండాల్సివస్తోంది. కదిలితే కధ మొత్తం మార్చేస్తారు అని కూడా బెదురుతున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్న పూర్తిగా టెక్కలి నేతగా మారిపోయారు. టెక్కలి మీదనే ఆయన దృష్టి పెడుతున్నారు. టెక్కలిలో తమ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు వైసీపీ నేతలు పెడుతున్నారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. మొత్తానికి అచ్చెన్నకు ఎక్కడ కెలకాలో అక్కడ కెలుకుతోంది వైసీపీ. ఫలితంగా అసహనం కట్టకు తెంచుకుటోంది మరి.

Tags:    

Similar News