అచ్చెన్న ముచ్చట అలా తీరిందా ?

పాపం కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనను ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చేశారని తెగ సంబరపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆర్భాటంగా ప్రమాణ [more]

Update: 2020-12-09 11:00 GMT

పాపం కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనను ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చేశారని తెగ సంబరపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చేద్దామనుకున్నారు. అయితే దసరా ముందుకునే పదవిని ప్రకటించినా బాబు కుర్చీ అప్పగించేసరికి డిసెంబర్ నెల వచ్చేసింది. అది కూడా ఎటూ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన చంద్రబాబు అచ్చెన్నాయుడును గుంటూరులోని పార్టీ ఆఫీస్ లోని కుర్చీలో అలా కూర్చోబెట్టి మమ అనిపించేశారు.

అన్నీ ఆయనేగా…?

చంద్రబాబు పేరుకు జాతీయ అధ్యక్షుడు. కానీ ఆయన చేసేవన్నీ గల్లీ పోరాటాలే. ఇసుక కొరత అంటూ ఆయనే తట్ట అందుకుంటారు. రైతులకు అన్యాయం అంటూ తడిసిన వరి కంకులతో అసెంబ్లీకి వచ్చినా బాబే ముందున ఉంటారు. ఇక పార్టీ ప్రెసిడెంట్ కాదు కానీ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు సీటు బుచ్చన్నకు వెళ్ళిపోయింది. వెనకాల అచ్చెన్నాయుడు కూర్చోవాల్సి వచ్చింది. ఈ మాత్రం భాగ్యానికి అధినేత అన్న ట్యాగ్ కూడానా అని ఆయన అనుచరులు మదనపడుతున్నారుట.

నిమ్మాడ నుంచే…

ఇప్పటిదాకా అచ్చెన్నాయుడు పార్టీ ప్రెసిడెంట్ గా ప్రమాణం ఘనంగా చేద్దామనుకుని నిమ్మాడలోని తన ఇంటి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన తాను కాలికి గజ్జె కట్టుకుని మరీ ఏపీ అంతా చుట్టి వస్తానని భీషణ ప్రతిన కూడా చేశారు. అది కూడా మళ్లీ చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయడానికేనని కూడా వినయంగా చెప్పుకున్నారు. కానీ అచ్చెన్నాయుడిని కాలు బయటకు కదపకుండా బాబు ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలు ఇపుడే వద్దు అంటూ కట్టడి చేశారు. ఇక ఇపుడు గుంటూరులోని పార్టీ ఆఫీస్ నుంచే అచ్చెన్నాయుడు పనిచేస్తారు అంటున్నారు. మొత్తానికి అదొక్కటే ఊరటగా ఉందిట.

లోకేష్ కే అనుమతి….

పేరుకు అలా జాతీయ పార్టీ అని చెబుతున్నా కూడా తెలంగాణాలో అడుగు బయట పెట్టే చాన్స్ అటు చంద్రబాబుకు, ఇటు లోకేష్ కి కూడా లేదు. దానికి తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికలలో ప్రచారం చేయకపోవడమే కారణం. ఇక మిగిలింది ఏపీలోని పదమూడు జిల్లాలే. అందువల్ల జిల్లా టూర్లు వేయలంటే లోకేష్ కి మాత్రమే అనుమతి ఉంది. కరోనా లేకపోతే చంద్రబాబే తిరిగేసేవారు. ఇపుడు తాను సైడ్ అవడం వల్ల కొడుకుని జనంలోకి తిప్పాలని బాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. మరి అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కదా అంటే ఆయన అయితే నిమ్మాడలో లేకపోతే గుంటూర్ ఆఫీస్ లోని కుర్చీలో కూర్చోడమేన‌ట. మొత్తానికి అచ్చెన్నకు ప్రమోషన్ వచ్చింది అంటే ఏమో అనుకున్న వారికి అర్ధమైన సంగతి ఏంటంటే నిమ్మాడ ఆఫీస్ నుంచి గుంటూర్ ఆఫీస్ కి అచ్చెన్న వెళ్ళడమేనట.

Tags:    

Similar News