ఇద్దరిలోనూ అసహనమే

ఈ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పార్లమెంటు సభ్యులను అస్సలు పట్టించుకోవడం మానేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సయితం వారిని బేఖాతరు చేస్తున్నారు. కేవలం శిలాఫలకాలపై పేర్లు తప్ప [more]

Update: 2019-12-12 15:30 GMT

ఈ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పార్లమెంటు సభ్యులను అస్సలు పట్టించుకోవడం మానేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సయితం వారిని బేఖాతరు చేస్తున్నారు. కేవలం శిలాఫలకాలపై పేర్లు తప్ప కార్యక్రమాలకు ఆహ్వానాలు కూడా పంపడం లేదట. నెల్లూరు జిల్లాలో ఉన్న ఎంపీల పరిస్థితి ఇలా ఉందట. అందుకే తమ పట్ల ప్రొటోకాల్ పాటించడం లేదంటూ నేరుగా ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేయాలన్న యోచనలో ఉన్నారు.

ముగ్గురు ఎంపీలున్నా…..

నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలను ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీగా బల్లి దుర్గాప్రసాద్, రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు నెల్లూరు జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఎవరికీ పార్టీ, ప్రభుత్వ కార‌్యక్రమాలకు ఆహ్వానాలు అందడం లేదట. దీంతో ఒకింత వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీ అన్న గౌరవం….

ఇటీవల సూళ్లూరుపేటలో ఒక సంఘటన జరిగింది. ఒక అధికారిక కార్యక్రమంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అయితే అక్కడ వైసీపీ నేతలు ఆయనను గుర్తించలేదు. తాను ఈ ప్రాంత ఎంపీనని ఆయన పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. తమకు ఎమ్మెల్యే మాత్రమే తెలుసునని, ఎంపీలు తెలియదని వారు మొఖం మీదే చెప్పడంతో బల్లి దుర్గాప్రసాద్ హర్ట్ అయ్యారని చెబుతున్నారు. దీంతో ఆయన సభలో తనను తాను పార్లమెంటు సభ్యుడిగా పరిచయం చేసుకోవాల్సి వచ్చింది.

ఆహ్వానాలు లేక…..

ఇక నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సయితం అధికారిక కార్యక్రమాల్లో తక్కువగానే పాల్గొంటున్నారు. నెల్లూరు టౌన్ , నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ ఆరు నెలల కాలంలో పాల్గొన్న కార్యక్రమాలు తక్కువేనని చెప్పాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిదీ అదే పరిస్థితి. ఎంపీ కార్యాలయానికి ఆహ్వాన లేఖలను పంపుతున్నారు తప్పించి, గౌరవంగా పిలవడం లేదన్నది ఎంపీల ఆరోపణ. తమకు కనీసం గౌరవం దక్కడం లేదని ఎంపీలు వాపోతున్నారు. దీనిపై జగన్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఉన్న ముగ్గురు ఎంపీలు అసహనంతో ఉన్నారు.

Tags:    

Similar News