అడ్డుపడుతున్న దెవరు?

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం… శాశ్వత మిత్రత్వం ఉండదంటారు. కానీ వీరి విషయంలో మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులను [more]

Update: 2019-09-14 11:00 GMT

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం… శాశ్వత మిత్రత్వం ఉండదంటారు. కానీ వీరి విషయంలో మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులను ని బీజేపీలో చేరకుండా ఆ పార్టీకి చెందిన నేతలే అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిని ప్రచారం అనేకన్నా నిజమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరాలని ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు. అయినా పార్టీ కండువాను కప్పుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణం అదే జిల్లాకు చెందిన సీఎం రమేష్ కారణమని ఆది నారాయణరెడ్డి వర్గీయులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

ఇద్దరికీ విభేదాలు….

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి, సీఎం రమేష్ కు మధ్య గతకొంతకాలంగా విభేదాలున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం రమేష్ అంతా తానే అయి వ్యవహరించారు. ఇక ఆదినారాయణరెడ్డి మంత్రి అయిన తర్వాత సీఎం రమేష్ కు చెక్ పెట్టడం ప్రారంభించారు. సీఎం రమేష్ చేస్తున్న కాంట్రాక్టులపైన అనేకసార్లు ఆదినారాయణరెడ్డి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టు పనులు నాసిరకంగా సాగుతున్నాయని ఆదినారాయణరెడ్డి నేరుగానే సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కనస్ట్రక్షన్స్ పై ఆరోపణలు చేశారు.

అందుకే కండువాను….

గత ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి కడప ఎంపీగా పోటీచేసినా ఎమ్మెల్యేల ఎంపిక విషయంలో సీఎం రమేష్ దే పై చేయి అయింది. అందుకే ఆదినారాయణరెడ్డి పదే పదే కడప పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరగలేదని తరచూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరాలని రెడీ అయిపోయిన ఆదినారాయణరెడ్డిని సీఎం రమేష్ అడ్డుకుంటున్నారని, బీజేపీ పెద్దలు కూడా సీఎం రమేష్ మాటలు విని కండువా కప్పలేదన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆదినారాయణరెడ్డి మాత్రం తన ప్రయత్నాలను మానలేదు.

రాయపాటికి కూడా……

ఇక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు కూడా భారతీయ జనతా పార్టీలో చేరతానని ప్రకటించారు. రాయపాటి సాంబశివరావు ప్రకటించి రెండు నెలలవుతున్నా ఆయన చేరకపోవడానికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అని రాయపాటి వర్గం ఆరోపిస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే వీరి పంచాయతీని అప్పట్లో వైఎస్ తీర్చే వారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చేందుకు రాయపాటికి కన్నాయే అడ్డంతగిలారన్న టాక్ ఉంది. మొత్తం మీద రాయపాటి సాంబశివరావు, ఆదినారాయణరెడ్డిలకు ఆ పార్టీ నేతలే రాకుండా అడ్డుపడుతున్నారన్నది వాస్తవం.

Tags:    

Similar News