ఆది అందుకే దూరంగా ఉన్నారా?

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దాదాపు రాష్ట్రానికి దూరంగానే వెళ్లినట్లు కనపడుతోంది. ఆయన జమ్మలమడుగులో కూడా తన అనుచరులకు అందుబాటులో లేరు. ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. [more]

Update: 2020-02-20 14:30 GMT

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దాదాపు రాష్ట్రానికి దూరంగానే వెళ్లినట్లు కనపడుతోంది. ఆయన జమ్మలమడుగులో కూడా తన అనుచరులకు అందుబాటులో లేరు. ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కన్పించడం లేదు. జమ్మల మడుగులో బీజేపీ జెండా కట్టేందుకు కూడా ప్రయత్నించడం లేదు. కేవలం తన భద్రత, కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆదినారాయణరెడ్డి జెండా కప్పుకున్నారన్న విమర్శలు బీజేపీ నుంచే విన్పిస్తున్నాయి.

బీజేపీ కండువా కప్పుకుని…..

ఆదినారాయణరెడ్డి వంటి సీనియర్ నేత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిన తర్వాత కొంత దూకుడుగానే ఉండాలి. పార్టీ కార్యక్రమాలతో తన క్యాడర్ లో ధైర్యాన్ని నింపాలి. తనకు చెక్కు చెదరకుండా ఉన్న ఓటు బ్యాంకును భద్రపర్చుకునే ప్రయత్నం చేయాలి. కాని ఆదినాారయణరెడ్డి మాత్రం జమ్మల మడుగు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదట. బెంగళూరులో ఉన్న తన వ్యాపారాలను చూసుకునేందుకే పరిమితమయ్యారు.

కుటుంబంలో విభేదాలు….

ఆదినారాయణరెడ్డి సోదరుడు ఇటీవల వైసీపీకి మద్దతు పలకడం కూడా ఇందుకు కారణమంటున్నారు. దశాబ్దాల కాలంగా ఆదినారాయణరెడ్డి కుటుంబం ఒకే మాట ఒకే బాటలో ఉంటుంది. ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ తర్వాత వైసీపీలో చేరినప్పుడు, టీడీపీ కండువా కప్పుకున్నప్పుడూ ఆయన కుటుంబం ఆయన వెంటే నడిచింది. అందుకే జమ్మలమడుగు సీటును త్యాగం చేసే సమయంలోనూ తన సోదరుడు శివనాధ్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి కుటుంబంలో ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఆదినారాయణరెడ్డి చూసుకోగలిగారు.

జమ్మలమడుగుకు దూరంగా….

కానీ ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి కుటుంబంలోనూ విభేదాలు తలెత్తాయి. శివనాధ రెడ్డి శాసనమండలిలో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆదినారాయణరెడ్డి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. అందుకే ఆయన జమ్మలమడుగుకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. బీజేపీలో చేరినా ఆయన యాక్టివ్ కాకపోవడానికి కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలే కారణమని అంటున్నారు. ఎనిమిది నెలల క్రితం వరకూ ఒక వెలుగు వెలిగిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు రాజకీయాల వైపు చూడక పోవడం నిజంగా హాట్ టాపిక్కే.

Tags:    

Similar News