Badvel : అంతా ఆది నారాయణుడి మహిమేనట

బద్వేలు ఉప ఎన్నిక బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి సవాల్ గా మారింది. అనుకోకుండా వచ్చిన ఈ ఎన్నికను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదినారాయణరెడ్డిపై బాధ్యత పెట్టింది. కడప [more]

Update: 2021-10-27 11:00 GMT

బద్వేలు ఉప ఎన్నిక బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి సవాల్ గా మారింది. అనుకోకుండా వచ్చిన ఈ ఎన్నికను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదినారాయణరెడ్డిపై బాధ్యత పెట్టింది. కడప జిల్లా నేత కావడం, మంత్రిగా పనిచేసి ఉండటంతో ఆయనపైనే బద్వేలు ఉప ఎన్నికల్లో ఆధారపడింది. ప్రచార బాధ్యతల నుంచి టీడీపీ ఓట్లను పార్టీ వైపు మళ్లించే ఆపరేషన్ ను కూడా పార్టీ అధినాయకత్వం ఆదినారాయణరెడ్డికి అప్పగించింది.

వార్ వన్ సైడే అయినా…

బద్వేల్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ మధ్యనే ఉండనుంది. కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసినా నామమాత్రమే. ఆ పార్టీకి అక్కడ క్యాడర్ కూడా లేదు. ఏదో పోటీ చేస్తామంటున్నామంటే పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఇక్కడ పెద్దగా పొడిచేదేమీ లేదు. జనసేన, టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో పడే నాలుగుఓట్లు బీజేపీకి దక్కుతాయని భావిస్తున్నారు. అయితే బీజేపీ ఈ ఎన్నికల్లో గెలవాలని కాకపోయినా కనీస ఓట్లు సాధిస్తే తమకు రాష్ట్రంలో పట్టు పెరిగిందని జాతీయ నాయకత్వానికి చెప్పుకునే వీలుంది.

టీడీపీ నేతలతో మంతనాలు…

అందుకే ఆదినారాయణరెడ్డికి టీడీపీ ఓ‌ట్లను తెచ్చే బాధ్యతను అప్పగించారు. ఆదినారాయణరెడ్డి తనకున్న పరిచయాలతో టీడీపీ ఓట్లను బీజేపీ వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. మండలాల వారీగా టీడీపీ దిగువ స్థాయి నేతలను ఆదినారాయణ రెడ్డి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని, ఓటు వేయకుండా మానుకోవద్దని సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీ ఇష్టం కానీ ఇప్పుడు మాత్రం బీజేపీకి ఓటు వేయాలని ఆయన చెబుతున్నారు.

ఎన్ని ఓట్లు సాధిస్తారు?

టీడీపీ నేతలు కూడా ఆదినారాయణరెడ్డి ప్రతిపాదనకు ఓకే చెబుతున్నారు. ఈ ఎన్నిక వరకూ బీజేపీకి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇక్కడ బీజేపీకి కనీస ఓట్లను సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. పోలయిన ఓట్లలో కనీసం ఇరవై శాతం ఓట్లను సాధించాలన్న లక్ష్యంతో ఉన్నారు. బీజేపీ ఇక్కడ టీడీపీ ఓట్లను టర్న్ ను చేసే బాధ్యత మొత్తాన్ని ఆదినారాయణ రెడ్డిపై పెట్టింది. మరి ఆది బద్వేల్ లో ఎన్ని ఓట్లు సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News