ఆదిరెడ్డి హవా ఎంత.. వన్ ఇయర్ విపక్షం స్కోరెంత….?
ఆదిరెడ్డి భవానీ. గత ఏడాది ఎన్నికలకు ముందు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా అరంగేట్రం చేశాక.. దివంగత శ్రీకాకుళం [more]
ఆదిరెడ్డి భవానీ. గత ఏడాది ఎన్నికలకు ముందు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా అరంగేట్రం చేశాక.. దివంగత శ్రీకాకుళం [more]
ఆదిరెడ్డి భవానీ. గత ఏడాది ఎన్నికలకు ముందు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా అరంగేట్రం చేశాక.. దివంగత శ్రీకాకుళం మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడి కుమార్తె అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. దీంతో ఒక్కసారిగా ఆదిరెడ్డి భవానీకి హైప్ వచ్చింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఆ ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో దిగిన ఆమె విజయం సాధించారు. చిత్రం ఏంటంటే కింజరాపు కుటుంబం నుంచి గత ఎన్నికల్లో బరిలో నిలిచిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా విజయం సాధించారు. ఇక, ఆదిరెడ్డి భవానీ విషయానికి వస్తే.. అప్పటి వరకు గడప కూడా దాటని ఆమె.. ఒక్కసారిగా పోటీకి రెడీ అయి ఎన్నికల్లో విజయం కూడా సాధించారు.
పార్టీలో ఒకే ఒక మహిళగా…..
రాజకీయ కుటుంబమే అయినా.. ప్రత్యక్ష రాజకీయాలు చేయడం మాత్రం ఆదిరెడ్డి భవానీకి ఇదే తొలిసారి. ఇక, రాజమండ్రి వంటి కీలక నియోజకవర్గంలో చక్రం తిప్పడం అంటే మాటలు కాదు. అలాంటి నియోజకవర్గంలో ఆదిరెడ్డి భవానీ దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. టీడీపీ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే.. మహిళా కోటాలో ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం ఉంది. అయితే, పార్టీ అధికారంలోకి రాలేదు. అదే సమయంలో పార్టీకి అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. పైగా ఆమె ఒక్కరే మహిళా ఎమ్మెల్యేగా మిగిలారు. దీంతో అసెంబ్లీలో టీడీపీకి మహిళా వాయిస్ వినిపించాలంటే ఆదిరెడ్డి భవానీ ఒక్కరే అధ్యక్షా! అనాల్సిన పరిస్థితి.
ఒక్క పనినీ చేపట్టలేక….
ఈ నేపథ్యంలో తాను కొత్తే అయినప్పటికీ.. బాబాయి మాజీ మంత్రి అచ్చెన్న దగ్గర పాఠాలు వడివడిగానే నేర్చుకుని అసెంబ్లీలో దిశ పోలీస్టేషన్లు సహా మహిళా సమస్యలపై గళం వినిపించారు. అయితే, నియోజకవర్గం సమస్యల విషయానికి వచ్చే సరికి మాత్రం ఏడాది పూర్తయినా ఆదిరెడ్డి భవానీ ఇంకా పట్టు సాధించలేక పోయారనే వాదన బలంగా వినిపిస్తోంది. రాజమండ్రి ఎంపీగా వైసీపీ నాయకుడు మార్గాని భరత్ గెలుపుగుర్రం ఎక్కడంతో విపక్షానికి సంబంధించిన ఆదిరెడ్డి భవానీతో ఆయన ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. దీంతో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికీ ఏ ఒక్కటీఆ మె ప్రారంభించలేక పోయారు.
ఒక్క హామీని కూడా…
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా ఆమె నెరవేర్చలేక పోయారనే వాదన కూడా ఉంది. ఇక, ఇసుక రీచ్‌ల విషయంలోనూ ఆమె స్థానిక వైసీపీ నేతలను బలంగా ఢీకొనలేక పోతున్నారని కూడా సమాచారం. అదే సమయంలో కుటుంబానికి ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారని, సాధ్యమైనంత ఎక్కువ సమయం ఇంటికే పరిమితమవుతున్నాయనేది స్థానికంగా వినిపిస్తున్న మరో టాక్. ఇక భర్త వాసు… మామ అప్పారావు హవానే ఎక్కువుగా ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఇలా ఈ ఏడాది కాలంలో ఆదిరెడ్డి భవానీ దూకుడు అసెంబ్లీకే పరిమితమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి నియోజకవర్గంలో పట్టు పెంచుకోక పోతే.. వచ్చే ఎన్నికల నాటికి కష్టమనే టాక్ కూడా వినిపిస్తోంది. రాజమండ్రి ప్రజలు ఎప్పుడూ గుడ్డిగా ఓటేయరనేది స్థానిక విశ్లేషకుల వాదన. మరి ఆదిరెడ్డి భవానీ ఏం చేస్తారో చూడాలి.