ఈ ఎమ్మెల్యే ఓవ‌ర్ టేక్ అవుతున్నారా?

రాజ‌కీయాల్లో ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా.. ప్రత్యర్థులు పుంజుకుంటారు. ఈ విష‌యం నేత‌ల‌కు తెలియంది కాదు. కానీ, టీడీపీలో ఉన్న కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం ఈ విష‌యాన్ని [more]

Update: 2021-08-18 05:00 GMT

రాజ‌కీయాల్లో ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా.. ప్రత్యర్థులు పుంజుకుంటారు. ఈ విష‌యం నేత‌ల‌కు తెలియంది కాదు. కానీ, టీడీపీలో ఉన్న కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం ఈ విష‌యాన్ని పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. పార్టీ ప్రతిప‌క్షంలో ఉంద‌న్న నిర్వేదంలోనో ఎందుకో గాని పార్టీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది డీలా ప‌డుతున్నారు. ముఖ్యంగా తొలిసారి రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న కింజ‌రాపు కుటుంబం ఆడ‌ప‌డుచు.. ఆదిరెడ్డి భ‌వానీ ఈ విష‌యంలో చాలా వెనుక‌బ‌డి ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి సిటీ నుంచి తొలిసారి పోటీ చేసిన ఆదిరెడ్డి భ‌వానీ విజ‌యం ద‌క్కించుకున్నారు.

రెండేళ్లు గడిచినా…?

అయితే.. ఇప్పటికి రెండేళ్లు గ‌డిచినా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భ‌వానీ ఏ మాత్రం ప్రభావం చూప‌లేక‌పోతున్నార‌నే చెప్పాలి. భ‌వానీ పుట్టుక‌ల‌తోనే రాజ‌కీయ వార‌సురాలు అయ్యారు. అటు బ‌ల‌మైన కింజార‌పు కుటుంబ అండ‌దండ‌ల‌తో పాటు ఇటు మెట్టునిల్లు ఆదిరెడ్డి ఫ్యామిలీ కూడా రాజ‌కీయ కుటుంబ‌మే… అయినా భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే స్థాయిలో కాదు క‌దా … ఏ కార్పొరేట‌ర్ రేంజ్‌లో రాజ‌కీయం కూడ చేయ‌ట్లేద‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గం నాడిని గ‌మ‌నిస్తే.. ఇక్కడ గ‌డిచిన మూడు ఎన్నిక‌ల్లోనూ నిల‌క‌డ‌గా ఏ ఒక్క పార్టీ కూడా విజ‌యం ద‌క్కించుకోలేదు.

ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో….

2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున రౌతు సూర్యప్రకాశ‌రావు, 2014లో బీజేపీ త‌ర‌ఫున ( టీడీపీ స‌పోర్ట్‌) ఆకుల స‌త్యనారాయ‌ణ‌, 2019లో టీడీపీ త‌ర‌పున ఆదిరెడ్డి భ‌వానీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అంటే.. ఇక్కడ ప్రజ‌లు వ‌రుస‌గా ఏ ఒక్కపార్టీకి ప‌ట్టం క‌ట్టడం లేదు. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆదిరెడ్డి భ‌వానీ విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఇప్పటి నుంచైనా గ‌ట్టిగా కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. వైసీపీ నేత‌ల హ‌డావుడి ఎక్కువ‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ముఖ్యంగా ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఏ కార్యక్రమం చేసినా ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటున్నారు. పైగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వానీకి కూడా స‌మాచారం అందించ‌డం లేద‌ని.. ఇక్కడ గుస‌గుస వినిపిస్తోంది.

భర్త చాటు….?

భ‌ర‌త్ టార్గెట్ అంతా అసెంబ్లీ మీదే ఉందంటున్నారు. అందుకే ఎక్కువుగా సిటీ నియోజ‌క‌వర్గం మీదే దృష్టి పెడుతున్నారు. ఆదిరెడ్డి భ‌వానీ మాత్రం పూర్తిగా భ‌ర్త చాటు ఎమ్మెల్యేగానే ఉండిపోతున్నారు. పార్టీకి ఉన్న ఏకైక మ‌హిళా ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆమె నియోజ‌క‌వ‌ర్గంలోనూ, అటు రాష్ట్ర స్థాయిలోనూ వాయిస్ వినిపించ లేక‌పోతున్నారు. పైగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించి స‌మ‌స్యల ప‌రిష్కారంపైనా దృష్టి పెట్టడం లేద‌ని.. విమ‌ర్శలు కూడా వ‌స్తున్నాయి. ఇటీవ‌ల మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ నిర్వహించిన స‌మావేశాల‌కు కూడా వ‌చ్చివెళ్లారే త‌ప్ప… పద‌విపై ఆస‌క్తితో లేరని స్థానికంగా త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చసాగింది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండోసారి విజ‌యం ద‌క్కించుకోవాలంటే ఆదిరెడ్డి భ‌వానీ ఈ త‌ర‌హా రాజ‌కీయంతో అయితే కష్టమే అంటున్నారు.

Tags:    

Similar News