లాక్ డౌన్ తో “లాస్” ఎవరికి? లాలూకు కాదా?

ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా వైరస్ భారత్ లో అంతగా సోకలేదు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం. దేశ వ్యాప్తంగా దాదాపు [more]

Update: 2020-05-21 17:30 GMT

ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా వైరస్ భారత్ లో అంతగా సోకలేదు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం. దేశ వ్యాప్తంగా దాదాపు రెండు నెలలకు పైగానే లాక్ డౌన్ విధించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా నరేంద్ర మోదీ ఇమేజ్ లాక్ డౌన్ సమయంలో మరింత పెరిగిందని చెప్పక తప్పదు. మోదీ ఇచ్చిన ప్రతి పిలుపునకు భారత్ లో సానుకూల స్పందన రావడమే కారణం. రెండు నెలలు ప్రజలు లాక్ డౌన్ భరించారంటే ఆయన పిలుపు ఏ మేరుకు పనిచేసిందో చెప్పకనే తెలుస్తోంది. అయితే ఇందులో మోదీపై వ్యతిరేకత కూడా కన్పించింది.

గతంలో జరిగిన ఎన్నికల్లో….

అయితే లాక్ డౌన్ తర్వాత, ఆఫ్టర్ కరోనా వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాదిలోనే బీహార్, పశ్చిమబెంగాల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంతకు ముందు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, జార్భండ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి పెద్దగా కలసి రాలేదు. మహారాష్ట్రలో అధిక సీట్లు సాధించినా అధికారంలోకి రాలేకపోయింది. హర్యానాలో చచ్చీ చెడీ పవర్ లోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను చీల్చి అధికారంలోకి రాగలిగింది. ఢిల్లీలో పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అంటే ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత లభించలేదు. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటినా రాష్ట్రాల్లో మాత్రం చతికల పడింది.

ఈ ఏడాది బీహార్ లో….

బీహార్ లో ఈ ఏడాది, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో వచ్చే ఏడాది ప్రధమార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ ఈ రాష్ట్రాల ఎన్నికలపై పడుతుందని అంటున్నారు. బీహార్ లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. లాక్ డౌన్ కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఆదాయాన్ని కోల్పోయారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం దక్కడం లేదు. దీంతో ఈ ఎఫెక్ట్ బీజేపీ కూటమిపై ఎన్నికల్లో పడే అవకాశముందంటున్నారు. మొన్నటి వరకూ బీజేపీ, జేడీయూ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ లాక్ డౌన్ తో లాస్ బీజేపీ కూటమికేనన్న విశ్లేషణలు వినవస్తున్నాయి. లాలూ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కూటమికి అనుకూలంగా ఉండే అవకాశముందంటున్నారు.

బెంగాల్ లో మాత్రం…

ఇక పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. మమత బెనర్జీ హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు. కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కరోనా సమయంలోనూ రాజకీయాలు ఇక్కడ హైలెట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తమకు అనుకూలంగా మారవచ్చని, అధికార పార్టీ పై వ్యతిరేకత తమకు కలసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తున్నారు. దీదీ మాత్రం గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు. తమిళనాడులో బీజేపీకి అసలు అవకాశాలే లేవు. అక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో జత కట్టాల్సిందే. మొత్తం మీద లాక్ డౌన్ తర్వాత జరిగే ఎన్నికలకు ఎవరికి అనుకూలంగా మారనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News