సపోర్ట్ అలా అయినా వస్తుందనేనా?

రాజధాని అమరావతి ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 440 రోజుల నుంచి రైతులు దీక్షలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మూడు [more]

Update: 2021-02-26 00:30 GMT

రాజధాని అమరావతి ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 440 రోజుల నుంచి రైతులు దీక్షలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మూడు రాజధానులను ముందుకు తీసుకెళ్లేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.

న్యాయపోరాటం చేస్తూనే…..?

ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు అందరి మద్దతును కూడగట్టేందుకు అమరావతి రైతులు ప్రయత్నిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రోజు ఏదో ఒక నిరసనను తెలుపుతూ ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజెబుతున్నారు. కానీ ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు మినహా సామాన్య ప్రజల నుంచి అమరావతి రైతుల పోరాటానికి మద్దతు లభించలేదు. రాజకీయ పార్టీల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు పూర్తిగా మద్దతు ప్రకటించాయి.

బస్సు యాత్ర చేయాలనుకున్నా….

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను అంతగా వ్యతిరేకించడం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు తాము సుముఖమేనని పదే పదే చెబుతుంది. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి అమరావతి రైతులకు మద్దతు కొరవడింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కోసం అమరావతి రైతులు బస్సు యాత్ర చేయాలనుకున్నా కరోనా వైరస్ దెబ్బకొట్టింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు…..

అయితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం అమరావతి రైతులకు కలసి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తమ మద్దతును అమరాతి రైతులు ప్రకటిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై తాము కూడా ఆందోళన చేస్తామని చెబుతున్నారు. విడతల వారీగా విశాఖకు వెళ్లి అమరావతి రైతులు కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇలా ఇతరుల మద్దతును అమరావతి విషయంలోనూ కూడగట్టేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అమరావతి ప్రాంతంలో వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలవడంతో వారికి ఇతర ప్రాంత ప్రజల మద్దతు అవసరంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News