తిరగబడ్డ జాతకం… ఇక అన్నింటికీ దూరమయినట్లేనా?

ఆళ్లగడ్డకు అమ్మ తెచ్చిన గౌరవాన్ని అఖిలప్రియ మంట గలిపింది. ఇప్పుడు రాజకీయంగా కూడా అఖిలప్రియ ఇబ్బందుల్లో ఉంది. బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారం భూమా కుటుంబానికి మచ్చ తెచ్చిపెట్టింది. [more]

Update: 2021-01-16 15:30 GMT

ఆళ్లగడ్డకు అమ్మ తెచ్చిన గౌరవాన్ని అఖిలప్రియ మంట గలిపింది. ఇప్పుడు రాజకీయంగా కూడా అఖిలప్రియ ఇబ్బందుల్లో ఉంది. బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారం భూమా కుటుంబానికి మచ్చ తెచ్చిపెట్టింది. అఖిలప్రియ వ్యవహారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆళ్లగడ్డలో అఖిలప్రియకు భూమా కుటుంబం నుంచే సహకారం కొరవడింది. శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి వెంట నడిచిన క్యాడర్ సయితం ఇప్పుడు అఖిలప్రియ వెంట లేకపోవడం విశేషం.

ఏకగ్రీవంగా గెలిచి…..

ఆళ్లగడ్డలో 2014 ఎన్నికలలో వైసీపీ తరుపున పోటీ చేసిన శోభనాగిరెడ్డి మృతి చెందడంతో అఖిలప్రియ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. కానీ ఆళ్లగడ్డలో తల్లి సంపాదించి పెట్టిన రాజకీయ ఆస్తిని మాత్రం నిలుపుకోలేకపోయారు. అఖిలప్రియ అరెస్ట్ అయి జైలుకు వెళ్లినా ఆళ్లగడ్డలో ఆమెకు సానుభూతి లభించకపోవడమే ఇందుకు ఉదాహరణ. దీనికి కారణం అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కూడా కారణం.

రాజకీయంగా ఇబ్బందులు….

ఇక రాజకీయంగా కూడా అఖిలప్రియ ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదంటున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అఖిలప్రియ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. ఆళ్లగడ్డ అఖిలకు ప్రత్యామ్నాయ చూడాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది. అఖిలప్రియ స్థానంలో భూమా కుటుంబ సభ్యుల్లో ఒకరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చంద్రబాబు సీనియర్ నేతల నుంచి అభిప్రాయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఆమె స్థానంలో…..

అఖిలప్రియ స్థానంలో ఆమె సోదరి మౌనికారెడ్డి లేదా సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి లు అయితే ఎలా ఉంటుందన్న దానిపై పార్టీ చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా అఖిల సోదరి మౌనిక అయితే అందరితో కలుపుకుని వెళతారంటున్నారు. మౌనిక అయితే ఏవీ సుబ్బారెడ్డి వర్గం కూడా సహకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పార్టీలో అఖిలప్రియ ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇందులో ఆమెను కొనసాగించాలా? తప్పించాలా? అన్నదానిపై చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం మీద అఖిలప్రియ జాతకం ఐదేళ్లలోనే పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.

Tags:    

Similar News