అఖిలప్రియకు ఆయనతోనే అవస్థలు తప్పేట్లు లేవే?

మాజీ మంత్రి అఖిలప్రియ అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరూ అందుకోలేని పదవులను అందుకున్నారు. కానీ అనతి కాలంలోనే అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ కు ఎసరు [more]

Update: 2020-05-13 12:30 GMT

మాజీ మంత్రి అఖిలప్రియ అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరూ అందుకోలేని పదవులను అందుకున్నారు. కానీ అనతి కాలంలోనే అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ కు ఎసరు వచ్చేలా ఉంది. అదీ అఖిలప్రియ భర్తతోనే అన్న టాక్ ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. అఖిలప్రియ భర్త భార్గవ్ వివాదాస్పద వ్యక్తిగా మారడంతో ఆమెకు భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పేట్లు లేవన్నది రాజకీయ విశ్లేషకులు సయితం చెబుతున్న మాట.

వివాహం తర్వాత….

అఖిలప్రియ కొంతకాలం క్రితం వివాహం చేసుకున్నారు. పెద్దలు అంగీకరించిన వివాహమే అయినా కుటుంబంలో వివాదాలు తలెత్తాయి. భూమా కుటుంబం విడిపోయింది. గత ఎన్నికల సమయంలోనూ అఖిల పెళ్లి ఆమె ఓటమికి ఒక కారణంగా చెబుతారు. మంత్రిగా ఉన్పప్పుడు ఆమె భర్త భార్గవ్ జోక్యం నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియకు మరింత సానుభూతి పెరిగి గెలవాల్సిన తరుణంలో ఓటమి పాలు కావడం ఆమె స్వయంకృతాపరాధమేనంటారు.

ఆయనతో విభేదాలు…

ఇక తన తండ్రి భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో కూడా అఖిలప్రియ వివాదాలు కొని తెచ్చుకున్నారు. ఆస్తుల విషయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు ఎంత ప్రయత్నించినా వీరిద్దరి మధ్య రాజీ కుదర్చలేదు. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో సయితం వేలు పెట్టడాన్ని అఖిలప్రియ సహించలేకపోయారు. అందుకే తాను మంత్రిగా ఉన్నంత కాలం ఆయనపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు.

ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్ర కేసులో….

ఏవీ సుబ్బారెడ్డిపై హత్యకు కుట్ర జరిగిందని పోలీసులు ఇటీవల ఛేదించారు. అయితే కుట్రకోణంలో అఖిలప్రియ భర్త పీఏ ఉన్నారని తేల్చారు. గతంలో ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన యాభై లక్షలు సుపారీ తీసుకున్న వారిని పోలీసులు కడప జిల్లాలో అరెస్ట్ చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు అఖిలప్రియ భర్త భార్గవ్ పీఏ శ్రీనివాసులు హస్తం ఉందని గుర్తించి అతనని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో భార్గవ్ హస్తం ఉందని బయటపడతే అఖిలప్రియకు రాజకీయంగా కష్టాలు తప్పవంటున్నారు. మొత్తం మీద అఖిలప్రియకు ఆయనే రాజకీయంగా ఇబ్బంది పెట్టేటట్లు ఉంది.

Tags:    

Similar News