ఇంకా కోలుకోలేదా…?

ఒక వెలుగు వెలిగిన కుటుంబం. 2019 ఎన్నికలకు ముందు వరకూ ఆ కుటుంబానికి ఎదురే లేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత భూమా కుటుంబం నేటికీ [more]

Update: 2019-07-12 14:30 GMT

ఒక వెలుగు వెలిగిన కుటుంబం. 2019 ఎన్నికలకు ముందు వరకూ ఆ కుటుంబానికి ఎదురే లేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత భూమా కుటుంబం నేటికీ కోలుకోలేకుండా ఉంది. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. భూమాశోభా నాగిరెడ్డి, భూమానాగిరెడ్డిల మరణం తర్వాత ఆ కుటుంబానికి అఖిలప్రియ పెద్దదిక్కయ్యారు. తల్లి శోభానాగిరెడ్డి మరణంతో ఏకగ్రీవంగా ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ గెలిచారు.

తండ్రి మరణంతో….

తర్వాత తండ్రి భూమా నాగిరెడ్డితో పాటు తాను కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అఖిలప్రియ. భూమా నాగిరెడ్డి మరణంతో ఆమెకు మంత్రి పదవి దక్కింది. అయితే భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి పట్టుపట్టి టిక్కెట్ ఇప్పించుకుని మరీ గెలిపించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికల వరకూ భూమా ఫ్యామిలీకి తిరుగులేకుండా ఉంది.

అందరినీ దూరం చేసుకుని….

అయితే ఆ తర్వాత అఖిలప్రియ గ్రాఫ్ దిగజారడం ప్రారంభమయింది. మంత్రి పదవి దక్కినా ఆమె నియోజకవర్గంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. తన కుటుంబానికి ఏళ్ల తరబడి అండగా నిలచిన వారిని అఖిలప్రియ కావాలని దూరం చేసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి లాంటి వారి అండను కోల్పోయారు. అఖిలప్రియ అతివిశ్వాసంతోనే మంత్రి పదవిలో ఉన్నన్నాళ్లూ విర్రవీగారని చెప్పకతప్పదు. తనతో పాటు సోదరుడు బ్రహ్మానందరెడ్డి, మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డిలు ఉండటంతో తమ కుటుంబానికి ఎదురులేదని భావించారు.

పార్టీ కార్యక్రమాలకు…..

కాని ఎన్నికల ఫలితాల తర్వాత అఖిలప్రియ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. దారుణ ఓటమిని ఆమె నేటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. తాను అనుకున్న వాళ్లే తనను మోసం చేశారని అఖిలప్రియ భావిస్తున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి సయితం వ్యాపారాలపై దృష్టిపెట్టారని చెబుతున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డల్లో ఓటమితో అఖిలప్రియ ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని, పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదని చెబుతున్నారు. పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపే కార్యక్రమం అఖిలప్రియ చేపట్టలేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, రాజకీయ భవిష్యత్తు కావాలంటే జనంలో ఉండాలని భూమా అభిమానులు కోరుతున్నారు.

Tags:    

Similar News