అఖిలేష్ కు అడ్వాంటేజీ అదే

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరస ఓటములతో కుంగిపోయిన అఖిలేష్ కు ఉప ఎన్నికలు కొంత ధైర్యాన్ని ఇచ్చాయి. క్యాడర్ [more]

Update: 2019-10-28 17:30 GMT

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరస ఓటములతో కుంగిపోయిన అఖిలేష్ కు ఉప ఎన్నికలు కొంత ధైర్యాన్ని ఇచ్చాయి. క్యాడర్ లో కూడా జోష్ నెలకొంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వాన్నే ప్రశ్నించే విధంగా ఫలితాలు వచ్చాయి. రెండు ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలయింది.

పొత్తులతో వెళ్లి….

అయితే 2018లో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కు ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో అఖిలేష్ యాదవ్ పొత్తు పెట్టుకుని ఫెయిల్ అయ్యారు. 2019 ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీతో కలసి పోటీ చేసి కంగు తిన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇక ఒంటరిగా పోటీ చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చారు.

తాజా ఉప ఎన్నికల్లో….

తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం ఆ పార్టీలో కొత్త జోష్ నింపింది. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో సమాజ్ వాదీ పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంది. మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఏడు, బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ ఒకటి, సమాజ్ వాదీ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. అఖిలేష్ యాదవ్ పార్టీ గెలిచిన రెండు స్థానాలూ బీజేపీ, బీఎస్పీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం.

సైకిల్ యాత్రకు…..

ఉప ఎన్నికల ఫలితాలతో ఇక ఒంటరిగా పోటీ చేయడమే బెటరన్న అభిప్రాయానికి అఖిలేష్ యాదవ్ వచ్చారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సయితం ఇదే వైఖరితో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 లో జరగనున్నాయి. మరో మూడేళ్ల సమయం ఉండటంతో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు అఖిలేష్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు. యూపీలో సైకిల్ యాత్ర చేయాలని ఆయన భావిస్తున్నారు. కుటుంబంలో, పార్టీలో విభేదాలను పరిష్కరించుకుని ముందుకు వెళితే అఖిలేష్ యాదవ్ కు తిరిగి సీఎం పీఠం దక్కే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News