నా దారి ఇక రహదారి… ఫైనల్ గా నాదే

ఉత్తర్ ప్రదేశ్ కు త్వరలో తాను ముఖ్యమంత్రి అవుతానని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గట్టిగా భావిస్తున్నారు. ఇప్పటి నుంచే ఆయన ఈ మేరకు [more]

Update: 2020-03-22 18:29 GMT

ఉత్తర్ ప్రదేశ్ కు త్వరలో తాను ముఖ్యమంత్రి అవుతానని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గట్టిగా భావిస్తున్నారు. ఇప్పటి నుంచే ఆయన ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రను చేయాలని అఖిలేష్ యాదవ్ ఇప్పటికే నిర్ణయించారు. ఒంటరిగానే ఈసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు అఖిలేష్ యాదవ్ సమాయత్తమవుతున్నారు.

పొత్తు పెట్టుకోవడం వల్ల…..

ఇతరులతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం లేదని భావంచిన అఖిలేష్ యాదవ్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. అంటే ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల గోదాలోకి దిగిన అఖిలేష్ యాదవ్ కు ఇబ్బందికరమైన ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ తో పొత్తు ఏమాత్రం కలసి రాలేదు.

గత ఎన్నికల్లో…..

ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ కూటమికి 325 స్థానాలు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీకి 47, బహుజన్ సమాజ్ పార్టీకి 19 స్థానాలు మాత్రమే దక్కాయి. పార్లమెంటు ఎన్నికల్లోనూ అఖిలేష్ యాదవ్ పొత్తు పెట్టుకున్నారు. తనకు బద్ధ శత్రువైన బహుజన్ సమాజ్ పార్టీతో కలసి ఆయన ఎన్నికలకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పొత్తు ప్రయత్నం విఫలమయింది. ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా గెలిచిన విపక్ష పార్టీలు పార్లమెంటు ఎన్నికల వేళ చతికలపడ్డాయి.

ఒంటరిగా వెళ్లాలని…..

అందుకే ఈసారి ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. తండ్రి ములాయం సింగ్ గట్టిగా పట్టుబడితే తన బాబాయి శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరే ఇతర పార్టీతో కలిసే ప్రసక్తి లేదని ఇప్పటికే ముఖ్యనేతలతో అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం, అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలులు వీస్తుండటం, మాయావతి హవా తగ్గిపోవడంతో ఈసారి విజయం తనేదనన్న ధీమాలో అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అంతేకాదు ఆయనకు ఇటీవల ఒక జ్యోతిష్యుడు 350 సీట్లు గెలుచుకుంటాడని చెప్పాడని మీడియాకు తెలపడం విశేషం. నిజంగా కష్టపడితే అఖిలేష్ గెలవడం సులువేమో కాని, జ్యోతిష్యుడి చెప్పారనడం అతి విశ్వాసానికి పోవడమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News