ఆకులకు అదిరేటి ఛాన్స్ అట

రాజమండ్రి తాజా మాజీ ఎమ్యెల్యే ప్రస్తుత వైసిపి నాయకుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ కు ముఖ్యమంత్రి జగన్ త్వరలో రాజయోగం ప్రసాదించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. గత [more]

Update: 2020-02-24 00:30 GMT

రాజమండ్రి తాజా మాజీ ఎమ్యెల్యే ప్రస్తుత వైసిపి నాయకుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ కు ముఖ్యమంత్రి జగన్ త్వరలో రాజయోగం ప్రసాదించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలు అయ్యాక ఆయన వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. వైద్యుడిగా జీవితం ఆరంభించి రియల్టర్ గా రాణించిన డాక్టర్ ఆకుల సత్యనారాయణకు రాజకీయాల్లో అవినీతి మరకలు ఏమి అంటుకోలేదు. బిజెపి శాసనసభ్యుడిగా ఆయన నిజాయితీగానే సేవలు అందించారు. జనసేన నుంచి వైసిపి లోకి బేషరతుగా చేరాను అని గతంలో ఆయన ప్రకటించారు. ఎమ్యెల్సీ, లేదా రాజ్యసభ ఆఫర్ ఇస్తామని విజయసాయి రెడ్డి ఆఫర్ తోనే ఫ్యాన్ పార్టీ లో డాక్టర్ ఆకుల సత్యనారాయణ చేరినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. తాజాగా మండలి రద్దు కానుండటంతో ఆ ఛాన్స్ పోయినట్లే. దాంతో త్వరలో భర్తీ కానున్న రాజ్యసభ సీట్లలో ఆకులకు బెర్త్ దక్కుతుందంటున్నారు. ఇప్పటికే వైసిపి కార్యక్రమాల్లో డాక్టర్ ఆకుల సత్యనారాయణ చురుగ్గా పాల్గొంటున్నారు. రాజమండ్రి వన్ టూ నియోజకవర్గాల్లో టిడిపి ఎమ్యెల్యేలు జెండా పాతడంతో ఇక్కడ బలాన్ని పెంచుకోవడంతో పాటు ఒక బలమైన పవర్ సెంటర్ అవసరాన్ని గుర్తించే అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

పార్లమెంట్ పై మక్కువ …

వాస్తవానికి బిజెపి లో చేరినప్పుడే డాక్టర్ ఆకుల సత్యనారాయణ పార్లమెంట్ సీటు ఆశించారు. అయితే అనూహ్యంగా టిడిపి తో పొత్తు కారణంగా ఆకులకు ఎమ్యెల్యే స్థానమే దక్కింది. గత ఎన్నికల్లో కమలానికి గాలి లేకపోవడంతో జనసేన నుంచి తన కోరిక నెరవేర్చుకోవాలని ఎంపీ స్థానానికి పోటీ చేసినా ఆయనకు నిరాశే మిగిలింది. గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజికవర్గం ప్రతినిధిగా వున్న డాక్టర్ ఆకుల సత్యనారాయణ కు ఆ కోటాలో జగన్ టిక్ పెట్టే అవకాశాలు వున్నాయనే అంటున్నారు. విద్యావంతుడు, వ్యాపారవేత్త కావడంతో బాటు ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడం తో పాటు ఢిల్లీ లోని బిజెపి నేతలతో ఆయనకు వున్న సంబంధాలు పార్టీకి పనికొస్తాయని వైసిపి అధినేత అంచనా వేసుకుంటున్నారని ఆకుల వర్గంలో చర్చ నడుస్తుంది. ఎమ్యెల్యేగా ఉన్నప్పుడు తన ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యానికి సంబంధించి ఆయన చేసిన సేవలు అందరి మన్ననలు అందుకున్నాయి.

వికటించిన ప్రయోగం …

జనసేనలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఆయన పోటీ చేసిన పార్లమెంట్ పరిధిలో శాసనసభకు పోటీచేసేఅభ్యర్థుల ఎంపిక ప్రక్రియ లో ఆకుల సత్యనారాయణ సూచించిన వారికి జనసేనాని నో చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి తోనే ఆ పార్టీలో కొనసాగారు. ఎన్నికలు పూర్తి అయ్యి ఫలితాలు రాకుండానే ఆయన జనసేనకు దూరం అయ్యారు. ఒక పార్టీ మనుగడ సాగించాలి అంటే కుల ముద్ర పడిన పార్టీతో ప్రయాణం సరికాదని నాడు తేల్చారు డాక్టర్ ఆకుల సత్య నారాయణ. ప్రజారాజ్యం గల్లంతుకు ఇదే కారణం అయ్యిందని జనసేనకు ఆ ముద్ర ప్రజల్లో పడటం తో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమే అని గుడ్ బై కొట్టేశారు డాక్టర్ ఆకుల సత్యనారాయణ.

చిరంజీవే అడ్డు …

మెగాస్టార్ చిరంజీవి వైసిపి ఆహ్వానం స్వీకరించి రాజ్యసభకు వెళ్ళే పక్షంలో మాత్రం డాక్టర్ ఆకుల సత్యనారాయణకు అవకాశాలు సన్నగిల్లే పరిస్థితి ఉందంటున్నారు. చిరు రీ ఎంట్రీ ఇవ్వని పక్షంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి కాపు సామాజికవర్గానికి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బిసి సామాజికవర్గానికి జగన్ రాజ్యసభ బెర్త్ లు కేటాయించవచ్చని అంటున్నారు. ఆ విధంగా గోదావరి జిల్లాల్లో రెండు బలమైన సామాజికవర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వైసిపి లో టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఎస్ చెప్పకుంటే మాత్రం డాక్టర్ ఆకుల సత్యనారాయణకు రాజ్యసభ అవకాశాలు మెరుగు అవుతాయన్నది ఆయన ఆశ. ఇప్పటికే జగన్ గోదావరి జిల్లాల్లో కాపు, బిసి సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యమే ఇచ్చారు. తూర్పు నుంచి మంత్రులుగా కన్నబాబును, పిల్లి సుభాష్ చంద్రబోస్ లతో పాటు ఎస్సి లనుంచి పినిపే విశ్వరూప్ లకు అవకాశం ఇచ్చారు. ఇక కార్పొరేషన్ పదవిని జక్కంపూడి రాజా కు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో రాబోయే రాజ్యసభ సీట్ల కోసం తూర్పులో కాపు సామాజికవర్గ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News