రాజమండ్రి లో మరో సోనూ సూద్

సోనూ సూద్ ఈ పేరు దేశంలో తెలియని వారెవ్వరూ లేరు. వదల బొమ్మాళి వదలా అంటూ అరుంధతి చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన సినీ విలన్ [more]

Update: 2021-04-25 09:30 GMT

సోనూ సూద్ ఈ పేరు దేశంలో తెలియని వారెవ్వరూ లేరు. వదల బొమ్మాళి వదలా అంటూ అరుంధతి చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన సినీ విలన్ కరోనా విపత్తు లో దేశవ్యాప్తంగా హీరోగా మారిపోయారు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల రేంజ్. సామాన్యుల్లో ఎలానూ రీల్ హీరో కాకుండా రియల్ హీరో గా మారిపోయారు అనుకోండి. ఇది కేవలం అతి కొద్ది కాలంలోనే ఆ ఇమేజ్ సోనూ కి సొంతం అయ్యింది. కష్టం ఉన్నవారిని ఆదుకోవడం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా నిలబెట్టడం సోనూ ప్రత్యేకత. దాని కోసం ఆయన ఎంతైనా ఖర్చు చేస్తారు. ఇలా కోట్ల రూపాయలను తృణ ప్రాయంగా ఖర్చు చేసి కరోనా హీరో ఎవరు అంటే సోనూ అనే స్థాయికి ఎదిగారు. ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో రాజమండ్రిలో కొత్త హీరో పుట్టుకొచ్చారు. ఆయనే మాజీ ఎమ్యెల్యే వైసిపి రాజమండ్రి కో ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ. ఆయన చేస్తున్న పనులే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

జగన్ టాస్క్ ఇది …

డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆయన ఒకప్పుడు బిజెపి రాజమండ్రి ఎమ్యెల్యే. ప్రస్తుతం వైసిపి లో చేరిన తరువాత కార్పొరేషన్ లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని అధినేత జగన్ ఆకుల సత్యనారాయణకు టాస్క్ అప్పగ్గించి కో ఆర్డినేటర్ గా నియమించారు. రాష్ట్రం అంతా జగన్ గాలి వీచి 151 సీట్లు గెలిస్తే రాజమండ్రి లో 30 వేల ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఓడిపోయారన్నది అధినేత జీర్ణించు కోలేక పోతున్నారు. అదీగాక ఇప్పటికే మూడు సార్లు టిడిపి రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానం దక్కించుకుంది. ఇన్ని రికార్డ్ లు ఉన్న టిడిపి కంచుకోటను బద్దలు కొట్టాలంటే సమర్ధుడైన నేత కోసం జగన్ అన్వేషణ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన రౌతు ను పక్కన పెట్టి ఎపి ఐఐసి మాజీ ఛైర్మెన్ శివరామ సుబ్రమణ్యానికి పగ్గాలు అప్పగించారు. ఆయన పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న దశలో వైసిపి లో ఎమ్యెల్యే జక్కంపూడి రాజా, ఎంపి భరత్ రామ్ వర్గాల నడుమ అంతర్గత యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారాలు ముదిరిపాకాన పడకముందే సుబ్రమణ్యానికి అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించి లక్ష్యాన్ని నిర్ధేశించారు జగన్. గత కొద్దికాలంగా డాక్టర్ ఆకుల సత్యనారాయణ పార్టీని దారిలో పెట్టేందుకు శ్రమిస్తూ వస్తున్నా ఆయనపైనా వివాదాల ముద్రను గ్రూప్ లు వేసి అధిష్టానానికి ఫిర్యాదులు పరంపర మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రతి చిన్న చిన్న అంశాలను కొన్ని స్థానిక పత్రికల్లో రాయిస్తూ వాటిని అధిష్టానంకి చేరవేస్తూ కొందరు సిటీ వైసిపి లో క్రమశిక్షణకు చరమగీతం పాడేస్తుండటం గుర్తించిన ఆకుల సత్యనారాయణ తనదైన శైలిలో వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలకు సొంత పార్టీ వారే కాదు ప్రత్యర్థి పార్టీలవారు హడలిపోతున్నారు.

అధికారపార్టీ, ప్రతిపక్షం రెండు ఆయనే …

డాక్టర్ ఆకుల సత్యనారాయణ డిఫెన్స్ పొలిటికల్ గేమ్ కాకుండా ఎదురుదాడే అస్త్రంగా రాజకీయాలు మొదలు పెట్టారు. సొంత పార్టీ లో నేతలు, కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ఆయన క్షమించడం లేదు. ఇక అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేస్తున్నారు. డివిజన్లలో తిరుగుతూ ప్రజా సమస్యలపై కార్పొరేషన్ అధికారులు స్పందించకపోతే సొంత డబ్బు పెట్టి మరీ పనులు అప్పటికప్పుడు చేయిస్తున్నారు. పార్టీ ద్వారా నామినేటెడ్ పదవులు పొంది పని చేయని వారికి నిత్యం అక్షింతలు వేసేస్తున్నారు. మీకు పదవులు ఇచ్చింది పడుకోమని కాదు ప్రజలకు పనులు చేసి పెట్టి పది ఓట్లు తేవడానికి అంటూ అందరిలో ఉతికేస్తున్నారు. ఇక రాజమండ్రి కమిషనర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియలో జరుగుతున్న తప్పులను కమిషనర్ పట్టించుకోకపోవడం, డివిజన్లలో ప్రజా సమస్యల పట్ల నిర్లిప్తత వహించడం పై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కమిషనర్ ఉంటె పార్టీకి కష్టమే అని నేరుగా మీడియా ముందే ఆకుల సత్యనారాయణ ప్రకటించేశారు. ఇలా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం పాత్రలను రెండు ఆయనే పోషిస్తూ తెలుగుదేశం వారికి ఏ పని లేకుండా చేసేసి గేమ్ చేంజర్ అయిపోయారు.

చేతికి ఎముక లేకుండా …

డివిజన్లలో పర్యటించే సమయంలో నిరుపేదల ఇళ్ళకు నేరుగా వెళ్ళి వారి ఆర్ధిక పరిస్థితులను తెలుసుకుని వారి అప్పులను వడ్డీలను అక్కడికక్కడే మాఫీ చేస్తున్నారు. అవి లక్షల్లో ఉన్నా వేలల్లో ఉన్నా డాక్టర్ ఆకుల సత్యనారాయణ లెక్క చేయడం లేదు. ఇక విద్యా వైద్యానికి సంబంధించి ఆయన్ను సాయం అడిగిన వారికి లేదన్న మాట లేకుండా పోయింది. కొందరి పరిస్థితులు చూసి అప్పటికప్పుడే ఆర్థికసాయం వారి చేతుల్లో పెట్టి అందరికి షాక్ ఇస్తున్నారు. ఇటీవల వాంబే గృహాల సందర్శనలో భర్త చనిపోయి అమ్మా, అత్తలను పోషిస్తూ అనారోగ్యంతో ఉన్న కొడుకు తో గడుపుతున్న గృహిణి బాధలు విని చలించిపోయారు. వారు అధికవడ్డీకి చేసిన అప్పు 30 వేలరూపాయలను బాకీ చెల్లించాలని చేతిలో పెట్టేశారు. ఆమె కుమారుడి ఆపరేషన్ కు తానె ఖర్చు భరిస్తా అని భరోసా ఇచ్చారు. మరో వృద్ధురాలు వేలిముద్ర పడక రేషన్ నెలరోజులుగా రేషన్ అందకపోవడంతో సొంత ఖర్చుతో బియ్యం బస్తాలు అందించేశారు. రోడ్డుపై టిఫిన్లు అమ్ముకుంటూ ఒక తల్లి తన కుమార్తెను ఉన్నతంగా చదివించినా చిరు ఉద్యోగం ఆమె చేస్తుండటంతో వారి అప్పు రెండు లక్షల రూపాయలను ఆకుల సత్యనారాయణ అందించేందుకు సిద్ధం అయ్యారు. ఆ యువతి ఇంటికి వెళ్ళి ఆమె ఆర్ధిక పరిస్థితి తో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెసి మూడు సబ్జెక్టు లలో గోల్డ్ మెడలిస్ట్ గా గుర్తించి ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పించే పనిలో పడ్డారు డాక్టర్ ఆకుల. అదేవిధంగా నగరంలోని చరిత్ర కలిగిన ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు అయినా అందరి సహకారంతో తీర్చిదిద్దే పనిలో పడ్డారు. విద్యా, వైద్యానికి సంబంధించి ఎవరు ఏ సహాయం అర్ధించినా మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ చదువులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆయనే భరిస్తూ వారి పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తు రాజమండ్రి సోనూ సూద్ గా మారిపోయి కొత్త ట్రెండ్ కు తెరతీశారు డా ఆకుల సత్యనారాయణ.

Tags:    

Similar News