దాడులకు అసలు కారణమిదేనా?

మతం మత్తు మందులాంటిదని కారల్ మార్క్స్ ఏనాడో ఉద్ఘాటించారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలను చూసిన తరవాత ఇది నిజం అనిపించక [more]

Update: 2021-06-05 16:30 GMT

మతం మత్తు మందులాంటిదని కారల్ మార్క్స్ ఏనాడో ఉద్ఘాటించారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలను చూసిన తరవాత ఇది నిజం అనిపించక మానదు. తాజాగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దాడులకు కూడా ఇదే కారణమని చెప్పకతప్పదు. గత కొద్ది రోజులుగా హమస్ తీవ్రవాదుల రాకెట్ల దాడులకు ఇజ్రాయెల్ ద్దరిల్లుతోంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాలస్తీనా ప్రాంతంలో అమాయక పౌరుల ప్రాణాలు బలవుతున్నాయి. ఇరుదేశాల మధ్య రాజీకి పొరుగుదేశమైన ఈజిప్టు చేసిన యత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దగల సమర్థత పెద్దన్న అమెరికాకు మాత్రమేఉంది. ఇజ్రాయెల్ కు గట్టి మద్దతుదారైన వాషింగ్టన్ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉంది. ఇంతవరకు నేరుగా జోక్యం చేసుకోలేదు. పెద్దన్న రంగంలోకి దిగితేనే ఈ పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు చక్కబడగలవు.

అసలు గొడవలకు…?

ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం పాతబస్తీలోని అల్ అఖ్సా మసీదు ప్రస్తుత గొడవలకు ప్రధాన కారణం. ఈ మసీదు మూడు మతాలైన ఇస్లాం, యూదు, క్రిస్టియన్లకు పవిత్ర స్థలం. 35 ఎకరాల్లో విస్తరించిన ఈ మసీదును ముస్లిములు హరామ్ అల్ షరీఫ్ (పవిత్ర స్థలం) అని భావిస్తుంటారు. బంగారు పూతతో కూడిన రాతిచిప్ప లాంటి కప్పు దీని ప్రత్యేకత. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడకు వచ్చి ప్రార్థన చేసిన తరవాత స్వర్గారోహణ చేశారని ముస్లిములు విశ్విస్తుంటారు. ఇక్కడ ఒకేసారి అయిదువేల మంది ప్రార్థనలు చేసే అవకాశం ఉంది. సెలవు రోజుల్లో, పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలు ఈ మసీదులో పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేస్తుంటారు. యూదులు ఈ ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్ (పవిత్ర కొండ) అని వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు దేవలయాలు ఉండేవి.మొదటి దానిని బైబిల్ ప్రకారం కింగ్ సాల్మన్ నిర్మించారని చెబుతుంటారు. తరవాత దానిని బాబిలోనియన్లు కూలగొట్టారు. రెండోది రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగివచ్చాక ఇక్కడే మళ్లీ దేవాలయం కడతారని ఇక్కడింకా దైవశక్తి ఉందన్నది యూదుల విశ్వాసం. క్రైస్తవులకూ ఈ మసీదు పవిత్ర
స్థలం. ఆదివారాల్లో ఇక్కడ పెద్దయెత్తున ప్రార్థనలు జరుగుతుంటాయి.

ఆక్రమించుకుని…?

1967 నాటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ మసీదు ఉన్న తూర్పు జెరూసలెమ్ ను జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఈప్రాంతంలోనే జెరూసలెం పాతబస్తీ ఉంది. తరవాత రోజుల్లో జెరూసలెమ్ ను తన రాజధానిగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. 1994లో ఇజ్రాయెల్-జోర్డాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మసీదు నిర్వహణ బాధ్యతను జోర్డాన్ లోని ఓ ఇస్లామిక్ ట్రస్టుకు అప్పగించారు. ఇజ్రాయెల్ బలగాలు మసీదు ప్రాంగణంలోనే ఉంటూ ఇస్లామిక్ ట్రస్టుతో సమన్వయంగా వ్యవహరిస్తుంటాయి. ఒప్పందంలో భాగంగా ముస్లిములను అనుమతించినట్లు యూదులు, క్రైస్తవులను అనుమతించరు. వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించడానికి మాత్రమే అనుమతిస్తారు. దీనిపై యూదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఘర్షణలు….?

అల్ అఖ్సా మసీదు ప్రాంగణంలో ప్రార్థనలకు తమకూ అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇజ్రాయెల్ సర్కారు కూడా వారికి పరోక్షంగా మద్దతు పలుకుతోంది. ఇందులో బాగంగా ఇటీవల ‘ఇజ్రాయెల్ డే’నిర్వహించి పాలస్తీనా వాసులను రెచ్చగొట్టింది. దీంతో జెరూసలెం పాతబస్తీలో యూదులు, పాలస్తీనీయులు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. గత కొద్దిరోజులుగా పాలస్తీనాలోని తీవ్రవాద సంస్థ ‘హమస్’ ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడులు చేస్తోంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సమాధానం చెబుతోంది. ఫలితంగా సున్నిత ప్రాంతమైన పశ్చిమాసియా లో యుద్ధ వాతావరణం నెలకొంది. హమస్ దాడుల్లో ఇజ్రాయెల్ లో నివసిస్తున్న కేరళ మహిళ ఒకరు మరణించారు. దాడులపై ఐరాసతో సహా అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ఒక్క అమెరికా జోక్యం మాత్రమే ఈ పరిస్థితిని చక్కదిద్దగలదు. కానీ పెద్దన్న మాత్రం కుంభకర్ణుడి నిద్ర నుంచి ఇంకా మేల్కొన్నట్లు లేదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News