ఆళగిరి మళ్లీ డైలమా? ఏం చేయనున్నారో?

తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరుణానిధి కుమారుడు ఆళగిరి పార్టీ పై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆళగిరి పార్టీ పెడతారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. [more]

Update: 2021-01-11 16:30 GMT

తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరుణానిధి కుమారుడు ఆళగిరి పార్టీ పై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆళగిరి పార్టీ పెడతారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఆయన మద్దతుదారుల సమావేశంలో కూడా పార్టీపై ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీ పెట్టాలలా? వద్దా? అన్నది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆళగిరి చెప్పడం విశేషం. ఆళగిరి పార్టీ పెట్టరని కొందరు, పెట్టితీరతారని కొందరు ఇప్పటికే సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

డౌటుగానే ఉంది…..

కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి సొంత పార్టీ పెడతారని గత కొంతకాలంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన పార్టీ పెట్టి రజనీకాంత్ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని భావించారు. అయితే రజనీకాంత్ పార్టీ ని పెట్టకపోతుండటంతో ఇప్పుడు ఆళగిరి సయితం డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీ పట్ల కొంత సానుకూలతతో ఉన్నా బీజేపీ ఇప్పటికే అన్నాడీఎంకే కూటమిలో ఉండటంతో ఆ కూటమిలో చేరడం ఆళగిరికి సాధ్యపడదు.

ఆ ప్రాంతంలో తప్ప….

మరోవైపు ఒంటరిగా పోటీ చేసేంత సత్తా ఆళగిరికి లేదు. ఆళగిరికి ఒక్క మధురై ప్రాంతంలోనే పట్టు ఉంది. అక్కడే కొన్నాళ్లుగా ఉండటంతో ఆ ప్రాంతం తప్ప ఇతర ప్రాంతాల్లో ఆళగిరి కి క్యాడర్ లేదు. దీంతో ఆయన పార్టీ పెట్టినప్పటికీ ఒక ప్రాంతానికే పరిమితం కావాల్సి ఉంటుంది. అది ఆళగిరికి ఇష్టంలేదు. కమల్ హాసన్ ఏర్పాటు చేయనున్న తృతీయ కూటమిపై కూడా ఆళగిరి ఆసక్తిగా లేరని తెలుస్తోంది.

స్టాలిన్ ను ఓడించేందుకయితే….

ఇప్పటికే ఆళగిరి స్టాలిన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. తనను డీఎంకేలోకి రాకుండా స్టాలిన్ అడ్డుకున్నారంటూ, తనపై కుట్ర జరిగిందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ను దెబ్బతీసేందుకే కొత్త పార్టీ పెట్టవచ్చన్న వాదన కూడా విన్పిస్తుంది. అయితే ఇది వద్దని ఆయన సన్నిహితులు కొందరు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రజనీకాంత్ ప్రకటనతో ఆళగిరి మరోసారి డైలమాలో పడినట్లేనంటున్నారు.

Tags:    

Similar News