ఆళగిరి దిగి వస్తున్నారా…?

దాదాపు ఏడాదికాలంగా మౌనంగా ఉన్న కరుణానిధి కుమారుడు ఆళగిరి తిరిగి మరోసారి వార్తల్లోకి వస్తున్నారు. ఆళగిరి అలజడి మళ్లీ విన్పిస్తోంది. డీఎంకే లో తనను చేర్చుకోవాల్సిందిగా డీఎంకే [more]

Update: 2019-09-01 18:29 GMT

దాదాపు ఏడాదికాలంగా మౌనంగా ఉన్న కరుణానిధి కుమారుడు ఆళగిరి తిరిగి మరోసారి వార్తల్లోకి వస్తున్నారు. ఆళగిరి అలజడి మళ్లీ విన్పిస్తోంది. డీఎంకే లో తనను చేర్చుకోవాల్సిందిగా డీఎంకే అధినేత స్టాలిన్ కు సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులనే ఇందుకు ఆళగిరి వినియోగించుకున్నట్లు సమాచారం. ఎలాగైనా డీఎంకే లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆళగిరి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఈమేరకు తన అనుచరులతో కూడా ఆళగిరి మధురై ప్రాంతంలో వరస సమావేశాలను నిర్వహిస్తున్నారు.

కరుణ ఉన్నప్పుడే….

ఆళగిరి కరుణానిధి జీవించి ఉన్నప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. స్టాలిన్ పై అనుచితమైన, తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వల్లనే ఆళగిరిని సస్పెండ్ చేశారు. కరుణానిధి బతికి ఉన్నంత వరకూ ఆ సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు. కరుణానిధి మరణించిన తర్వాత ఆళగిరి తిరిగి పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. బెదిరింపులకు దిగారు. కుటుంబ సభ్యులతో రాయబారాలు నడిపారు.

పార్టీలో చేర్చుకునేందుకు…..

అయితే అప్పడున్న పరిస్థితుల్లో స్టాలిన్ ఆళగిరిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత చూపలేదు. ఆళగిరి చేరికతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని భావించడం, కుటుంబ గొడవలు పార్టీకి చుట్టుకుంటాయని భావించిన స్టాలిన్ ఆళగిరిని దూరంగా పెట్టారు. తిరువారూర్ ఉప ఎన్నికలో తాను పోటీకి దిగుతానని ప్రకటించిన ఆళగిరి తర్వాత అటువైపు చూడలేదు. ఆళగిరికి మద్దతు తెలిపిన డీఎంకే నేతలను పార్టీ పదవులనుంచి స్టాలిన్ తొలగించారు.

తన కుమారుడినైనా….

ఆ తర్వాత ఆళగిరి జాడలేదు. లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడంతో స్టాలిన్ కూడా ఆళగిరిని పూర్తిగా మరిచిపోయారు. అయితే తాజాగా ఆళగిరి తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో స్టాలిన్ వద్దకు రాయబారం పంపుతున్నారు. తనకు ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తే చాలునని ఆళగిరి స్టాలిన్ కు ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్ మాత్రం ఆళగిరిని చేర్చుకునేందుకు సుముఖంగా లేరు. దీంతో ఆళగిరి తనకు కాకున్నా తన కుమారుడు దయానిధికి పార్టీలో అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. దీనిపై స్టాలిన్ కొంత సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఆళగిరి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని దిగి వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News