అమరావతి కధలు చెప్పేదెవరు ?

అమరావతి కధలు తెలుగు సాహిత్యంలో చక్కని స్థానాన్ని పొందాయి. ఏపీ రాజకీయాల్లో మాత్రం అమరావతి రాజధాని కధ దాని కంటే ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. అమరావతి కధ [more]

Update: 2020-12-18 08:00 GMT

అమరావతి కధలు తెలుగు సాహిత్యంలో చక్కని స్థానాన్ని పొందాయి. ఏపీ రాజకీయాల్లో మాత్రం అమరావతి రాజధాని కధ దాని కంటే ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. అమరావతి కధ చెప్పి చరిత్రలో నిలవాలని ఆధునిక తెలుగు వల్లభుడు చంద్రబాబు అప్పట్లో చాలానే ప్రయత్నం చేశారు. మరి ఆ చరిత్రను చెరిపేయాలని యువ నాయకుడు జగన్ ఇపుడు దానికి మించి ఎత్తులు వేశారు. అమరావతిని చిన్నదిగా చూపించడానికే మూడు రాజధానులు ముందుకు తెచ్చారు. దాంతో మహా మంత్రి తిమ్మరుసు నీతిలా అమరావతికి పోటీగా రెండు రాజధానులు వస్తే ఏ మాత్రం వెలుగూ వైభోగం లేకుండా ఉన్న చోటనే ఉంటుందని జగన్ భారీ స్కెచ్ వేశారు.

జగన్ హవాకు బ్రేక్ ….

ఇక మూడు రాజధానుల విషయంలో కొన్ని నెలల క్రితం వరకూ జగన్ కత్తికి ఎదురులేకుండా పోయింది. అంతా రాజ్యాంగం ప్రకారమే సవ్యగా కధ సాగింది అనిపించింది. కేంద్రం కూడా రాష్ట్రాలకే రాజధానుల అధికారం అంటూ ప్రకటించేశాక జగన్ ఏమనుకుంటే అదే జరుగుతుంది అన్నదే టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి వారే నిర్ణయానికి వచ్చేశారు. ఇక చంద్రబాబు అయితే ఒకానొక దశలో జగన్ ఇపుడు అమరావతి రాజధానిని విశాఖ మార్చినా తాము అధికారంలోకి వస్తే తిరిగి అమరావతినే ఉంచుతామని ప్రకటించారంటే ఎంత‌టి నిరాశలోకి వెళ్లారో కూడా అర్ధమవుతుంది.

అందరూ ఒక్కటే…..

ఇపుడు మాత్రం కుడి ఎడమల తేడా లేకుండా అంతా అమరావతే మన రాజధాని అనేస్తున్నారు. నిన్నటి దాకా అమరావతి మీద పెద్దగా వాయిస్ వినిపించని సీపీఎం కూడా ఇపుడు లీడ్ తీసుకుంటామంటోంది. అన్ని పార్టీలతో కలసి జేఏసీ కోసం ట్రై చేస్తోంది. మరో వైపు మేధావుల ఫోరం పేరిట రాజకీయ విశ్లేషకుడు పరకాల‌ ప్రభాకర్ లాంటి వారు అమరావతి రాజధాని ఒక్కటే ఉండాలంటూ జనాభిప్రాయాన్ని కూడగడుతున్నారు. ఈ నేపధ్యంలో రాజధాని విషాదం పేరిట పరకాల ప్రభాకర్ తయారు చేసిన ఫిల్మ్ డాక్యుమెంట్ కూడా విశాఖలో తాజాగా ప్రదర్శించారు. ఈ మేధావుల సమావేశానికి అటు బీజేపీ, ఇటు టీడీపీ రాజకీయ ప్రముఖులతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా హాజరుకావడం విశేషం.

పరకాల సడెన్ ఎంట్రీ ….

ఇక అమరావతి రాజధాని విషయంలో పరకాల సడెన్ ఎంట్రీని ఎలా చూడాలన్నది రాజకీయ విశ్లేషకులకు కూడా అర్ధం కావడంలేదు. ఆయన భార్య కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పరకాల ఎంత తాను ఏ పార్టీ కాదు అని చెప్పుకున్నా కేంద్రంలో ఉన్న బలమైన పార్టీకి భిన్నంగా వెళ్లరు. అందునా భార్య ప్రాధాన్యత కలిగిన పోస్ట్ లో ఉండగా ఆయన అసలు ఎదురు వెళ్ళరు, పైగా సాయం చేస్తారు కూడా. ఇక పరకాలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఇలా రెండు పార్టీలకు వారధిగా రంగంలోకి ఆయన దిగారు అనుకుంటున్నారు. పరకాల మీడియా సమావేశంలో చెప్పిన దాని బట్టి చూసినా ఆయన డాక్యుమెంట్ ని చూసినా కూడా అమరావతే ఏకైక రాజధాని కావాలన్నదే డిమాండ్ గా కనిపిస్తోంది. దానిని అన్ని వైపుల నుంచి జనాభిప్రాయంగా మలచాలన్న తపన కూడా కనిపిస్తూంది.

బీజేపీ గేమ్ ప్లాన్…..

మరో వైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మధ్య సడెన్ గా అమరావతే మన ఏకైక రాజధాని అని చెప్పడం, జనసేన కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ కూడా అదే మాట వల్లించడం ఎటూ టీడీపీ పట్టు కూడా అటే ఉండడంతో జగన్ మూడు రాజధానుల కలలు కల్లలు అవుతాయా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. తెర వెనక నుంచి కమలం చెప్పిస్తున్న అమరావతి కధలు జనం పూర్తిగా వినే రోజు తొందరలోనే వస్తుంది అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News