ఆళ్ల మౌనం అందుకేనా? నియోజకవర్గంలో హాట్ టాపిక్
వైసీపీ ఎమ్మెల్యేల్లో కీలక నాయకుడు, సీఎం జగన్‌కు అత్యంత ఆత్మీయుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. గడిచిన నాలుగు నెలలుగా మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల [more]
వైసీపీ ఎమ్మెల్యేల్లో కీలక నాయకుడు, సీఎం జగన్‌కు అత్యంత ఆత్మీయుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. గడిచిన నాలుగు నెలలుగా మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల [more]
వైసీపీ ఎమ్మెల్యేల్లో కీలక నాయకుడు, సీఎం జగన్‌కు అత్యంత ఆత్మీయుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. గడిచిన నాలుగు నెలలుగా మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయన వచ్చి ఓటేసి మౌనంగా వెళ్లిపోయారు. నిజానికి ఆయన వైఖరిని నిశితంగా గమనించిన వారు.. నిత్యం ఆయన మీడియాలో ఉండేందుకే ఇష్టపడతారని చెబుతారు. అలాంటిది కరోనా ప్రభావం ప్రారంభమైన నాటి నుంచి కూడా ఆయన జాడ ఎక్కడా మీడియాలో కని పించడం లేదు. పోనీ.. ప్రకటనలైనా జారీ చేశారా? అంటే అది కూడా లేదు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయంపై గడిచిన రెండు రోజులుగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది.
హైదరాబాద్ లోనే ఉండి…..
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు ? ఏం చేస్తున్నారు ? ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో నియోజకవర్గంలోని పేదలకు ఎలాంటి సాయం అందిస్తున్నారు ? అసలు మీడియాకు ఎందుకు దూరమయ్యారనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఇతమిత్థంగా తెలియక పోయినా.. కొన్నాళ్లుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని టాక్. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని అంటున్నారు నియోజకవర్గంలోని ఆయన అనుచరులు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని అంటున్నారు. అయితే, నియోజకవర్గంలో పేదలకు లాక్‌డౌన్ సమయంలో అందాల్సిన అన్ని కార్యక్రమాలను ఆయన పూర్తి చేస్తున్నారని, ప్రత్యేకంగా దానికి ఓ టీంను ఏర్పాటు చేశారని అంటున్నారు.
అందుకే మౌనమా?
రాజకీయంగా అయితే.. మాత్రం ఆయన మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాకే బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఇదిలావుంటే.. తాజాగా ఖాళీ అయిన మంత్రి వర్గంలోని రెండు స్థానాల్లో ఆళ్లకు అవకాశం ఇస్తారనే టాక్ కూడా నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తోంది. రాజ్యసభ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో చర్చ అంతా కూడా మంత్రివర్గంపై పడింది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన రెండు స్థానాల్లోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం దక్కుతుందా? అనే చర్చ తెరమీదికి వచ్చింది.
బహిరంగ సభలోనే హామీ…..
సీఎం జగన్మోహన్ రెడ్డే గత ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలు లోకేష్‌ను ఓడిస్తే తాను ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. తొలి మంత్రి వర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు అనూహ్యంగా గుంటూరు జిల్లాకే చెందిన మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు వెళ్లడంతో అదే జిల్లా నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేబినెట్లో మంత్రి పదవి ఖాయం అన్న చర్చలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా హడావిడితో పాటు ఏపీలో రాజకీయం జోరందుకున్న నేపథ్యంలో ఆళ్ల అసలు కనిపించడం లేదేమిటి? అనే విషయం నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు.
నెల రోజుల తర్వాతనేనట…
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాని.. అధికారంలోకి వచ్చాక కాని ఏ చిన్న విషయంపై అయినా ఆయన ప్రెస్‌మీట్ పెట్టి హడావిడి చేసేవారు. ఇప్పుడు ఆయన మీడియాలో కనపడకపోవడంతో ఆయన గురించి ఆరాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే, ఆయన నాలుగు మాసాలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరో నెల రోజుల్లోపే తిరిగి వస్తారని అంటున్నారు. అయితే, మంత్రి వర్గంలో సీటు ఖరారు విషయంపై మాత్రం వారు మౌనం పాటిస్తుండడం గమనార్హం.