అల్లుడితో ఇబ్బందులేనటగా

మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులపైన వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువల ప్రభావాన్ని అంతగా తోసిపుచ్చలేం. అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అధికారిక సమావేశాల్లో పాల్గొనడం కొత్తేమీ [more]

Update: 2019-12-13 16:30 GMT

మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులపైన వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువల ప్రభావాన్ని అంతగా తోసిపుచ్చలేం. అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అధికారిక సమావేశాల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు. ఈ దుస్సంప్రదాయం భారత రాజకీయాల్లో వేళ్లూనుకుపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఏ నాయకుడు పదవిలో ఉన్నా ఈ తలనొప్పులు తప్పవు. చరిత్ర చెబుతున్న సత్యమిది. ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏకైక గారాల పట్టి ఇందిరా గాంధీ. నెహ్రూపై ఆమె ప్రభావం ఎక్కువ. అప్పట్లో కేరళలోని తొలి వామపక్ష ప్రభుత్వం ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో పనిచేస్తుండేది. ఆ ప్రభుత్వం రద్దు విషయంలో నెహ్రూపై ఇందిరాగాంధీ తీవ్ర వత్తిడి తెచ్చారన్న ప్రచారం అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక ఇందిరాగాంధీ ప్రధాని గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ ప్రత్యక్షంగా పరిపాలనలో జోక్యం చేసుకునే వారు. ఢిల్లీలో మురికవాడల కూల్చివేత, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్ణయాలు సంజయ్ ప్రభావంతోనే జరిగాయి. అవే అంతిమంగా 1977లో ఇందిర ఓటమికి దారితీశాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రధాని మొరార్జీదేశాయ్ కు సయితం పుత్రుడితో ఇబ్బందులు తప్పలేదు. కుమారుడు కాంతిలాల్ దేశాయ్ తో ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై అల్లుళ్ల ప్రభావం అందరికీ తెలిసిందే.

అల్లుడు వరణ్ సర్దేశాయ్…..

ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు అందుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. అధికారం చేపట్టి పట్టుమని పది రోజులు కాకపోయినప్పటికీ ఈ విషయంలో విపక్షాల నుంచి అప్పుడే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉద్ధవ్ థాక్రే మేనల్లుడు, శివసేన కార్యదర్శి వరుణ్ సర్దేశాయ్ ప్రభుత్వ పాలనలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను విపక్షాల నుంచి ముఖ్యంగా బీజేపీ నుంచి బలంగా విన్పిస్తున్నాయి. వరుణ్ సర్దేశాయ్ రాష్ట్ర సచివాలయాన్ని ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ బహిరంగంగా విమర్శించారు. ఇటీవల ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలో సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్ధవ్ థాక్రే పక్కనే వరుణ్ సర్దేశాయ్ కూర్చుని ఉన్న ఫొటోలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఇంతకు ముందు తండ్రి తరుపున పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఆయన ముంబయి నగరంలోని వర్లీ నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావడంతో బిజీ అయ్యారు. దీంతో వరుణ్ సర్దేశాయ్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సతీమణి రష్మి సోదరుడి కుమారుడే వరుణ్ సర్దేశాయ్. వాస్తవానికి అధికారిక సమావేశాలే కాకుండా అనధికారికంగా అన్ని వ్యవహారాలను వరుణ్ సర్దేశాయ్ పర్యవేక్షిస్తున్నారు.

వివరణ ఇచ్చుకున్నా…..

వరుణ్ సర్దేశాయ్ అంశం వివాదాస్పదంగా మారడంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి చిక్కుల్లో పడింది. ఈ కూటమి ఆత్మరక్షణలో పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనుభవ రాహిత్యం వల్లే ఇలా జరిగిందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాజ్ మాలిక్ వివరణ ఇవ్వడం గమనార్హం. “ఇది కొత్త ప్రభుత్వం, పరిపాలన అనుభవం లేదు. మరోసారి ఇలా జరగదు” అని ఆయన పేర్కొన్నారు. ఉద్ధవ్ థాక్రే తరుపున ఎన్సీపీ నేత మాలిక్ వివరణ ఇవ్వడంలో అర్థం లేదు. నేరుగా ఉద్ధవ్ థాక్రేనే స్పందిస్తే బాగుండేది. ఇక వరుణ్ వివరణ కూడా సంతృప్తికరంగా లేదు. ఇది పెద్ద తప్పుకాదని తొలుత పేర్కొని తర్వాత నాలుక్కరుచుకున్నారు. సమావేశంలో సున్నితమైన అంశాలను చర్చించలేదని, పర్యాటక రంగానికి సంబంధించి సాధారణ విషయాలను మాత్రమే మాట్లాడామని, దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదని, వివాదం చేయాల్సిన అవసరం లేదని వరుణ్ సర్దేశాయ్ వివరణ ఇచ్చారు. ఇది కీలకమైన హోంశాఖ సమావేశం కాదనికూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టారు. గతంలో ఫడ్నవిస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన భార్య అమృత ఫడ్నవిస్ అధికారిక సమావేశాలకు హాజరయ్యేవారన్నారు. బీజేపీ నాయకులే అధికారిక సమావేశాలకు వెళ్లిన సందర్భాలున్నాయనిి వరుణ్ సర్దేశాయ్ ధ్వజమెత్తారు. ఆరోపణలు, వివరణలు ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోతే ముందు ముందు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News