అధిష్టానానికి షాక్ ఇచ్చిన ఆమంచి కృష్ణమోహ‌న్‌

ఏపీలో జ‌రిగిన మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఊహ‌కే అంద‌ని విజ‌యం ఎలా సాధించిందో ఇప్పుడు కూడా అంతే అప్రతిహ‌త విజ‌యం సాధించింది. ఒక్క [more]

Update: 2021-03-15 13:30 GMT

ఏపీలో జ‌రిగిన మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఊహ‌కే అంద‌ని విజ‌యం ఎలా సాధించిందో ఇప్పుడు కూడా అంతే అప్రతిహ‌త విజ‌యం సాధించింది. ఒక్క తాడిప‌త్రి మున్సిపాల్టీ మిన‌హా ఏ మున్సిపాల్టీ, ఏ కార్పొరేష‌న్‌లోనూ టీడీపీ జెండా ఎగ‌ర‌లేదు. ప‌లు చోట్ల వైసీపీ వ‌ర్సెస్ వైసీపీ రెబ‌ల్స్ మ‌ధ్య పోరు జ‌రిగింది. ఈ పోరు మూడు, నాలుగు వార్డుల్లో మాత్రమే జ‌రిగితే ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాల్టీలో టీడీపీ మూడో ప్లేస్‌కు వెళ్లిపోతే అక్కడ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం నేతృత్వంలో వైసీపీ ప్యానెల్ వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే, చీరాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహ‌న్ ఆధ్వర్యంలోని వైసీపీ రెబ‌ల్స్ ప్యానెల్ అన్ని వార్డుల్లోనూ పోటీ ప‌డ్డాయి. మొత్తం 33 వార్డుల‌కు గాను మూడు వార్డులు ఏక‌గ్రీవం కాగా.. మిగిలిన 30 వార్డుల్లోనే ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆమంచి కృష్ణమోహన్ వ‌ర్గం 29 చోట్ల రెబల్స్‌గా బ‌రిలో ఉంది. ఈ రోజు ఎన్నిక‌ల కౌంటింగ్‌లో చీరాల ఫ‌లితాలు చూసి వైసీపీ వ‌ర్గాలు సైతం ఖంగుతిన్నాయి.

ఆమంచి వర్గం……

మొత్తం 30 వార్డుల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బ‌ల‌రాం వ‌ర్గం 18 వార్డుల్లో విజ‌యం సాధించగా, ఆమంచి ఫ్యానెల్ రెబ‌ల్స్ ఏకంగా 14 వార్డుల్లో విజ‌యం సాధించారు. ఇక టీడీపీ వీరిద్దరి మ‌ధ్య పోటీతో స‌గం వార్డుల్లోనే పోటీకి దిగి కేవ‌లం ఒక్క వార్డుతో స‌రిపెట్టుకుంది. దాదాపు వైసీపీకి స‌మానంగా 14 వార్డుల్లో గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ వ‌ర్గం వైసీపీ అభ్యర్థులు అంద‌రూ సాధించిన ఓట్ల కంటే ఎక్కువ శాతం ఓట్లు సాధించింది. వైసీపీ అభ్యర్థుల‌కు 30 వార్డుల్లో క‌లిపి 21,536 (46.5%) ఓట్లు రాగా, రెబ‌ల్ ఫ్యానెల్‌కు 22,080 (47.7%) ఓట్లు వ‌చ్చాయి. ఇక టీడీపీ 2216 ( 4.8 % ) ఓట్లు సాధించ‌గా… బీఎస్పీ 431 ( 1 % ) ఓట్లు సాధించింది. ఈ ఓట్లే చీరాల‌లో ఆమంచి కృష్ణమోహన్ కి ఉన్న ప‌ట్టును, వ్యక్తిగ‌త ఇమేజ్‌ను ఫ్రూవ్ చేస్తున్నాయి.

రెబల్స్ గా బరిలోకి దిగి…..

గ‌త ఎన్నిక‌ల్లో ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ ఓడిపోయాక టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం ఫ్యాన్ కింద‌కు వ‌చ్చారు. అప్పటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు గ్రూపుల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. తాజా ఎన్నిక‌ల‌కు ముందే పార్టీ అధిష్టానం ఆమంచి కృష్ణమోహన్ కి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయ‌న్ను ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి పంపాల‌న్న ప్లాన్ చేసింది. అయితే త‌న‌కు ప‌ట్టున్న చీరాల‌ను వదులుకునేందుకు ఆమంచి కృష్ణమోహన్ ఏ మాత్రం ఇష్టప‌డ‌లేదు. ఇక తాజా ఎన్నిక‌ల్లో ఆమంచి ఎంత ప‌ట్టుబ‌ట్టినా జిల్లా మంత్రులు చ‌క్రం తిప్పి బీ ఫామ్‌లు అన్నీ క‌ర‌ణం వ‌ర్గానికే ఇచ్చారు. దీంతో ఆమంచి త‌న ఫ్యానెల్‌తో రెబ‌ల్స్‌ను రంగంలోకి దింప‌గా.. వారు ఏకంగా 14 వార్డుల్లో విజ‌యం సాధించి క‌ర‌ణంకే కాదు… ఆమంచిని సైడ్ చేస్తోన్న జిల్లా వైసీపీ నాయ‌క‌త్వానికే షాక్ ఇచ్చారు.

పార్టీలతో సంబంధం లేకుండా….

ఆమంచి కృష్ణమోహన్ కి చీరాల‌లో పార్టీల‌తో సంబంధం లేకుండా ప‌ట్టు ఉంది. 2014లో నాడు టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓడించి మ‌రీ ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఏదేమైనా చీరాల‌లో పార్టీ మారినా క‌ర‌ణంకు వైసీపీలో ప‌ట్టు చిక్కలేద‌న్నది తాజా ఫ‌లితాలు స్పష్టం చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఈ మున్సిపాల్టీలో వైసీపీ జెండా ఎగ‌రేసినా నిజ‌మైన విన్నర్ ఆమంచి కృష్ణమోహ‌న్ అయ్యారు. మ‌రీ ఈ ఫ‌లితాల త‌ర్వాత అయినా అధిష్టానం చీరాల ప‌గ్గాల విష‌యంలో పున‌రాలోచ‌న చేస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News