అమరావతి… అక్షయపాత్ర .. ?

మేం పెట్టుబడులు పెడతాము మీ రాజధాని ఏంటో చెప్పండి అని పారిశ్రామికవేత్తలు వైసీపీ సర్కార్ పెద్దలను అడిగినట్లుగా ఆ మధ్య ప్రచారం అయితే సాగింది. అయితే వైసీపీ [more]

Update: 2021-09-08 02:00 GMT

మేం పెట్టుబడులు పెడతాము మీ రాజధాని ఏంటో చెప్పండి అని పారిశ్రామికవేత్తలు వైసీపీ సర్కార్ పెద్దలను అడిగినట్లుగా ఆ మధ్య ప్రచారం అయితే సాగింది. అయితే వైసీపీ సర్కార్ మూడు ప్రాంతాలు, మూడు రాజధానుల కాన్సెప్ట్ వినిపించేసరికి కొందరు వెనక్కి వెళ్ళారని కూడా చెబుతారు. ఇది ఒక విధంగా గందరగోళ వ్యవహారమే. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని కాన్సెప్ట్. ఒకవేళ సక్సెస్ అయితే ఏపీ వెంటనే దేశం నడుస్తుందేమో. కానీ ఇది కొత్త విధానం కాబట్టి ఎవరైనా కొంత అయోమయానికి గురి కావడం సహజమే. ఇదిలా ఉంటే ఏపీకి రాజధాని లేకుండా చేశారు అంటూ విపక్షాలు ఇప్పటికీ గోల పెడుతూంటాయి. అసలు ఇంతకీ ఏపీకి అమరావతి రాజధాని గా ఉంటే సిరులు కురిపించే కల్పవల్లిగా మారేదా అన్నదే చర్చ.

అంత జరిగిందా..?

మేం దిగిపోయేనాటికి ఎనభై శాతం పనులు అమరావతి రాజధానికి సంబంధించి పూర్తి చేశామని తరచూ బడాయిగా టీడీపీ చెప్పుకుంటూ ఉంటుంది. కేవలం ఇరవై శాతం ఖర్చు చేస్తే చాలు అమరావతి ఏపీ మొత్తాన్ని ఈ పాటికి పోషించేది అన్నది వారు అనే మాట. కానీ అక్కడ అంత అభివృద్ధి నిజానికి జరిగిందా. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక తక్కువ మొత్తం ఖర్చుతోనే ధీటైన రాజధానిగా ఈపాటికి మారేదా అంటే అది డౌటే అని అన్న వారూ ఉన్నారు. అమరావతిలో హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ వంటివి చంద్రబాబు హయాంలో వచ్చాయి. మిగిలిన వాటిలో నవ నగరాలు అన్న భారీ బాహుబలి కాన్సెప్ట్ కాగితాల మీదనే ఉంది. కొన్ని ప్రాజెక్టులకు ఇచ్చిన స్థలాలు అలాగే ఉన్నాయి. ఇలా ఉన్న అమరావతి జగన్ ఏలుబడిలో కనిపించింది. మరో వైపు సింగపూర్ లోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలతో తో కుదుర్చుకున్న లోప భూయిష్ట ఒప్పదం కంటిన్యూ అయితే ఏపీకి దశాబ్దాల పాటు ఇక్కట్లు వచ్చేవని అన్న వారూ ఉన్నారు.

అది నిజమేనేమో…?

అయితే మూడు రాజధానులకు బదులుగా అమరావతిని ఎంతో కొంత అభివృద్ధి చేసి ఉంటే ఈపాటికి రాజధానిగా మాత్రం ఉండేది అన్నది నిజం. ఆ మీదట పెట్టుబడులు పెట్టండని అమరావతితో పాటు విశాఖను చూపించినా కూడా సర్కార్ కి ఇబ్బందులు ఉండేవి కావు. అలాగే పెట్టుబడిదారులకు పేరుకు అమరావతి రాజధానిని చూపించినా వారిని విశాఖ వైపు సులువుగా మళ్ళించవచ్చు, అలాగే కర్నూలు లోనూ పెట్టుబడులకు అడిగే వీలుండేది. ఒక కేరాఫ్ అడ్రస్ గా మాత్రం అమరావతి ఉపయోగపడేది అన్నది మాత్రం నిజం. మూడు రాజధానులు అంటూ కూర్చోవడం వల్ల అసలూ పోయే, వడ్డీ పోయే అన్నట్లుగా సీన్ తయారైంది అన్నది వాస్తవమే అంటున్నారు.

రాబడి వచ్చే రూట్…?

ఏ దేశానికైనా రాష్ట్రానికైనా రాజధానిని చూస్తేనే రాబడి వస్తుంది. అందువల్ల ఒక పర్మనెంట్ ప్లేస్ ని దానికి చూపించాలి. ఆ మీదట ఎన్ని రకాల నగరాలు అయినా నిర్మించుకోవచ్చు. నిజానికి ఏపీకి విశాఖ చాలా కలసి వచ్చే నగరం. చంద్రబాబు తొలి సీఎం గా దాన్ని వినియోగించుకోలేకపోయారు. జగన్ విషయానికి వస్తే మూడు రాజధానుల పేరిట కాలక్షేపం చేయడంతో విశాఖ ఎందుకూ కాకుండా వట్టిపోతోంది. అయితే టీడీపీ అనుకూల మీడియా రాతలు మాత్రం అమరావతి సంపదను సృష్టించేదని, దాన్ని పాడుపెట్టడం వల్లనే జగన్ సర్కార్ అప్పుల పాలు అవుతోందని విశ్లేషిస్తోంది. ఇది పాక్షిక నిజం మాత్రమే. అమరావతిని రాజధానిగా అయిదేళ్లలో బాబు చేయలేనిది జగన్ రెండేళ్ళలో చేసేది కూడా ఏమీ ఉండదు, కానీ దాన్ని రాజధానిగా చూపిస్తూ విశాఖలో ప్రగతికి బాటలు వేసుకునే తెలివిడి వైసీపీ ఏలికలకు కొరవడినందువల్లనే ఇపుడు అన్ని రకాలుగా చెడింది అన్న మాట అయితే ఉంది. దీన్ని భరించక తప్పదు కూడా.

Tags:    

Similar News