గడ…గడ..గజ…గజ.. పెద్దన్న పరేషాన్

అగ్రరాజ్యం అమెరికా గడ గడ లాడుతోంది. కరోనా వైరస్ పెద్దన్నకు చుక్కలు చూపిస్తోంది. చైనా నుంచి వచ్చిన వారితోనే కరోనా వ్యాప్తి చెందినట్లు అమెరికా గుర్తించింది. కరోనా [more]

Update: 2020-03-26 18:29 GMT

అగ్రరాజ్యం అమెరికా గడ గడ లాడుతోంది. కరోనా వైరస్ పెద్దన్నకు చుక్కలు చూపిస్తోంది. చైనా నుంచి వచ్చిన వారితోనే కరోనా వ్యాప్తి చెందినట్లు అమెరికా గుర్తించింది. కరోనా తన ఓటమికి కారణం అవుతుందేమోనన్న ఆందోళనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారంటే ఏ మేరకు భయపడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అమెరికాలో 70 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెయ్యి మందికి పైగా మరణించారు.

ఆర్థిక వ్యవస్థ…..

నిజంగా ఇది అగ్రరాజ్యానికి ఇబ్బందే. ఆర్థికంగా కూడా ఇప్పటికే వ్యవస్థ కుదేలైపోయింది. వ్యాపారాలన్నీ షట్ డౌన్ అయ్యాయి. అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ లోకి వెళ్లాయి. అభివృద్ధి చెందిన దేశంగా పేరొందిన అమెరికా కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోంది. ముఖ్యంగా వూహాన్ నగరం నుంచి ఎక్కువ మంది డిసెంబరు నెలలోనే అమెరికాకు చేరుకున్నారు. ఈ దేశం నుంచి వీకెండ్ లో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువ కావడంతో పరిస్థితి మరింత ముదిరిపోయిందంటున్నారు.

అనేక రాష్ట్రాల్లో……

ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాలు ఈ వైరస్ బారిన ఎక్కువగా పడ్డాయి. దీంతో అక్కడ హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించారు. దాదాపు పది కోట్ల మంది ప్రజలు లాక్ డౌన్ లో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మరో మూడు నెలలు కఠిన సమయం అని ట్రంప్ చెప్పారంటే పరిస్థితి అమెరికాలో ఏ విధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

ముందు జాగ్రత్త లేకనేనా?

దీంతో ట్రంప్ ఇప్పటికే రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అన్ని వర్గాల వారికీ ప్యాకేజీని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. 75 వేల డాలర్ల లోపు ఆదాయం ఉన్న వారందరికీ 1200 డాలర్లు ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ముందుగానే షట్ డౌన్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బిల్ గేట్స్ వంటి వారు కూడా తప్పుపట్టారు. చివరకు కరోనా వైరస్ పరీక్ష కిట్లు కూడా దక్షిణ కొరియా నుంచి తెప్పించుకునే స్థితికి అగ్రరాజ్యం చేరుకుంది. మొత్తం మీద కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను ముప్పుతిప్పలు పెడుతోంది.

Tags:    

Similar News