ఆయన కనుసన్నల్లో కర్నాటకం …?

క్షణక్షణం మారిపోతున్న కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందన్న సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. ఒక పక్క కాంగ్రెస్ అధిష్టానం మరో పక్క బిజెపి అధిష్టానాలకు ఈ వ్యవహారం ప్రతిష్టాత్మకం [more]

Update: 2019-07-20 17:30 GMT

క్షణక్షణం మారిపోతున్న కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందన్న సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. ఒక పక్క కాంగ్రెస్ అధిష్టానం మరో పక్క బిజెపి అధిష్టానాలకు ఈ వ్యవహారం ప్రతిష్టాత్మకం గా మారింది. గత ఏడాది విశ్వాస పరీక్షలో ఓటమి చెందిన నాటినుంచి యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ ను కూలగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ఎప్పటికప్పుడు కమలం ఎత్తుగడలను తిప్పికొడుతూ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. తాజాగా క్లైమాక్స్ కి చేరుకున్న కన్నడ రాజకీయాల్లో తమ జండా ఎగురవేసేందుకు అమిత్ షా స్వయంగా ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు శ్రేణులకు జారీచేస్తున్నట్లు హస్తినలో జోరుగా ప్రచారం సాగుతుంది.

గవర్నర్ తో టచ్ లో వుంటూ …

సంకీర్ణ కూటమి బలం తేల్చాలంటే ముందుగా స్పీకర్ ఎస్ అనాలి. పక్కా కాంగ్రెస్ వాది నిజాయితీపరుడైన స్పీకర్ రమేష్ కుమార్ బిజెపికి కొరకరాని కొయ్యగా మారారు. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు, సూచనలు సైతం పక్కన పడేసి తనకు నచ్చిన విధంగా ప్రభుత్వాన్ని కాపాడటానికి అవసరమైన సాయాన్ని స్పీకర్ అందిస్తూ వస్తున్నారు. బలపరీక్షకు కుమార స్వామి సిద్ధంగా వున్నా అని పైకి ప్రకటించినా స్పీకర్ తో వున్న అండర్ స్టాండింగ్ కారణంగానే ఆయన ఆ సవాల్ విసిరినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో సంకీర్ణం అనుసరిస్తున్న ఎత్తులు పై ఎత్తులను గవర్నర్ ఒక ప్రత్యేక అధికారిని అసెంబ్లీకి పంపి మరీ తెలుసుకుంటున్నారు. అలా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు చేరవేస్తున్నట్లు రాజభవన్ వర్గాల సమాచారం.

కాలయాపన కోసమేనా …?

మరోసారి విప్ జారీ అంశంపై సుప్రీం కోర్ట్ లో స్పష్టత కోరుతూ జెడిఎస్, కాంగ్రెస్ లు సుప్రీం కోర్ట్ తలుపు తట్టాయి. సోమవారం బలపరీక్షను స్పీకర్ నిర్వహిస్తారనుకుంటున్న దశలో మరోసారి ఈ వ్యవహారం వాయిదా దిశగా నడిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్ట్ విప్ జారీలో తీర్పు ఇచ్చిన తరువాత తమ నిర్ణయం ఉంటుందని స్పీకర్ ప్రకటించే ఛాన్స్ ఉంటుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈలోగా జారిపోయిన ఎమ్యెల్యేలను బుజ్జగించే అవకాశం దొరుకుతుందన్నది అధికారపార్టీ ఆలోచనగా టాక్ నడుస్తుంది.

ఆ నలుగురు కోసం ….

ప్రస్తుతం 100 వున్న సంకీర్ణ సర్కార్ కి మరో ఐదుగురు ఎమ్యెల్యేలు అవసరం. తిరుగుబాటు చేసిన ఎమ్యెల్యేల్లో రామలింగారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆయన శిష్యులు గా వున్న నలుగురు ఎమ్యెల్యేలను ఎలాగైనా తమ శిబిరానికి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. వారు వస్తే మరొకర్ని ఎలాగోలా తెచ్చుకుంటే గండం గట్టెక్కిస్తామన్న లెక్క కూటమిది. అది జరక్కుండా నే బలపరీక్ష పూర్తి అవ్వాలని బిజెపి వ్యూహాలు పన్నుతోంది. మరి ఈ సమరంలో ఎవరిది పై చెయ్యి అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News