“షా” స్ట్రాటజీ పనిచేస్తే

జమ్ము కాశ్మీర్. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ వాటి పేర్లు చాలా మందికి తెలియవు. కానీ కాశ్మీర్ పేరు తెలియని వారుండటరంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణాలు [more]

Update: 2019-07-09 18:29 GMT

జమ్ము కాశ్మీర్. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ వాటి పేర్లు చాలా మందికి తెలియవు. కానీ కాశ్మీర్ పేరు తెలియని వారుండటరంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇది పాక్ సరిహద్దులోని కీలక రాష్ట్రం. సంక్షుభిత రాష్ట్రం. ఇక్కడ చోటు చేసుకునే ఘటనలు, పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వాలకు కాశ్మీర్ కొరకరాని కొయ్యగా మారింది. నాటి యూపీఏ, నేటి ఎన్డీఏ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు చేపట్టడం తప్ప సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. తాజాగా రాష్ట్రంలో మరోసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఇది ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. జులై మూడు నుంచి అమలు అయింది. కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించినన్ని సార్లు మరే ఇతర రాష్ట్రాల్లోనూ విధించలేదు.

ఇప్పటి వరకూ ఎన్నిసార్లంటే…

ఇప్పటి వరకూ మొత్తం 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కాంగ్రెస్ హయాంలో 93 సార్లు, జనతా పార్టీ హయాంలో 20సార్లు, భారతీయ జనతా పార్టీ హయాంలో 16 సార్లు, జనతాదళ్ హయాంలో మూడు సార్లు కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి సజావుగా లేనందున రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చలేం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగిన అనంత్ నాగ్ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరపాల్సి వచ్చింది. దీనిని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పేరుతో తరచూ రాష్ట్రపతి పాలన పొడిగించడం సమంజసం కాదు. ఎన్నికైన ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటే పరిస్థితి ఒకింత మెరుగ్గా ఉంటుందనడంలో సందేహం లేదు.

పొడిగించడం ద్వారా…..

రాష్ట్రపతి పాలనను మరో ఆరునెలల పాటు పొడిగించడం ద్వారా ఎన్నికలకు సిద్ధమవ్వాలన్ననది కమలనాధుల యోచన. ఈ దిశగా వేగంగా అడుగులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇటీవల హోంమంత్రి అమిత్ షా ఇటీవల కాశ్మీర్ సందర్శించారు. పైకి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లానని చెబుతున్నప్పటికీ అసలు ఉద్దేశ్యం మాత్రం ఎన్నికలపై సమీక్ష కోసమే. ముస్లిమేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు అమిత్ షా వ్యూహరచన చేశారు. పాక్ తో గల అంతర్జాతీయ సరిహద్దుల్లో నివసిస్తున్న వారికి రిజర్వేషన్ కల్పించే సవరణ చట్టబిల్లును ఇటీవల లోక్ సభ ఆమోదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజా బిల్లు వల్ల అంతర్జాతీయ సరిహద్దు అయిన నియంత్రణ రేఖ ప్రాంతంలో నివసిస్తున్న వారికి మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. తద్వారా ఓటు బ్యాంకును విస్తృతం చేసుకోవాలన్నది కమలనాధుల యోచన. తాజాగా అమిత్ షా పర్యటనలో వివిధ సామాజిక వర్గాలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా కాశ్మీర్ లోని ఒకర్వాలాల్, గుజ్జర్, పహాడీ తదితర బలహీన వర్గాల ప్రతినిధులతో సమావేశమయి చర్చించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే ఈ సమావేశం జరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రెండు వ్యూహాలతో….

కాశ్మీర్, జమ్మూ, లడఖ్ ప్రాంతాలుగా రాష్ట్రం విస్తరించి ఉంది. ఇందులో కాశ్మీర్ లోయలోని అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా ముస్లిం పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ లు అధికారాన్ని కైవసం చేసుకుంటున్నాయి. కాశ్మీర్ లోయలో బీజేపీ, కాంగ్రెస్ ప్రాతినిధ్యం నామమాత్రమే. ఈ రెండు జాతీయ పార్టీలు ఇప్పటి వరకూ హిందువుల ప్రాబల్యం గల జమ్మూ, బౌద్ధుల ప్రాబల్యం గల లడఖ్ పైనే దృష్టి పెడుతున్నాయి. ఈసారి బీజేపీ వ్యూహం భిన్నంగా ఉండబోతోంది. జమ్మూ, లడఖ్ లలో కాంగ్రెస్ ను దెబ్బతీసి, మెజారిటీ సీట్లను గెలుచుకోవాలన్నది ఒక వ్యూహం. అదే సమయంలో ముస్లిమేతర వర్గాల ఓట్లతో కాశ్మీర్ లోయలో ఖాతా తెరవాలన్నది రెండో వ్యూహం. గత ఎన్నికల్లో మొదటి వ్యూహంతో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి జమ్మూ, లడఖ్ లలో పట్టు కాపాడుకుంటూనే కాశ్మీర్ లోయలో కొన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. తద్వారా అధికారానికి చేరువ కావచ్చన్నది కమలం పార్టీ అంచనా. ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరిస్తే అధికార పీఠాన్ని గవర్నర్ సాయంతో అధిష్టించవచ్చన్నది ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News