ఒకడగు వెనక్కు వేశారు

మహారాష్ట్రలో మహా రాజకీయం ముగిసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఇక శివసేన కూటమికి అధికారం దక్కినట్లే. అయితే ఇది [more]

Update: 2019-11-26 16:30 GMT

మహారాష్ట్రలో మహా రాజకీయం ముగిసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఇక శివసేన కూటమికి అధికారం దక్కినట్లే. అయితే ఇది మరాఠా రాజకీయాలకు ఎండ్ కార్డ్ కాదని, ఇంటర్వెల్ మాత్రమేనని అంటున్నారు విశ్లేషకులు. అమిత్ షా తాను అనుకున్నది చేసే వరకూ నిద్రపోరు. తన మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకూ విశ్రమించరు. అలాంటిది 105 స్థానాలు సాధించిన అతి పెద్ద పార్టీగా అవతరించినా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు పదవిని తన్నుకు పోయిందన్న కసితో బీజేపీ ఉంది.

ఢిల్లీ నుంచే వ్యూహాలు….

ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేతలు కూడా అమిత్ షా వైపు చూస్తున్నారు. ఢిల్లీ నుంచే అమిత్ షా దేవేంద్ర ఫడ్నవిస్ కు దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో యడ్యూరప్ప తరహా అవమానం ఎదురుకాకూడదని గట్టిగా చెబుతున్నారు. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా అమిత్ షా నూరిపోశారు. ప్రధాని మోదీతో అమిత్ షా భేటీ అయ్యారు. మహారాష్ట్ర రాజకీయాలపైనే చర్చించారు. చివరకు తగిన బలం లేదని తేలిపోవడంతో ముందుగానే రాజీనామా చేయడం మంచిదని నిర్ణయానికి వచ్చారు.

అంత సులువు కాదని….

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ బలాన్ని నిరూపించుకోవడం అంత సులువు కాదని అమిత్ షాకు తెలియంది కాదు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాయి. నిజానికి ఈ నెలాఖరు వరకూ బలనిరూపణకు గవర్నర్ గడువు ఇచ్చినా కూటమి నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారు. కేవలం గంటల వ్యవధిలోనే బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు కూటమి పార్టీలు బలప్రదర్శన కూడా నిర్వహించి బీజేపీని నిరోధించేందుకు ఒక ట్రయల్ వేసింది. దీంతో ఇక ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమవైపు రారని దాదాపు అర్థమయింది. అంతేకాకుండా అజిత్ పవార్ వెంట కూడా ఒక్క ఎమ్మెల్యే లేకుండా పోవడంతో ఇక బలపరీక్ష అనవసరమన్న నిర్ణయానికి వచ్చి ముందుగానే రాజీనామా చేశారు.

కర్ణాటక తరహాలోనే….

ఎక్కువ స్థానాలు సాధించినా అధికారం దక్కకపోవడానికి శివసేన కొర్రీలే కారణం. శివసేన తమను దారుణంగా వంచించిందని బీజేపీ గట్టిగా భావిస్తుంది. అందుకే వేచి చూసే ధోరణిని అవలంబించాలని భావించింది. కర్ణాటకలో 14 నెలల తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు భిన్న వైఖరులు ఉన్న పార్టీలు కావడంతో ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్నది బీజేపీ విశ్వాసం. అందుకే వెయిట్ చేసి దెబ్బకొట్టాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. ప్రజల్లోకూడా కొంత పార్టీ డ్యామేజీ కావడంతో తాను సరిదిద్దుకునే ప్రయత్నంలోనే బలపరీక్షకు ముందుగానే వెనక్కు తగ్గారు.

Tags:    

Similar News