ఆనంకు ఆసక్తి లేదా? అందుకనే అలా?

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి త‌న‌కు ఇష్టమున్న నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాకుండా.. క‌ష్టమే అయినా పోటీ చేసి ఇదే జిల్లాలోని [more]

Update: 2020-05-25 08:00 GMT

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి త‌న‌కు ఇష్టమున్న నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాకుండా.. క‌ష్టమే అయినా పోటీ చేసి ఇదే జిల్లాలోని వెంక‌ట‌గిరి నుంచి విజ‌యం సాధించారు. నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు అంటేనే ఆనంకు ఓ ల‌క్కు. ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడు కురుగొండ్ల రామ‌కృష్ణ 2009, 2014లో వ‌రుస విజ‌యాలు సాధించారు. ఈ క్రమంలోనే బ‌ల‌మైన టీడీపీ కేడ‌ర్‌ను ఏర్పాటు చేసుకున్నారు స్థానికంగా కూడా కురుగొండ్లకు తిరుగులేని బ‌లం ఉంద‌నేది వాస్తవం. 2009లో కాంగ్రెస్ గాలిలోనే కురుగొండ్ల నేదురుమిల్లి రాజ్యల‌క్ష్మిని ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు. అయితే, గ‌త ఏడాది మాత్రం జ‌గ‌న్ సునామీ ప్రభావంతో కురుగొండ్ల ఓడి.. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి విజ‌యం సాధించారు.

ఆత్మకూరు నుంచి మారి….

దాదాపు 37 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి విజ‌యం సాధించారు. వాస్తవానికి ఆనంకు ఇక్కడ పోటీ చేయ‌డం అస్సలు ఇష్టం లేదు. ఆయ‌న‌కు పాత రాపూరుతో పాటు ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి ప‌ట్టు ఉంది. అయితే అక్కడ మేక‌పాటి గౌతంరెడ్డి తిష్టవేసి ఉండ‌డంతో చివ‌ర‌కు ఆనం అయిష్టంగానే వెంక‌ట‌గిరిలో పోటీ చేశారు. ఆయ‌న గెలిచి ఏడాది పూర్తయినా.. ఇప్పటి వ‌ర‌కు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి ప‌థ‌క‌మూ ప్రారంభం కాలేదు. గ‌తంలో కురుగొండ్ల ప్రారంభించిన కార్యక్రమాలే ప్రజ‌ల‌కు గ‌త‌య్యాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి గెలిచిన త‌ర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ ప‌ని జ‌ర‌గ‌లేద‌ని ప్రజ‌లు చెప్పుకొంటున్నారు.

సీనియర్ అయినా…..

అంతేకాదు, నియోజ‌క‌వ‌ర్గం వ‌దిలేసి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి నెల్లూరు సిటీలోనే ఎక్కువ‌గా ఉంటున్నార‌ని, ఆయ‌న‌ను క‌లిసి త‌మ స‌మ‌స్యను చెప్పుకొనేందుకు కూడా కుద‌ర‌డం లేద‌ని మెజారిటీ ప్రజ‌ల నుంచి వినిపిస్తోంది. త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌నే కోపం ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిలో ఉంద‌ని అంటున్నారు. ఇక రాజ‌కీయాల్లో సీనియ‌ర్ అయిన త‌న‌ను జ‌గ‌న్‌తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న అసంతృప్తి ఆయ‌న‌లో ఉంది. ఇక రేపో మాపో మంత్రి వ‌ర్గ విస్తర‌ణ జ‌రిగినా ఆనంను జ‌గ‌న్ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఇప్పటికే జిల్లాకే చెందిన మంత్రుల‌పై ప‌రోక్షంగా చేసిన విమ‌ర్శల‌కు ఆయ‌న షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చుకున్నార‌న్న టాక్ కూడా ఉంది.

టీడీపీ యాక్టివ్ గా….

అందుకే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోకుండా అనాస‌క్తత‌తో ఉంటున్నార‌ట‌. ఇక‌, టీడీపీ నుంచి ఓడిపోయిన రామ‌కృష్ణ మాత్రం ప్రజ‌ల్లోనే ఉంటున్నారు. ఇటీవ‌ల లాక్‌డౌన్‌కు ముందు కూడా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేర‌కు అన్న క్యాంటీన్ల కోసం జ‌రిగిన ఉద్యమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఇక నెల్లూరు జిల్లాలో టీడీపీ ప‌రంగా ఏదో ఒక యాక్టివిటీ ఎప్పుడూ ఉండేది ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే కావ‌డం విశేషం. మ‌రోప‌క్క త‌మ స‌మ‌స్యలు చెప్పుకొనేందుకు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అవ‌కాశం ఇవ్వక పోతే.. ఓడిపోయిన రామ‌కృష్ణ త‌మ‌కు చేరువ కావ‌డంతో ఆనంను అన‌వ‌స‌రంగా గెలిపించామే. అని ప్రజ‌లు అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఇక్కడ చ‌ర్చ సాగుతున్నాయి. మ‌రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఈ విష‌యంలో ఒకింత మేల్కొంటేనే బెట‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే ఆనం మాత్రం రాజ‌కీయ నిరాస‌క్తతోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News