ఆనం` ఫ్యామిలీ పాలిటిక్స్ మార‌తాయా..?

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. కాంగ్రెస్‌తో ప్రారంభ‌మైన ఆనం కుటుంబ రాజ‌కీయం.. అన్నద‌మ్ములుగా ఒక‌ద‌శ‌లో ఆనం వివేకానంద‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిలు [more]

Update: 2021-03-22 15:30 GMT

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. కాంగ్రెస్‌తో ప్రారంభ‌మైన ఆనం కుటుంబ రాజ‌కీయం.. అన్నద‌మ్ములుగా ఒక‌ద‌శ‌లో ఆనం వివేకానంద‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిలు ప‌రుగులు పెట్టించారు. మ‌రీ ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. దాదాపు ప‌దేళ్లపాటు జిల్లాలో అన్నద‌మ్ములు చ‌క్రం తిప్పారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర విభ‌‌జ‌న ఎఫెక్ట్‌తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. త‌ర్వాత కాలంలో వైసీపీ నుంచి ఆహ్వానాలు అందినా స్పందించ‌లేదు. ఈ క్రమంలోనే అనూహ్యంగా టీడీపీ బాట ప‌ట్టారు. ఆ త‌ర్వాత వివేకా మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

ఎమ్మెల్యేగా ఉన్నా…..

ఇక‌, టీడీపీలో దాదాపు నాలుగేళ్లు ఉన్నప్పటికీ.. ప్రాధాన్యం ద‌క్కక‌పోవ‌డం.. క‌నీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వక‌పోవ‌డం వంటి కారణాల నేప‌థ్యంలో.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి.. పార్టీ మారి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆత్మ‌కూరు టికెట్ కోరినా.. జ‌గ‌న్ ఆయ‌న‌కు వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం కేటాయించారు. జ‌గ‌న్ సునామీతో గెలుపు గుర్రం ఎక్కిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి త‌ర్వాత కాలంలో మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆశించినా.. రాలేదు. ఇక‌, అప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆయ‌న అసంతృప్తితోనే కాలం గ‌డుపుతున్నారు. ఇప్పుడు వైసీపీ వ్యూహం మారిన‌ట్టు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి సూచ‌న‌లు అందుతున్నాయి.

వచ్చే ఎన్నికల నాటికి….

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆనంకు ఖ‌చ్చితంగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వర‌నే అంటున్నారు. ఆ సీటును మాజీ ముఖ్యమంత్రి నేదురుమ‌ల్లి జ‌నార్థన్ రెడ్డి త‌న‌యుడు రామ్‌కుమార్ రెడ్డికి ఇస్తార‌ని అంటున్నారు. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి పార్టీలో కంటిన్యూ అయితే ఆయ‌న‌ను నెల్లూరు నుంచి ఎంపీగా పంపాల‌ని అధినేత జ‌గ‌న్ భావిస్తున్నట్టు స‌మాచారం. ప్రస్తుతం ఆదాల ప్రభాక‌ర్‌రెడ్డి వ‌య‌స్సు పై బ‌డ‌డంతో ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఆయ‌న‌ను త‌ప్పించి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఎంపీగా పంపాల‌ని అంటున్నట్టు స‌మాచారం. ఈ మ్యాట‌ర్ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అధికార పార్టీలో బ‌లంగా వినిపిస్తుండ‌డంతో …రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న త‌న‌కు ప్రాధాన్యం లేన‌ప్పుడు రేపు ఎంపీగా వెళ్తే.. మ‌రింత‌గా డ్యామేజీ అవుతుంద‌ని ఆనం వ‌ర్గం అప్పుడే ఆలోచ‌న‌లో ప‌డిపోయింది.

టీడీపీలోకి వస్తే….?

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం నెల్లూరులో ఆప‌శోపాలు ప‌డుతున్న ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ.. బ‌లంగా ఉన్న ఆనం వ‌ర్గాన్ని మ‌ళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయ‌త్నాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా దివంగ‌త వివేకా కుమారుడికి ఆహ్వానం ప‌ల‌కాల‌ని.. పార్టీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నట్టు స‌మాచారం. ఆయ‌న వ‌స్తే.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటును ఆఫ‌ర్ చేయ‌డంతోపాటు.. పార్టీలోనూ మంచి గుర్తింపు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్న ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కూడా వ‌స్తే..ఆయ‌న‌కు క‌ల‌గా మిగిలిన ఆత్మకూరు టికెట్ ఇచ్చేందుకు కూడా బాబు వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్నార‌ని స‌మాచారం. అయితే.. ప్రస్తుతం దీనిపై ఇటు చంద్రబాబు కానీ.. అటు ఆనం వ‌ర్గం కానీ.. ఎక్కడా బ‌య‌ట‌కు చెప్పడం లేదు. కానీ.. రాజ‌కీయంగా మాత్రం త్వర‌లోనే మార్పులు ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News