ఆనంను వదిలించుకోవాలనేనా?

సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి ఉపయోగపడరని భావించినట్లుంది. అందుకే ఆయనను దూరంపెట్టడమే మేలని భావించినట్లుంది. ఆనం రామనారాయణరెడ్డి గత కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. [more]

Update: 2020-12-09 14:30 GMT

సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి ఉపయోగపడరని భావించినట్లుంది. అందుకే ఆయనను దూరంపెట్టడమే మేలని భావించినట్లుంది. ఆనం రామనారాయణరెడ్డి గత కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. నెల్లూరుజిల్లాలో జరగుతున్న రాజకీయ పరిణామాలను జగన్ పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఉన్నారు. కనీసం మాజీ మంత్రినయిన తనను తన నియోజకవర్గలో అధికారులే లెక్క చేయకపోవడంపై అనేక సార్లు అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది.

దూరంగా ఉంటూ…..

దీంతో ఆనం రామనారాయణరెడ్డి గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. పార్టీ ఇటీవల కాలంలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు ఆనం రామనారాయణరెడ్డి వెళ్లకుండా ఆయన అనుచరులతో మమ అనిపించేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో తనకు ప్రత్యామ్నాయంగా మరో నేతను ప్రోత్సహిస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి అనుమానం. అందుకే ఆయన నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో…..

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కీలక అంశాలపై కూడా ఆనం రామనారాయణరెడ్డి స్పందించకపోవడం విశేషం. సాధారణంగా కీలక అంశాలపై ఆనం రామనారాయణరెడ్డి స్పందిస్తారు. పార్టీ కూడా ఆయన చేత కౌంటర్ ఇప్పిస్తుంటుంది. ఈ సమావేశాల్లో మాత్రం పార్టీ కూడా ఆనం రామనారాయణరెడ్డిని దూరంపెట్టినట్లే కన్పిస్తుంది. ఆయనకు ఏ అంశంలోనూ అవకాశం ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

జగన్ పిలిచినప్పుడే…..

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో తన అవసరం పార్టీకి ఉంటుందని ఆనం రామనారాయణరెడ్డి భావిస్తున్నారు. జగన్ పిలిచినప్పుడే తాను వెళ్లి అన్ని విషయాలను మాట్లాడవచ్చని అనుకుంటున్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల పార్టీ పంచాయతీలను వెంటనే తేల్చేసిన జగన్ నెల్లూరు విష‍యంలో ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆనం రామనారాయణరెడ్డిలో ఉంది. మొత్తం మీద ఇటు ఆనం పార్టీకి దూరంగా ఉంటుండగా, పార్టీ కూడా ఆయనను పక్కన పెట్టేసినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News