ఈసారి అనంత‌దేనా..?

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ హ‌వా వీచిన అనంత‌పురం జిల్లాపై ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. అనంత‌పురంలో ఈసారి మెజారిటీ స్థానాలు గెలుచుకొని [more]

Update: 2019-04-20 02:30 GMT

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ హ‌వా వీచిన అనంత‌పురం జిల్లాపై ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. అనంత‌పురంలో ఈసారి మెజారిటీ స్థానాలు గెలుచుకొని తెలుగుదేశం పార్టీపై ఆధిప‌త్యం చూపాల‌ని వైసీపీ భావిస్తోంది. ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి క‌చ్చితంగా వ‌స్తాయ‌ని ఆ పార్టీ నేత‌లు లెక్క‌గ‌ట్టుకుంటున్న స్థానాల్లో అనంత‌పురం అర్బ‌న్ ఒక‌టి. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన వైసీపీ ఈసారైనా విజ‌యం సాధిస్తామ‌ని న‌మ్మ‌కంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసిన సీనియ‌ర్ నేత అనంత వెంక‌ట్రామిరెడ్డి ఈసారి వైసీపీ త‌ర‌పున అనంపురం అర్బ‌న్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి పోటీ చేయ‌గా జ‌న‌సేన పార్టీ నుంచి టీసీ వ‌రుణ్ పోటీ పోటీ చేశారు.

వైసీపీకి పెరిగిన బ‌లం…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భ‌వం త‌ర్వాత 2012లో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో ఇక్క‌డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గురునాథ్ రెడ్డి 20 వేల‌కు పైగా మెజారిటీతో విజ‌యం సాధించారు. కానీ, రెండేళ్ల‌కే వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో గురునాథ్ రెడ్డిపై సుమారు 10 వేల ఓట్ల మెజారిటీతో ప్ర‌భాక‌ర్ చౌద‌రి విజ‌యం సాధించారు. త‌ర్వాత గురునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. దీంతో అనంత‌పురం అర్బ‌న్ బాధ్య‌త‌లు అనంత వెంక‌ట్రామిరెడ్డి తీసుకొని ప‌నిచేసుకుంటున్నారు. సీనియ‌ర్ నేత‌గా గుర్తింపు ఉండ‌టం, అంత‌కుముందు ఆయ‌న ఎంపీగా ఉండ‌టం క‌లిసొచ్చింది. టీడీపీలోకి వెళ్లిన గురునాథ్ రెడ్డి మ‌ళ్లీ వైసీపీలో చేర‌డం, వారి కుటుంబానికి ఇక్క‌డ బ‌లం ఉండ‌టం వైసీపీకి ప్ల‌స్ అయ్యింది. నియోజ‌క‌వ‌ర్గంలో బీసీలు, ముస్లింలు గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉన్నారు. అనంత‌పురం ఎంపీ స్థానాన్ని బీసీకి ఇవ్వ‌డం వ‌ల్ల వారు ఈసారి వైసీపీ వైపు ఎక్కువ‌గా మొగ్గు చూపార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ముస్లింలు సైతం ఎక్కువ‌గా వైసీపీ వైపే నిలిచార‌ని ఆ పార్టీ నేత‌లు అంచ‌నా వేసుకుంటున్నారు.

తెలుగుదేశంలో విభేదాలు…

ఇక‌, తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి ప్ర‌భాక‌ర్ చౌద‌రికి వ్య‌క్తిగ‌తంగా ఉన్న ఇమేజ్ బాగానే క‌లిసొచ్చింది. గ‌తంలో మున్సిప‌ల్ చైర్మ‌న్ గా కూడా ప‌నిచేసిన ఆయ‌న‌కు ప్ర‌జ‌ల‌తో మంచి సంబంధాలు ఉండ‌టం ప్ల‌స్ అయ్యింది. అధికార పార్టీ ఎమ్మ‌ల్యేగా ఉండ‌టం వ‌ల్ల అభివృద్ధి చేయ‌గ‌లిగినా దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు మాత్రం తీర‌క‌పోవ‌డం ప్ర‌భాక‌ర్ చౌద‌రికి కొంత మైన‌స్ అయ్యింది. ఇక‌, తెలుగుదేశం పార్టీలో విభేదాలు కూడా ప్ర‌భాక‌ర్ చౌద‌రికి న‌ష్టం చేసింద‌ని అంటున్నారు. టీడీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసిన జేసీ ప‌వ‌న్ రెడ్డితో ప్ర‌భాక‌ర్ చౌద‌రికి స‌ఖ్య‌త లేదు. దీంతో క్రాస్ ఓటింగ్ కూడా జ‌రిగింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. మొత్తానికి అనంత‌పురం అర్బ‌న్ లో వైసీపీ గ‌త ఎన్నిక‌ల కంటే పుంజుకున్నా క‌చ్చితంగా గెలుస్తుంద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీతోనే గెల‌వ‌వ‌చ్చు.

Tags:    

Similar News