నాగ్. ఆర్ కే… నగు‘పాట్లు’

ఆంధ్రజ్యోతి అధినేత ఆర్ కే, రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ కొత్త వివాదానికి తెర తీశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ రఘురామకృష్ణరాజుల ఉదంతాలు కొంతకాలంగా [more]

Update: 2021-05-25 08:00 GMT

ఆంధ్రజ్యోతి అధినేత ఆర్ కే, రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ కొత్త వివాదానికి తెర తీశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ రఘురామకృష్ణరాజుల ఉదంతాలు కొంతకాలంగా రాజకీయాలను వేడెక్కించిన విషయం తెలిసిందే. అదే వివాదాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ మేదావులుగా గుర్తింపు పొందిన వీరిద్దరూ రచ్చ కెక్కారు. ఆంధ్రజ్యోతి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గోరంతలు కొందంతలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తుంటుంది. అదే సమయంలో ఆ పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవాలు ఎంతవరకూ ఉన్నాయనే విషయాన్ని వదిలేసి పచ్చ మీడియాగా ముద్ర వేసి పక్కన పెట్టేస్తుంది ప్రభుత్వం. ఇవి రెండూ బిన్నమైన ద్రువాలు. పరస్పర శత్రుత్వ వైఖరులు. మధ్యలో నాగేశ్వర్ వంటివారు అటు ఇటుగా తన వ్యాఖ్యానాన్ని సందర్భోచితంగా చేస్తుంటారు. రఘురామ కృష్ణ రాజుకు వ్యతిరేకంగా ఆయన పై షరతులు విధిస్తూ సుప్రీం కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీనిపై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్య రాధాకృష్ణకు నచ్చలేదు. దాంతో కొత్త పలుకులో నాగేశ్వర్ పై ఘాటైన రాజకీయ విమర్శ చేశారు. తటస్థ మేదావిగా చెప్పుకునే నాగేశ్వర్ జగన్ మోహన్ రెడ్డికి తందానా అంటున్నారనే రీతిలో ఆరోపణలు గుప్పించారు. ఇది ఇప్పుడు తెలుగు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కొరివితో గొడవ లేల..?

నాగేశ్వర్ తటస్థ వాది కాదు, స్వతంత్ర వాదిగా తనను తాను అభివర్ణించుకుంటారు. కానీ బీజేపీ ప్రస్తావన, నరేంద్రమోడీ విషయం వచ్చేటప్పటికి తన కమ్యూనిస్టు భావజాలాన్ని రంగరిస్తుంటారు. మోడీ, బీజేపీ పాలనపై ఘాటుగానే విమర్శిష్తుంటారు. విశ్లేషణల్లో బావజాలం చొరబడకుండా ఉండటం అసాధ్యం. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొచ్చేసరికి స్వతంత్ర వైఖరిని అవలంబించేందుకే ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ ఉన్న రాజకీయ ప్రాధాన్యాలు , ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని తన విశ్లేషణలను సాధ్యమైనంతవరకూ ఎవరూ తప్పుపట్టకుండా చూసుకుంటుంటారు. ఎంపీ రఘురామకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ షరతులు పెట్టడం వల్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది సాధించిందని నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. దానిపై ఆర్ కే తన వారాంతపు వ్యాఖ్య కొత్తపలుకులో తప్పుపట్టడమే వివాదానికి దారి తీసింది. అంతా ఆంధ్రజ్యోతి తరహాలో వ్యాఖ్యలు చేయాలంటే కుదురుతుందా? అన్ని కలాలు, గళాలు తన మాటనే రాయాలి, పలకాలంటే అంతకుమించిన భావదారిద్ర్యం ఉండదని నాగేశ్వర్ కుండబద్దలు కొట్టారు.

నిమ్మ కాయ పులుపు నిజమే కదా…

పచ్చని నిమ్మ పుల్లగా ఉంటుందని ఎవరికీ చె్ప్పాల్సిన పని లేదు. చూడగానే దాని లక్సణం తెలిసిపోతుందంటూ నాగేశ్వర్ వ్యాఖ్యానించడం ఆర్ కే కు చెంపపెట్టులాంటిదే. ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి అనుకూల పత్రిక అన్న భావనను ఖండిస్తూ ఆర్ కే చేసిన వాదనకు నాగేశ్వర్ ఇచ్చిన వివరణ అది. జ్యోతి లో వస్తున్న వార్తలు , విశ్లేషణలు చూసిన పాఠకులకు ఎవరికైనా అర్థం అయిపోతుంది. అది ఎవరికి అనుకూలమో, ఎవరికి ప్రతికూలమో అన్న అంశం. టీడీపీ పసుపు పచ్చ ను గుర్తు చేసేలా ఆర్ కే పత్రికను నిమ్మకాయతో పోలుస్తూ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్య సూటిగా ఎక్కు పెట్టిన అస్త్రమే. ఏదేమైనా ఏబీఎన్ వేదిక నుంచి పాల్గొనే చర్చల్లో నాగేశ్వర్ కు విస్త్రుతమైన వ్యూయర్ షిప్ ఉంటుంది. అది ఆయన పాప్యులారిటీకి, అదే సమయంలో ఏబీఎన్ టీఆర్ పీకి నాగేశ్వర్ తోడ్పడుతుంటారు. ఇది ఉభయతారకంగా ఉంటూ వస్తోంది. గిల్లికజ్జాలతో ఇప్పుడు ఇద్దరూ ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నట్లే.

నాగేశ్వర్ రాజకీయ అజెండా…

ప్రొఫెషర్ నాగేశ్వర్ రాజకీయ అజెండాపై ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్తే తన ఓటమికి ప్రదానకారణమనేది ఆయన విశ్వాసం. గెలిచిన టీఆర్ఎస్ ను టార్గెట్ చేయకుండా ఓడిన బీజేపీనే ఆయన దుమ్మెత్తి పోశారు. నిజానికి ఆ ఎన్నికలో టీఆర్ఎస్ ను ప్రధాన ప్రత్యర్థిగా ఎవరూ చూడలేదు. అటు నాగేశ్వర్, ఇటు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఇద్దరూ ఒకరినొకరు ఓడించుకున్నారు. టీఆర్ఎస్ ను విజయతీరాలకు చేర్చారు. అన్ని విషయాల్లోనూ సూటిగా ఉండే నాగేశ్వర్ బీజేపీ విషయంలో మాత్రం పక్ఫపాత వైఖరిని తీసుకుంటారనేది ఆ పార్టీ వాదన. రెండు తెలుగు రాస్ట్రాల్లో ప్రభుత్వాలపై విమర్శల ధాటిని తగ్గించడాన్నీ ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. ఏదేమైనా అడ్డగోలుగా చీలిపోయి పార్టీల వారీ పంచుకున్న తెలుగు మీడియాలో నాగేశ్వర్ వంటి వారి అభిప్రాయానికి చాలా మంది విలువ నిస్తారు. ప్రతిపక్సాలు, మీడియా విఫలమవుతున్న చోట మరింత నిక్కచ్చిగా ఇటువంటి స్వతంత్రులు తమ పాత్రను పోషించాల్సి ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News