సర్దుకుంటున్న అగ్ర నేతలు
నాయకులు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతకాలం ఎక్కడో ఒక చోట కాలక్షేపం చేసిన నేతలు గెలుపు పార్టీల వైపు జంప్ చేసేస్తున్నారు. సీటు హామీ తో ప్రధాన [more]
నాయకులు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతకాలం ఎక్కడో ఒక చోట కాలక్షేపం చేసిన నేతలు గెలుపు పార్టీల వైపు జంప్ చేసేస్తున్నారు. సీటు హామీ తో ప్రధాన [more]
నాయకులు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతకాలం ఎక్కడో ఒక చోట కాలక్షేపం చేసిన నేతలు గెలుపు పార్టీల వైపు జంప్ చేసేస్తున్నారు. సీటు హామీ తో ప్రధాన పార్టీలవైపు తొంగి చూస్తున్నారు. తమ బలాన్ని బట్టి ఫలానా సీటు ఇస్తారా? వచ్చేస్తామంటూ మంతనాలు సాగిస్తున్నారు. ఆయా పార్టీల మధ్యవర్తులు, తమ శ్రేయోభిలాషులతో మాట్లాడుకుని అగ్రనేతలతో భేటీలకు సిద్ధమవుతున్నారు. ఖాళీగా ఉండటం ఇష్టపడని ముఖ్యనేతలు నాలుగేళ్లుగా రాజకీయ కార్యకలాపాలకు ఏదో ఒకపార్టీ చాలనే ధ్యాసతో గడిపేశారు. వీరిలో ఎక్కువ మందికి బీజేపీ ఒక ప్లాట్ ఫారంగా ఉపయోగపడింది. భవిష్యత్తులో అధికారపక్షంలో లేకపోతే తమ పనులు కావన్న వాస్తవం వారికి తెలుసు. దాంతో రానున్న ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని అద్రుష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అధికారంలోకి వస్తుందని భావిస్తున్న పార్టీలకు, ప్రజామద్దతు బలంగా ఉన్న పార్టీలకు ఈ పరిణామం బాగా లాభిస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన ప్రధాన లబ్ధిదారులుగా మారుతున్నాయి. పొలిటికల్ పోలరైజేషన్ వేగంగా సాగుతోంది.
కమలం వెల వెల…
భారతీయ జనతాపార్టీ తెలుగుదేశానికి మిత్రపక్షంగా ఉండటంతో నిన్నామొన్నటివరకూ అధికారంలో భాగస్వామిగా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెసు తో విభేదించిన ఆపార్టీ నాయకులు చాలామంది టీడీపీతో చేయి కలిపారు. టీడీపీని, చంద్రబాబునాయుడిని ఇష్టపడని కొంతమంది అగ్రనాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి వంటి కేంద్రమాజీ మంత్రులూ ఇందులో ఉన్నారు. వీరికి తగిన ప్రాధాన్యం అధిష్ఠానం కల్పించలేకపోయింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడితో బీజేపీ సత్సంబంధాలు కొనసాగినంతకాలం అగ్రనాయకత్వం వీరిని పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ, బీజేపీ సంబంధాలు తెగిపోయిన తర్వాతనైనా కేంద్రస్థాయిలో పదవులు ఇచ్చి ప్రాముఖ్యం కల్పిస్తారని ఆశించారు. కానీ వివిధ రకాల ఒత్తిడుల మధ్య బీజేపీ ఆ పని చేయలేదు. పోనీ పునర్విభజన చట్టం హామీలను అమలు చేసినా వారు ప్రజల్లో చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. అది కూడా చేయకపోవడంతో కమలం నాయకులు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. భవిష్యత్తు బాగుండాలనుకునేవారు ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు. ఒకవైపు నరేంద్రమోడీ, అమిత్ షాలు ప్రత్యేక ద్రుష్టి పెట్టి ఏపీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు మొదలు పెట్టారు. సమీక్షల్లో కేంద్ర పథకాలను చెప్పడం మినహా ఏపీకి ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు. దీంతో నాయకుల నిష్క్రమణ కొనసాగుతోంది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, మరో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ కేంద్రమంత్రుల వంటి పెద్ద నాయకులు వైసీపీ, జనసేనల వైపు క్యూ కడుతున్నారు. పార్టీలోని నిరాశావహ పరిస్థితికి ఇది దర్పణం పడుతోంది.
బాబు సక్సెస్…
బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా బద్నాం చేయడంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి అన్ని విషయాల్లోనూ కేంద్రం మొండి చేయి చూపుతోందని గడచిన ఆరునెలలుగా చంద్రబాబు నాయుడు ప్రతి వేదికపైనా ధ్వజమెత్తుతున్నారు. మీడియాలో విస్త్రుత ప్రచారం సాగిస్తున్నారు. టీడీపీకి ఇది అడ్వాంటేజ్ అవుతుందో, లేదో చెప్పలేకపోయినా బీజేపీ మాత్రం భ్రష్టు పట్టిపోయింది. ఏపీలో ఎవరిని పలకరించినా కమలం పార్టీపై కస్సుమంటున్నారు. ఈ ఏడాది మొదట్లో గుంటూరులో ప్రధాని సభ నిర్వహించాలని భావించారు. కానీ కేంద్ర ఇంటిలిజెన్సు రిపోర్టులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడించాయి. దాంతో వాయిదా వేసుకున్నారు. ముందుగా పార్టీ లో ఒక సానుకూలత కల్పించి తద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ మార్చుకున్నారు. అది కూడా ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. రాష్ట్రంలో పర్యటన అంటే బీజేపీ అగ్రనాయకత్వం భయపడేలా చేయడంలో టీడీపీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. కానీ ఈ వ్యతిరేకత టీడీపీకి అనుకూలంగా మారుతుందనే గ్యారంటీ లేదు. అందువల్లనే బీజేపీని, వైసీపీని ఒకే గాటన కట్టడం ద్వారా టీడీపీ పట్ల ప్రజల్లో మొగ్గు కనిపించేలా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు. బీజేపీ నాయకుల్లో ఎక్కువ మంది వైసీపీ,జనసేనలను తమ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. ఈవిషయంలో టీడీపీ కూడా కొంత నిరుత్సాహానికి గురవుతోందనే చెప్పాలి.
కథ కంచికే…
జాతీయ పార్టీలు రెంటికీ ఏపీలో కష్టకాలమే. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో వీటికి ఏమాత్రం చాన్సు కనిపించడం లేదు. 2014లోనే కొంతమెరుగు. బీజేపీ టీడీపీతో జట్టు కట్టడంతో అయిదు అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ సీట్లు గెలుచుకోగలిగింది. కాంగ్రెసుకు గుండుసున్నా మిగిలింది. అప్పట్లో ప్రధాన పోటీ టీడీపీ,బీజేపీ కాంబినేషన్, వైసీపీల మధ్య కేంద్రీక్రుతమైంది. ఇప్పుడు జనసేన కూడా రంగంలోకి దిగింది. వామపక్షాలూ దానితో జట్టు కడుతున్నాయి. 25 నుంచి 30 సీట్లలో బలమైన త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెసు,బీజేపీలు రెండూ ఆటలో అరటి పండు పాత్రకే పరిమితం. కాంగ్రెసు, టీడీపీ ల పొత్తుపై ఆరెండు పార్టీల్లోనూ భిన్నమైన వాదనలున్నాయి. కలిసి నడిస్తే ఒకటిరెండు శాతం ఓట్లు కలిసి వచ్చి కొన్ని సీట్లలో లబ్ధి ఉంటుందని కొందరు టీడీపీ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెసు ఓటు బ్యాంకును వైసీపీ చేజిక్కించుకుంది. హస్తం పార్టీ విడిగా పోటీ చేస్తే కొంత ఓటు బ్యాంకు వైసీపీ నుంచి కాంగ్రెసుకు తిరిగి రావచ్చు. ఇది టీడీపీకి లాభదాయకంగా ఉంటుందనే మరోవాదన ఉంది. టీడీపీతో కలిసి వెళితే పది పన్నెండు స్థానాలకు పరిమితం కావాల్సి వస్తుంది. మిగిలిన 160 నియోజకవర్గాల్లో పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుందనే ఆందోళన కాంగ్రెసులో నెలకొంది. జాతీయ పార్టీ కావడం వల్ల క్రమేపీ పుంజుకునే అవకాశం ఉంటుంది. అన్ని చోట్ల 2014 కంటే అధికంగా ఓట్లు తెచ్చుకోవచ్చునని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , కేంద్రమాజీమంత్రి సూర్యప్రకాశ్ రెడ్డి వంటివారు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద పొత్తు కథ కంచికే చేరుతుందని , 2019 లో రెండు జాతీయపార్టీలకు శూన్య హస్తమే మిగులుతుందని పరిశీలకులు చెబుతున్నారు.