మూడు నెలల్లో ఎన్నెన్నో?

అమరావతి రాజధాని అన్నది మూడు ముక్కలు చేయాలని వైసీపీ గట్టిగా తీర్మానించుకుంది. దాని కోసం ఆరు నెలల పాటు తెర వెనక కసరత్తు జరిగింది. గత రెండు [more]

Update: 2020-01-24 06:30 GMT

అమరావతి రాజధాని అన్నది మూడు ముక్కలు చేయాలని వైసీపీ గట్టిగా తీర్మానించుకుంది. దాని కోసం ఆరు నెలల పాటు తెర వెనక కసరత్తు జరిగింది. గత రెండు నెలలుగా తెర ముందు కధ సాగుతోంది. అయితే దానికి అనూహ్యమని మలుపు ఇచ్చేసింది టీడీపీ. ఎంతైనా చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ కదా. తన తడాఖా ఇదీ అని చేసి చూపించారు. ఇపుడు ఎవరు అవునన్నా కాదన్నా కూడా మూడు రాజధానుల బిల్లు కధ కొన్నాళ్ళ పాటు కోల్డ్ స్టోరేజ్ లోనే అన్నది విశ్లేషకుల మాట. ఈ మధ్యలో ఎన్నో జరగవచ్చునని కూడా అంటున్నారు.

ఆ మాత్రం చాన్స్ ఇస్తే…

ఇక బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపానని చెప్పి మండలి చైర్మన్ షరీఫ్ చేతులు దులుపేసుకున్నారు. సరే ఆ తరువాత ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కమిటీ ఏర్పాటు చేయాలి, దానికి టైం బాండ్ పెట్టాలి. అది పరిశీలించి నివేదిక ఇవ్వాలి. దాని మీద మండలిలో చర్చ జరగాలి. అది మళ్ళీ అసెంబ్లీకి రావాలి. అంటే పేరుకు మూడు నెలలు అన్నా కూడా అంతకంటే ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. నిజానికి సెలెక్ట్ కమిటీకి పంపాలనుకుంటే దానికి సంబంధించిన షెడ్యూల్ వివరాలు కూడా ఇవ్వాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. తాపీగా చూసుకోవచ్చునని మండలి పెద్దలు అనుకుంటున్నారు. మరి ఈ మూడు నెలలు టైం చంద్రబాబు లాంటి రాజకీయ గండర గండడికి చాలా విలువైనది, ఎక్కువ కూడా.

స్టేటస్ కో….

ఇక మరో వైపు మూడు రాజధానుల తరలింపు కధకు న్యాయస్థానం కూడా ట్విస్ట్ ఇచ్చింది. హై కోర్టు లో దీని మీద విచారణ తరువాత ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు. పైగా ముగ్గురు సభ్యూలతో ప్రత్యేక ధర్మాసనం కూడా ఏర్పాటు చేసి మరీ ఈ కేసుని విచారిస్తారు. ఇప్పటికిపుడు అమరావతి నుంచి ఇటుక కదల్చినా కూడా అది ప్రభుత్వ సొమ్ము కిందకు రాదని, ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తామని హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల‌తో సచివాలయం తరలింపు కూడా ఆగినట్లే. అంటే యధాతధపరిస్థితి అన్నమాట.

రివర్స్ గేర్…

మరో వైపు కర్నూలుకి హైకోర్టు కావాలని అరచి గీ పెట్టిన బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఇపుడు రివర్స్ గేర్ వేస్తున్నారు. అమరావతిని దేశానికే రెండవ రాజధానిగా చేయమంటున్నారు. అంతే కాదు. సచివాలయం, హై కోర్టు కూడా అక్కడే ఉంచి. మినీ సచివాలయాలు, రెండు హైకోర్టు బెంచీలను అటు కర్నూలు, ఇటి విశాఖకు కేటాయించమని సూచిస్తున్నారు. అంటే ఓ విధంగా టీజీ కూడా అమరావతినే రాజధానిగా ఉంచమన్నారని అర్ధమైపోతోంది. ఇప్పటికి సెలెక్ట్ కమిటీకే వెళ్ళింది బిల్లు. ముందు ముందు కోర్టులకు కూడా వెళ్తుంది. ఇలా ఎన్నెన్ని పరిణామాలు జరుగుతాయోనని ఆయన చేసిన కామెంట్ చేయడం బట్టి చూస్తూంటే అమరావతి రాజధాని కధ కంచికి చేరిందనే సౌండ్ వినిపిస్తోంది.

అలా నరుక్కురావాలని…

ఇక సెలెక్ట్ కమిటీ, మూడు నెలలు, మండలి రద్దు ఇంతవరకూ వైసీపీ ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. కానీ న్యాయస్థానాల తీర్పులు ఎలా ఉంటాయో తెలియదు. ఒకసారి కేసు వెళ్తే ఇక అంతే సంగతులు. అప్పటివరకూ కూర్చోవడమే. అంటే మూడు రాజధానులు అంటూ ఆర్భాటం చేసిన జగన్ తన నాలుగేళ్ళ పదవీ కాలంలో కూడా ఈ అంశం తేలక ఇబ్బందులు పడేలా ఉందని అంటున్నారు. వైసీపీ నేతలకు వ్యూహాలు లేవు, అందుకే మండలిలో బిల్లు అలా కోల్డ్ స్టోరేజికి పోయింది. ఇక శాసన మండలి రద్దు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా కూడా వైసీపీక నష్టమని అంటున్నారు. మొత్తానికి ఎలా ఆపుతారో చూస్తామన్న వైసీపీ నేతలకు బాబు ఆపి చూపించేశారు. ముందు ముందు కూడా ఇలాగే జరుగుతుందని తమ్ముళ్ళు అంటున్నారు.

Tags:    

Similar News