ఆర్ కే అంతా చెప్పేశారుగా…?

ఒక జర్నలిస్టుగానే కాకుండా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరునిగా ఆ పార్టీ వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ. ఆ పార్టీకి మద్దతుగా, [more]

Update: 2021-03-21 08:01 GMT

ఒక జర్నలిస్టుగానే కాకుండా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరునిగా ఆ పార్టీ వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ. ఆ పార్టీకి మద్దతుగా, శ్రేయస్సును కోరుకుంటూ తన పాత్రికేయాన్ని సమయోచితంగా, సమర్థంగా వినియోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పార్టీకి మేలు చేస్తున్నాననే భావనలో తప్పుదారి పట్టించిన ఉదంతాలకూ కొదవ లేదు. తాజా కొత్త పలుకులో ఆయన రాసిన కథనం మాత్రం టీడీపీ భవిష్యత్ అగమ్య గోచరమని తేల్చి చెప్పేసింది. పార్టీ నాయకత్వంపై అంటే చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తారనే ముద్ర, 2014-19 మధ్య కాలంలో ప్రబలమైన కులం ముద్ర పార్టీకి చేటు తెస్తున్నాయన్న విషయాన్ని ఎత్తి చూపారు. పార్టీలో క్యాడర్ కు చంద్రబాబు పైన, నాయకులపైన నమ్మకం పోవడానికి ఇవే కారణాలని విశ్లేషించారు. దాంతో పాటు నలభై ఏళ్లపాటు ఎన్టీఆర్ నిర్మించిన పునాదుల కారణంగానే తెలుగుదేశం నిలిచిందన్న కఠోర వాస్తవాన్ని కళ్లకు కట్టారు. చంద్రబాబు నాయుడి చాణక్యం కారణంగానే పార్టీ మనుగడలో ఉందనే బావన చాలా మందిలో ఉంది. అటువంటి టీడీపీ శ్రేణులకు, అధినేత వంది మాగధులకు కళ్లు తెరిపించేశారు రాధాకృష్ణ. ఎన్టీయార్ కారణంగా కొనసాగిన శకం ముగిసింది. పార్టీ పునర్నిర్మాణం జరగాలి. కొత్త తరం రావాలి. లేకపోతే మనుగడ అగమ్య గోచరమన్న అంశాన్ని పరోక్షంగానే తేల్చి చెప్పేశారు ఆర్ కే. జాతీయ రాజకీయాల్లో దాదాపు రెండు దశాబ్దాలు, తెలుగు రాష్ట్రంలో నలభై ఏళ్లపాటు కీలక భూమిక పోషించిన పార్టీ దుస్తితిని ఇంతకంటే చక్కగా ఎవరూ చెప్పలేరు. పార్టీకి పెద్ద నాయకులమని చెప్పుకునే వారు భారంగా మారుతున్నారు. రాధాకృష్ణ మాటల్లో ఆలోచించి చూస్తే తెలుగుదేశం భవిష్యత్ ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది.

అయిపోయింది…టీడీపీ

నలభై సంవత్సరాల క్రితం ఎన్టీరామారావు పార్టీని స్థాపించినప్పుడు కుల,మత , ప్రాంతాలకు అతీతంగా తెలుగుదేశానికి నీరాజనాలు పట్టారు ప్రజలు. రామారావు జనసమ్మోహక శక్తి పార్టీకి ప్రాణమై నిలిచింది. సంక్షేమమే కాదు, పాలన సంస్కరణలు, బీసీ రిజర్వేషన్లు, మహిళా హక్కులు వంటి అనేక విషయాల్లో రామారావు విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త దిశను నిర్దేశించారు. రామారావును గద్దె దించి పార్టీ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు నిలదొక్కుకోవడానికి పార్టీని అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు. ధన ప్రాబల్యం పెంచేశారు. పార్టీలో అవినీతి పెరిగింది. కులపరమైన సమీకరణలు మొదలు పెట్టారు. అధికారం కోసం ప్రాంతాల వారీ ఉద్యమాలకు మద్దతు పలకడమూ టీడీపీకి అలవాటు చేశారు. అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెసు కు ప్రత్యామ్నాయంగా ప్రకంపనలు పుట్టించిన తెలుగుదేశాన్ని అదే పార్టీతో జట్టు కట్టించారు. మొత్తమ్మీద అవకాశ వాద రాజకీయంగా చంద్రబాబు నాయుడి హయాంలో తెలుగుదేశానికి ముద్ర పడిపోయింది. దాంతో నలభై ఏళ్లపాటు ఏదోలా మనుగడ సాగించిన పార్టీకి అవసాన దశ వచ్చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలికినప్పుడే ఆ ప్రాంతంలో పార్టీకి నూకలు చెల్లిపోయినట్లే. తాత్కాలిక ప్రయోజనం తప్ప అస్తిత్వ ప్రశ్న తలెత్తింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లోనూ వైసీపీ రూపంలో బలమైన ప్రాంతీయ నాయకత్వం రావడంతో టీడీపీ పరిస్థితి అయోమయంగా మారింది. దీని నుంచి బయటపడాలంటే టీడీపీ పునర్నిర్మాణం సాగాలి. తరం మారాలి. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఏకీభవిస్తున్నాయి.

బాబు..భయమూ..భక్తి…

చంద్రబాబు నాయుడంటే భయమూ, భక్తి లోపించాయి. నిజమే వాడుకుని వదిలేస్తారనే అపనమ్మకంతో పార్టీలో నాయకులకు నాయకత్వమంటే విశ్వాసం సన్నగిల్లింది. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ కోసం తెగించి పనిచేయాలన్న తపన పార్టీ దిగువస్థాయి నాయకత్వానికి లేకుండా పోయింది. అగ్రనాయకుడు తమకు అండగా నిలుస్తాడనే నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన అనుచర గణాన్ని కాపాడుకుంటూ వచ్చారు. చట్టపరమైన కేసుల్లో ఇబ్బందులు పడుతున్పప్పుడు అండగా నిలిచారు. చంద్రబాబు నాయుడిలో ఆ చొరవ లోపించింది. అదే పార్టీ నాయకత్వంపై భక్తి లేకపోవడానికి కారణం. అవసరాన్ని బట్టి నాయకులకు అందలం ఎక్కించడం, క్రమ శిక్షణ తప్పినప్పటికీ పట్టించుకోకపోవడం కూడా నాయకత్వ లోపాలకు కారణం. దీనిని కూడా రాధాకృష్ణ ఎత్తి చూపడం తెలుగుదేశం పార్టీకి సరైన సూచనే. కులం ప్రభావం చంద్రబాబు నాయుడి సమయంలో ఎక్కువ కావడమూ ఆయన పట్ల పార్టీలో గౌరవాన్ని కుదించి వేసిందనే చెప్పాలి.

జనసేన సాకు మాత్రమే…

ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడంతోనే ఇంతటి ఘోర పరాజయం పాలయ్యామని తెలుగుదేశం సమర్థించుకోవాలనుకోవడం ఆత్మవంచనే. జనసేన ప్రభావం ఒకటి రెండు జిల్లాలకే పరిమితమైంది. అదీ మొత్తమ్మీద 40 లోపు వార్డులకే. అయినా ప్రతిపక్షాలు పోటీ పడటం సహజం. తమ బలాన్ని పెంచుకోవడం ద్వారానే అధికారపార్టీపై ఆదిక్యం సాధించాలి. అంతా కలిస్తేనే మేము గెలుస్తామంటే స్వయంగా బలహీనతను ఒప్పుకున్నట్లే. అదే విధంగా ఓట్లు వేయని ప్రజలను నిందించడం కూడా పార్టీకి ఉపయోగపడే విషయం కాదు. మొత్తమ్మీద తెలుగుదేశం ప్రక్షాళన సాగకపోతే భవిష్యత్ అంధకారమయమన్న విషయాన్ని రాధాకృష్ణ చెప్పకనే చెప్పేశారు. అదే సమయంలో రాజకీయాలను విస్మరించారు. విలువలను పట్టుకుని వేలాడుతున్నారంటూ చంద్రబాబును సమర్థించేందుకూ ప్రయత్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయడం విలువలను పట్టుకోవడమెందుకవుతుంది? అదే సమయంలో నంద్యాల వంటి ఎన్నికలను ప్రతిస్ఠాత్మకం చేయడం, పసుపు కుంకుమల పేరిట ఎన్నికల కు ముందు నిధుల సంతర్పణ చేయడం వంటివీ టీడీపీకి కలిసి రాలేదు. మొత్తమ్మీద శ్రేయోభిలాషి రాధాకృష్ణ సైతం నిందిస్తున్నారంటే టీడీపీ చాలా కష్టాల్లో ఉన్నట్లే. దిద్దుబాటు చర్యలకు దిగకపోతే ప్రమాదమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News