పళనిస్వామిపై పళ్లు నూరుతుంది అందుకేనా?

తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూటమిలో పార్టీలు కత్తులు నూరుతున్నాయి. ప్రధానంగా అధికార అన్నాడీఎంకే పైన కూటమిలోని పార్టీలు గుర్రుగా ఉన్నాయి. అవసరమైతే కూటమి నుంచి [more]

Update: 2020-03-17 17:30 GMT

తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూటమిలో పార్టీలు కత్తులు నూరుతున్నాయి. ప్రధానంగా అధికార అన్నాడీఎంకే పైన కూటమిలోని పార్టీలు గుర్రుగా ఉన్నాయి. అవసరమైతే కూటమి నుంచి తప్పు కుంటామని హెచ్చరిస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే బీజేపీ ఎన్నికల సమయానికి తప్పుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే నాయకత్వ లేమితో అవస్థలు పడుతున్న అన్నాడీఎంకేతో కలసి పోటీ చేసేకంటే ఒంటరిగా పోటీ చేయడమో? లేక రజనీకాంత్ పెట్టబోయే పార్టీతో కలసి నడవాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది.

కూటమిని ఏర్పాటు చేసి…..

గత పార్లమెంటు ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమి బలంగా కన్పించింది. ఈ కూటమిలో బీజేపీ, డీఎండీకే (విజయకాంత్ పార్టీ), పీఎంకే, టీఎంసీ తదితర పార్టీలు ఉన్నాయి. అయినా పార్లమెంటు ఎన్నికల్లో ఈ కూటమి పూర్తిగా చతికలపడింది. కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. దీంతో బీజేపీ నాయకత్వం ఆలోచనలో పడింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పోటీ చేయకూడదని ఇప్పటికే ఆ పార్టీ నిర్ణయించుకుంది.

రాజ్యసభ ఎన్నికలు కూడా….

ఇక తాజగా రాజ్యసభ సభ్యుల ఎంపిక కూడా కూటమిలో విభేదాలు తలెత్తేలా చేశాయనే చెప్పాలి. రాజ్యసభ పదవిని డీఎండేకే కోరుకుంది. విజయకాంత్ సతీమణి ప్రేమలత సోదరుడు సుదీశ్ కు రాజ్యసభ పదవి ఇవ్వాలని డీఎండీకే కోరింది. అయితే అన్నాడీఎంకే వారికి ఇవ్వలేదు. టీఎంసీ అధ్యక్షఉడు జీకే వాసన్ కు ఇవ్వడంపై మండిపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విజయకాంత్ కు ఉన్న ఆదరణను కూడా అన్నాడీఎంకే లెక్క చేయకుండా వాసన్ కు ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కూటమిలో కొనసాగాలా? లేదా? అన్న విషయంపై వారు ఆలోచిస్తున్నారు.

ఒక్కొక్క పార్టీ….

కూటమిలోని మరో పార్టీ పీఎంకే కూడా కూటమిలో కొనసాగే విషయంపై పునరాలోచనలో పడింది. పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్సుమణి కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. అధికారంలోకి రావడానికే పీఎంకేను ఏర్పాటు చేశామని, ఇతరులను కుర్చీలో కూర్చోబెట్టేందుకు కాదని పరోక్షంగా అన్నాడీఎంకే ను ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలు వేరు కుంపటి పెట్టుకోవడానికా? లేక ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా అధిక సీట్లను తమకు కేటాయించుకునేందుకా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద పళనిస్వామి కూటమిలోని పార్టీలను కట్టడి చేయడం కష్టసాధ్యంగానే కన్పిస్తుంది.

Tags:    

Similar News