జగన్ డెసిషన్ వారికి కలిసొస్తుందా?

అవును…. ఇప్పుడు రాష్ట్రంలో రాజ‌కీయంగా తీవ్రమైన చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల‌ను పార్లమెంటు స్థానాల ఆధారంగా 25 నుంచి 26 వ‌రకు [more]

Update: 2020-07-18 00:30 GMT

అవును…. ఇప్పుడు రాష్ట్రంలో రాజ‌కీయంగా తీవ్రమైన చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల‌ను పార్లమెంటు స్థానాల ఆధారంగా 25 నుంచి 26 వ‌రకు జిల్లాలుగా చేయాల‌ని భావిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల మేర‌కు ఇలా జిల్లాల ఏర్పాటును చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. దీనివ‌ల్ల రాజ‌కీయంగా వైసీపీకి, టీడీపీకి.. అదేస‌మ‌యంలో బీజేపీకి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు ఏమేర‌కు ల‌బ్ధి చేకూర‌నుంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. లేదా.. న‌ష్టపోయే పార్టీలు ఏమిట‌నేది కూడా చ‌ర్చకు వ‌చ్చింది. రాష్ట్రంలో జిల్లాల విభ‌జన ద్వారా.. త‌మ‌కు జ‌రిగే లాభ న‌ష్టాల‌పై ఆయా పార్టీలు ఇప్పటికే మేధో మ‌ధ‌నం చేప‌ట్టాయి. పార్టీల వారీగా చూస్తే.. లాభ న‌ష్టాలు డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ప్రజల చెంతకు పాలన….

వైసీపీ: అధికారంలో ఉన్న వైసీపీ జిల్లాల విభ‌జ‌న ద్వారా.. ప్రజ‌ల‌కు మేలు చేశామ‌నే కోణంలో ప్రచారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. పాల‌న‌ను మ‌రింత చేరువ‌గా ప్రజ‌ల‌కు అందించ‌డం ద్వారా భ‌ళా! అనిపించుకునేందుకు కూడా ప్రయ‌త్నాలు చేస్తోంది. జిల్లాల విభ‌జ‌న‌తో ఇప్పటికే 22 పార్లమెంటు స్థానాల్లో విజ‌యం సాధించిన‌ వైసీపీకి గ‌ట్టి పునాదులు ఏర్పాటు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి బ‌లంగా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పై గ‌ట్టి దెబ్బకొట్టి.. వాటిని బ‌లోపేతంగా ఉన్న వైసీపీ పార్లమెంటు స్థానాల్లో క‌లిపేందుకు ప్రయ‌త్నాలు చేస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి తిరుగు ఉండ‌ద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. ఈ కోణంలోనే వైసీపీ ఆలోచిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతిమంగా తెలంగాణ ఫార్ములా ఇక్కడ కూడా స‌క్సెస్ అవుతుంద‌నే భావ‌న వ్యక్తమ‌వుతోంది.

బలం తగ్గుతుందా? పెరుగుతుందా?

టీడీపీ: జిల్లాల విభ‌జ‌న అనే అంశంపై ఈ పార్టీ త‌ర్జన భ‌ర్జన ప‌డుతోంది. ఇప్పటికే పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీనంగా ఉండ‌డం, 2014లోనూ కేవ‌లం 16 స్థానాల్లోనే విజ‌యం సాధించ‌డం, అవి 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి 3కు ప‌డిపోవ‌డంతో ఇప్పుడు జిల్లాల విభ‌జ‌న జ‌రిగితే.. మ‌రింత‌గా పార్టీ బ‌లం త‌గ్గిపోతుంద‌నే ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో ఓటు బ్యాంకుపై కూడా ప్రభావం ప‌డుతుంద‌నే భావ‌న ఉంది. గిరిజ‌న ప్రాబ‌ల్యం ఉన్న జిల్లాలు క‌నుక ఏర్పడితే.. ఆయా జిల్లాల్లో టీడీపీ పుంజుకునే అవ‌కాశం అంతంత మాత్రంగానే ఉంటుంది. అదేవిధంగా కృష్ణాజిల్లాను రెండు ముక్కలు చేసినా.. కీల‌క‌మైన క‌మ్మ ఓటు బ్యాంకు చీలిపోయే ప్ర‌మాదం ఉంది. ఇలా రాష్ట్రంలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. దీంతో జిల్లాల విభ‌జ‌న‌ను అడ్డుకునేందుకు ప్రయ‌త్నాలు ముమ్మరం చేయొచ్చు.

పునాదులు బలపడతాయా?

బీజేపీ : ఆది నుంచి చిన్న రాష్ట్రాల‌కు జై కొడుతున్న క‌మ‌ల నాథులు.. చిన్న జిల్లాల‌కు కూడా జైకొడ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ‌లోనూ జిల్లాల ఏర్పాటును బీజేపీ నేత‌లు స‌మ‌ర్ధించుకున్నారు. ఫ‌లితంగా పార్టీ పునాదులను బ‌లోపేతం చేసుకునేందుకు వారికి అవ‌కాశం చిక్కుతుంద‌నే భావ‌న వీరిలో ఉంది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ పుంజుకుంది. పార్టీ ప‌రంగా కూడా అడుగులు ముందుకు వేసింది. ఏపీలో నూ ఇదే త‌ర‌హా మంత్రం ప‌ఠించే అవ‌కాశం ఉంది. అయితే, గిరిజ‌నులు, ఎస్సీ, ఎస్టీ ప్రాబ‌ల్యం వున్న అర‌కు, తిరుప‌తి, బాప‌ట్ల వంటి నియోజ‌క‌వ‌ర్గాలు జిల్లాలుగా ఏర్పడితే అక్కడ మాత్రం బీజేపీ మ‌రింత క‌ష్టప‌డ‌డం త‌ప్పదు. మిగిలిన వాటిలో పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని క‌మ‌ల నాథులు లెక్కలు వేస్తున్నారు. దీంతో వీరు జిల్లాల ఏర్పాటుకు సై అంటున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మేధోమ‌థ‌న కార్యక్రమంలోనూ దీనికి వారు సై అన‌డం గ‌మ‌నార్హం.

పెద్దగా లాభం లేదు…..

క‌మ్యూనిస్టులు: రాష్ట్రాల విభ‌జ‌న‌, కొత్త జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ విష‌యంలో సీపీఐ అనుకూలంగానే వ్యవ‌హ‌రించినా.. సీపీఎం మాత్రం మౌనం పాటించింది. సీపీఐ చిన్న జిల్లాలు, రాష్ట్రాల విభ‌జ‌న‌తో పుంజుకోవ‌చ్చని భావించినా.. ఆ ప్రయ‌త్నంలో అడుగులు వెన‌క్కి ప‌డ్డాయి. ఇక‌, సీపీఎం ఎటూ కాకుండా పోయిన ప‌రిస్థితి అటు తెలంగాణ‌, ఇటు ఏపీల్లోనూ గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో చిన్న జిల్లాల‌ను ఏర్పాటు చేస్తే.. సీపీఎం వ్యతిరేకించే అవ‌కాశం ఉంది. సీపీఐ స‌మ‌ర్ధించినా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఓటు బ్యాంకు రాజ‌కీయంగా ఈ రెండు పార్టీలూ పుంజుకునే ప‌రిస్థితి లేదు. సో.. జిల్లాల విభ‌జ‌న‌పై ఈ రెండు పార్టీల వైఖ‌రిని పెద్దగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

జనసేనకు ఫలితమేనా?

జ‌న‌సేన‌: ఓటు బ్యాంకు మాట అలా ఉంచితే.. నాయ‌కుడి ప‌రంగా రాజ‌కీయాల్లో ఒకింత ప్రభావం చూపించ‌గ‌ల పార్టీ జ‌న‌సేన‌. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓటు బ్యాంకు పెద్దగా ఆశించిన విధంగా రాక‌పోయినా.. కొద్ది ప్రయ‌త్నంతో రాజ‌కీయ శూన్యత‌ను భ‌ర్తీ చేసేందుకు ప్రయ‌త్నిస్తే.. ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, జిల్లా ఏర్పాటు విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితే ఉంటుంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఉత్తరాంధ్రలో కొంచెం ప‌ట్టు ఉన్నప్పటికీ.. మెరుగులు దిద్దాల్సిన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో కోస్తాలోనూ జిల్లాల ఏర్పాటును స‌మ‌ర్ధిస్తే.. పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉంటుంది. కొన్ని కీల‌క‌మైన జిల్లాల్లో కాపుల ఓటు బ్యాంకు ప‌వ‌న్‌కు అనుకూలంగా మారే అవ‌కాశం ఉంది. ఇలా మొత్తంగా ఈ పార్టీల‌న్నీ కూడా జ‌గ‌న్ తీసుకోబోయే నిర్ణయంతో త‌మ పార్టీల భ‌విత‌వ్యంపై త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నాయ‌నేది వాస్తవం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News