తండ్రి ఆశయ సాధనకు నడుం కట్టిన జగన్ …

ఆయనకు రైతులంటే ప్రాణం. తన ఊపిరి ఉన్నంత వరకు వారికోసమే ఎక్కువ శ్రమించారు కూడా. దేశానికి వెన్నెముక గా చెప్పుకునే రైతుల ఆత్మహత్యల నివారణకు డాక్టర్ రాజశేఖర [more]

Update: 2019-07-08 07:00 GMT

ఆయనకు రైతులంటే ప్రాణం. తన ఊపిరి ఉన్నంత వరకు వారికోసమే ఎక్కువ శ్రమించారు కూడా. దేశానికి వెన్నెముక గా చెప్పుకునే రైతుల ఆత్మహత్యల నివారణకు డాక్టర్ రాజశేఖర రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేసి వారికి తోడై అండగా నిలిచారు ఆయన. అందుకే అన్నదాతల గుండెల్లో దశాబ్దం గడిచినా వైఎస్ కొలువై వున్నారు.

తండ్రికి మించి చేయాలనే ….

స్వర్గీయ వైఎస్ జయంతి సందర్భంగా ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి, ప్రభుత్వానికి చెరగని కార్యక్రమం ఇడుపుల పాయలో డాక్టర్ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పించి జమ్మలమడుగు లో మొదలు పెట్టారు. ఎపి లో వైఎస్ జయంతిని రైతు దినోత్సవం గా ప్రకటించడంతో పాటు రైతులకు అవసరమైన అన్ని ప్రయోజనాలను కల్పించేందుకు సంకల్పించడం విశేషం. ఇప్పటికే రాష్ట్రంలో అగ్రికల్చరల్ మిషన్ ను ప్రకటించి పూర్తి స్థాయిలో కార్యాచరణ మొదలు పెట్టారు కొత్త ముఖ్యమంత్రి. స్వర్గీయ వైఎస్ రైతులకోసం చేసిన కార్యక్రమాలకు మించి చేయాలన్నదే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నారు. తద్వారా తమది నిజమైన రైతు ప్రభుత్వంగా చాటిచెప్పాలన్నది ఆయన ఆలోచన గా కనిపిస్తుంది.

రైతు భరోసా కౌలు రైతులకు …

కౌలు రైతులకు ప్రభుత్వం ప్రకటించే ఏ సంక్షేమం అమలు కావడం లేదు. భూ యాజమాన్య హక్కులకు భంగం వాటిల్లుతుందని ఫలితంగా ఆ వర్గం నుంచి తమకు వ్యతిరేకత వ్యక్తం అవుతుందని భయపడి ప్రభుత్వాలు సైతం కౌలు రైతుల కోసం చెప్పేదొకటి చేసేది మరొకటి చేస్తున్నాయి. అయితే ఎపి లో కొలువైన జగన్ సర్కార్ రైతు భరోసా ను కౌలు రైతులకు అమలు చేసే సాహసోపేత నిర్ణయం తీసుకుంది. భూ యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు అన్ని విధాలా అండగా వుండే కార్యక్రమాన్ని అధ్యయనం చేసి వారికి న్యాయం చేసే దిశగా నడవడానికి ముందుకు రావడం పట్ల ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పంట భీమా మొదలు కొని, రైతుల అకాల మరణాలతో ఆయా కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఆర్ధికంగా వారిని ఆదుకునే ప్రక్రియపై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టింది. సుమారు ఏడు లక్షల రూపాయల నష్టపరిహారం ఆ కుటుంబానికి అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక అగ్రికల్చరల్ మిషన్ ద్వారా పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వారికి పూర్తి స్థాయి ఆర్ధిక భద్రత ఇవ్వాలన్నది జగన్ ఆలోచన. తన తండ్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి రైతులకు చేసిన సాయంకి మించి చేయాలన్న తపనతోనే ఎపి సిఎం అడుగులు వేయడం విశేషం.

ఎపి అభివృద్ధికి వారే సారధులు ….

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణ మాదిరి పరిశ్రమలు లేవు. హైదరాబాద్ లాంటి ఆదాయం సమకూర్చే అక్షయ పాత్ర లేదు. అన్ని వైపులా సమస్యలే. ఈ పరిస్థితుల్లో వున్న ఆంధ్రప్రదేశ్ కి వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. సరైన గిట్టుబాటు ధర కల్పించడం, పండించిన పంట ను కాపాడుకునేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేయడం, దళారి వ్యవస్థను క్రమంగా తొలగిస్తే ఎపి వ్యవసాయ రంగంలో పరుగులు పెడుతుంది. ఆధునిక వ్యవసాయ విధానం పై రైతులకు అవగాహనా శిక్షణ కల్పిస్తే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక ఎదుగుదలకు తిరుగు ఉండదు. తద్వారా అనేక రాష్ట్రాలకన్నా తలసరి ఆదాయంలో వెనుకబడి దిగాలుపడిన ఎపి ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టం అవుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్త సర్కార్ వైఎస్ జయంతి ని రైతు దినోత్సవంగా ప్రకటించడమే కాదు సరికొత్త అడుగులతో ముందుకు వెళ్లడం అభినందనీయమే అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News