ఎక్కడుందీ లోపం..?

ఢిల్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏడు మందిని కొనుగోలు చేసేందుకు [more]

Update: 2019-05-08 18:29 GMT

ఢిల్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏడు మందిని కొనుగోలు చేసేందుకు బీజేపీ సిద్ధమయిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తమ పార్టీలో చేేరేందుకు ఏడుగురు కాదు పథ్నాలుగు మంది ఆప్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి విజయ్ గోయల్ అన్న విష‍యమూ విదితమే. అయితే ఆమ్ ఆద్మీ పార్టీని ఇప్పటికి ఇద్దరు ఎమ్మెల్యేలు వదలి పెట్టి వెళ్లిపోయారు.

ఎన్నికల సమయంలో….

లోక్ సభ ఎన్నికల సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని విడిచి పెట్టి వెళ్లడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఒక ఎమ్మెల్యేను గతంలో పార్టీ సస్పెండ్ చేసింది. ఢిల్లీలోని బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి 2015 ఎన్నికల్లో గెలిచిన దేవేంద్ర కుమార్ షెహ్రావత్ ను పార్టీ 2016లోనే సస్పెండ్ చేసింది. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది.

ఇబ్బందికరంగా….

అప్పటి నుంచి రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న దేవేందర్ షెహ్రావత్ తాజాగా కేంద్రమంత్రి విజయ్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరారు. అంతకు కొద్ది రోజులు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అనిల్ బాజ్ పేయి కూడా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ ఇలా వరసపెట్టి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటం కోలుకోలేని దెబ్బగా విశ్లేషకుల భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల ప్రచారంలో తలమునకలై ఉన్న ఆప్ అధినేతకు ఎమ్మెల్యేలు చేజారిపోవడం ఇబ్బందికరంగా మారింది.

ఒంటెత్తు పోకడలే….

అయితే అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలతోనే పార్టీని ఎమ్మెల్యేలు వీడుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. గతంలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో విభేదాలు పెట్టుకోవడంతో పనులు సక్రమంగా జరగడం లేదని ఆప్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆవేదన చెందుతున్నారు. అనేక అంశాల్లో అరవింద్ సమిష్టి నిర్ణయాన్ని తీసుకునేందుకు ఇష్టపడరని, అందుకే ఆప్ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదన్న వ్యాఖ్యలూ విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News