చూసి నేర్చుకోండయ్యా?

సింప్లిసిటీ… అవినీతి రహిత పాలన…. తాయిలాలు లేవు. కులం లేదు. మతం లేదు.  కేవలం బతకడానికి అవసరమైన సౌకర్యాలను మాత్రం కల్పించారాయన. అదే ఆయనకు మూడోసారి శ్రీరామరక్షగా [more]

Update: 2020-02-11 16:30 GMT

సింప్లిసిటీ… అవినీతి రహిత పాలన…. తాయిలాలు లేవు. కులం లేదు. మతం లేదు. కేవలం బతకడానికి అవసరమైన సౌకర్యాలను మాత్రం కల్పించారాయన. అదే ఆయనకు మూడోసారి శ్రీరామరక్షగా నిలిచింది. నిజంగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కేజ్రీవాల్ విజయం ఒక లెస్సన్ కావాలి. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తే విజయం తథ్యమని కేజ్రీవాల్ మరోసారి నిరూపించారు. పసుపు కుంకుమలు లేవు. ఫీజు రీఎంబర్స్ మెంట్ లేదు. ఉచిత నగదు పథకాలు అసలే లేవు. ఎన్నికల పెట్టుబడులు అసలే లేవు. కానీ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ ఓటరు పట్టం కట్టారు.

స్థానిక అంశాలపైనే…

స్థానిక అంశాలపైనే కేజ్రీవాల్ దృష్టి పెట్టారు. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సమస్యలకు పరిష్కారం చూపడంపైనే కేజ్రీవాల్ దృష్టిపెట్టారు. ఎవరైనా ఒకసారి గెలిస్తే అదృష్టమనుకుంటారు. రెండోసారి గెలిస్తే గాలివాటమని సరిపెట్టుకోవచ్చు. కానీ మూడోసారి గెలిచిన కేజ్రీవాల్ గెలుపు వెనక రహస్యమేంటో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోదీని ఎదుర్కొని ధీటుగా గద్దెపైకి ఎక్కారు.

మౌలిక సౌకర్యాలపైనే….

ప్రతి మనిషికి అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని ఇరవై లీటర్లు ఉచితంగా అందించారు. 2013 ఎన్నికల్లో ఆప్ గెలుపునకు దోహదపడిన విద్యుత్తును ఈ ఎన్నికల్లో చక్కగా వినియోగించుకున్నారు. విద్యుత్తు రాయితీలతో పేద, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోగలిగారు. ప్రజల నాడిని పసిగట్టి వారికి నమ్మకమైన రాయితీలను మాత్రమే ప్రకటించగలిగారు. మరో ముఖ్యమైనది వైద్యం. ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్ ను ఏర్పాటు చేసి ఉచిత వైద్యాన్ని పేదల చెంతకు తీసుకెళ్లగలిగారు. ప్రతిరోజూ తనను 500 మంది సామాన్యులు కలిసేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించారు. దీనివల్ల ముఖ్యమంత్రి ప్రజలకు దగ్గరగా ఉన్నారన్న సంకేతాలు వెళ్లాయి.

నమ్మకం కల్గించి……

ఇక మహిళలకు బస్సుల్లో ప్రయాణ రాయితీ కూడా ఆకట్టుకుందనే చెప్పాలి. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఏకపక్షంగా అనేక ప్రాంతాల్లో విజయాన్ని చేజిక్కించుకుంది. గతంలో కంటే సీట్లు తగ్గి ఉండవచ్చు. కేజ్రీవాల్ పరపతి తగ్గిపోయిందని దీనివల్ల అనుకోలేం. ఎందుకంటే కేవలం తమకు ఉపశమనం కల్గించే నేతగా కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు చూశారని చెప్పొచ్చు. ఇప్పటికైనా దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఉచిత నగదు పంపిణీ, వ్యక్తిగత ప్రయోజనాలపై దృష్టిపెట్టకుండా సామాజిక సమస్యలను పరిష్కరిస్తే గెలుపు వాకిట ముంగిట్లో ఉంటుందన్నది కేజ్రీవాల్ నిరూపించారు. ఫలితమే ఆయనకు అనూహ్య విజయం. దటీజ్ కేజ్రీవాల్.

Tags:    

Similar News